రివ్యూ: పులి
రేటింగ్: 1.5/5
బ్యానర్: ఎస్కెటి స్టూడియోస్
తారాగణం: విజయ్, శ్రీదేవి, శృతిహాసన్, హన్సిక, సుదీప్, ప్రభు, నందిత శ్వేత తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కూర్పు: ఏ. శ్రీకర్ ప్రసాద్
ఛాయాగ్రహణం: నటరాజన్ సుబ్రమణియమ్
నిర్మాత: శిబు తమీన్స్, పి.టి. సెల్వకుమార్
కథ, కథనం, దర్శకత్వం: చింబు దేవన్
విడుదల తేదీ: అక్టోబర్ 2, 2015
బాహుబలి, రోబోలాంటి చిత్రాలు దక్షిణాది చిత్రాల్లో అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో తమిళ చిత్ర సీమ నుంచి తాజాగా వచ్చిన ఫాంటసీ/అడ్వెంచర్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. భారీ తారాగణం, విఎఫ్ఎక్స్ కారణంగా ఈ తమిళ చిత్రాన్ని వివిధ భాషల్లోకి అనువదించారు. చింబుదేవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కథ, కథనాలు ఆకట్టుకోలేకపోవడం సంగతి అటుంచి కనీసం అతని ఇమాజినేషన్, విజువలైజేషన్ అయినా ఊరటనివ్వలేకపోయింది.
ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలాంటి ఆసక్తి కలిగించని ప్రేమ సన్నివేశాలు, కడుపు దేవేసే కామెడీ దృశ్యాలతో గడిచిపోతుంది. ఇంటర్వెల్ పాయింట్‌కి గానీ 'అడ్వెంచర్' మొదలు కాదు. కనీసం అక్కడ్నుంచి అయినా వింతలు చూపిస్తూ, మాయలతో అలరిస్తాడని ఆశిస్తే బ్లాక్ టైగర్‌తో విజయ్ పోరాడే దృశ్యంతోనే ముందు ముందు కనబోయే ప్రపంచం ఎలాగుంటుందనే దానిపై ఒక ఐడియా వచ్చేస్తుంది. శ్రీదేవి ఎంట్రీతో కాస్త ఆశలు చిగురిస్తాయి.. అయితే అంతటి ప్రతిభగల నటి కూడా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో తెలియని అయోమయాన్ని చింబుదేవన్ సృష్టించడంతో 'పులి'కి ఫలహారమైపోవడం ఖాయమనే సంగతి అప్పటికీ గ్రహించని వారికి సైతం బోధపడుతుంది.
ఏ దశలోను దర్శకుడు తన ఊహా ప్రపంచాన్ని కనువిందుగా చూపించలేకపోయాడు. ఇలాంటి సినిమాల్లో బేసిక్ ప్లాట్ సరిగ్గా కుదరకపోయినా కానీ ఆ ఊహాలోకం, అందులో పాత్రలు చేసే ప్రయాణం కాస్తయినా ఆసక్తి కలిగిస్తాయి. 'పులి' చిత్రంలో ఔరా అనిపించే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటీ లేకపోగా.. కనీసం బేసిక్ విషయాలపై కూడా శ్రద్ధ పెట్టిన దాఖలాలు కనిపించవు. అసలు హీరో స్టయిలింగే చాలా చెత్తగా ఉంది. హెయిర్ డై, కాంటాక్ట్ లెన్సెస్, మెటల్ బకిల్స్ ఉన్న లెదర్ బెల్టులతో కూడిన జాకెట్… అసలు ఏ కాలం నాటి సినిమా తీస్తున్నారని అనుకోవాలో అర్థం కాదు. ఆ మాటకొస్తే స్టయిలింగ్ పరంగా లీడ్ క్యారెక్టర్స్‌లో ఒక్కరికీ సరైన లుక్ డిజైన్ చేయలేకపోయారు. చంబల్లోయలాంటి గిరిజన కోనలో ఆ ఆభరణాలతో శృతిహాసన్ ఎందుకంత ప్రత్యేకంగా ఉందో దర్శకుడే చెప్పాలి. యువరాణి పాత్ర చేసిన హన్సికకి, 'మందార మల్లి' శృతిహాసన్‌కి తేడా కూడా కనిపించదు. ఇక శ్రీదేవి అయితే.. హాలోవీన్ కాస్టూమ్స్, గెటప్‌తో హడలగొడుతుంది.
ఆమె ముందు రాజనర్తకిలా తన కూతురే నాట్యం చేసే దృశ్యంలో శ్రీదేవి సింహాసనంపై కూర్చుని ఇచ్చే ఎక్స్ప్రెషన్లు చూస్తే, అంతకు ముందు ఆమె సినిమాలేవీ చూసి ఎరుగని ఈతరం ప్రేక్షకులు.. ఈవిడగురించేనా మా నాన్న, తాతలు అంత 'డబ్బా' కొట్టింది అనేసుకుంటారు. శ్రీదేవి చేష్టలుడిగి చూస్తుండిపోయిన సినిమాలో 'లిమిటెడ్ టాలెంట్' ఉన్న సూపర్‌స్టార్ విజయ్ ఇంకేం చేస్తాడు? ఒక్కో దశలో ధీరుడిగా విజయ్ కంటే.. 'అనగనగా ఓ ధీరుడు'లో సిద్ధార్థ్ బెటర్‌గా ఉన్నాడేమో అనిపిస్తుంది. సుదీప్లాంటి మరో ప్రతిభావంతుడు కూడా ప్రతి సీన్లో తనకి తగిలించిన జులపాల చాటున మొహం దాచుకోవాలని చూసాడు. వీళ్లే ఇలా తేలిపోయాక ఇక హీరోయిన్ల గురించి ప్రస్తావించాల్సిన అవసరమే లేదనుకుంట.
ఛాయాగ్రహణం బాగుంది కానీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం ఈమధ్య పెరిగిన మన సినిమా స్టాండర్డ్స్‌ని ఏమాత్రం మ్యాచ్ చేయలేకపోయాయి. గ్రాఫిక్స్ కుదరకపోయినా కానీ కనీసం దర్శకుడు తన ఫాంటసీని వింతలు, విశేషాలతో అలరించేలా చూపించలేకపోయాడు. అంత బిల్డప్ ఇస్తూ వచ్చిన భేతాళ ప్రపంచంలోకి హీరో వెళ్లిన తర్వాత అతనికి చాలా ఛాలెంజులు ఎదురవుతాయని ఆశిస్తార. టెలీపోర్టింగ్ విద్యతో పిల్లలాట ఆడే శ్రీదేవి కానీ, అత్యంత క్రూరుడిగా ఇంట్రడ్యూస్ చేసిన సుదీప్ కానీ విజయ్‌ని ఏ విధంగానూ ఛాలెంజ్ చేయరు. సీన్‌కి ఒక రకంగా బిహేవ్ చేస్తూ కనిపించే హీరో అసలు ధీరుడో, లేక అప్పుడప్పుడూ కాలం కలిసి వస్తుందో అర్థం కాదు. తాబేలు ముందుకి వెళ్లి నిలబడ్డానికి జంకిన వాడే.. నెక్స్ట్ సీన్లో బ్లాక్ టైగర్‌తో వీరోచితంగా పోరాడేస్తాడు, ఏమాత్రం అదురు బెదురు లేకుండా! ఒంటి కన్ను రాక్షసుడిని చూస్తే.. ఒక్కసారిగా యానిమేషన్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
థియేటర్ లోపలకి వెళ్లిన దగ్గర్నుంచి ఎప్పుడు బయటకి పోదామా అని ఎదురు చూసేలా ఉన్న ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అన్నీ దర్శకుడు చింబుదేవన్. డైరెక్టర్స్ ఫిలిం అనిపించుకోవాల్సిన సినిమాలో అతను ఏ ఒక్క సందర్భంలోను 'ఈ సినిమాకి వచ్చినందుకు కనీసం ఈ ఒక్క పాయింట్ అయినా ఎంజాయ్ చేశాం' అనిపించేలా చేయలేకపోయాడు. టోటల్‌గా డైరెక్టర్స్ ఫెయిల్యూర్ అయిన 'పులి' ఇక పూర్తిగా ఈ జోనర్పై ప్రేక్షకులకి ఉండే ఆసక్తి, తమిళనాడులో విజయ్‌కి ఉన్న స్టార్డమ్, మిగతా చోట్ల శ్రీదేవికి ఉన్న పాపులారిటీ మీద డిపెండ్ కావాల్సిందే. కలెక్షన్ల మాట ఎలా ఉన్నా కానీ ఒక సినిమాగా 'పులి' ప్రేక్షకులకి ఒక డిజాస్ట్రస్ ఎక్స్పీరియన్స్ మిగులుస్తుంది.
కొసమెరుపు: అప్పట్లో 'పులి' చిత్రాన్ని విజయ్‌తోనే తీద్దామని ఎస్.జె. సూర్య ప్లాన్ చేశాడు. తను తప్పించుకుని ఆ 'పులి'కి పవన్‌కళ్యాణ్ దొరికిపోతే.. సూర్య పులి బారినుంచి బయటపడ్డ విజయ్ ఇప్పుడు ఇలా చింబుదేవన్ 'పులి'కి అడ్డంగా దొరికిపోయాడు!
బోటమ్ లైన్: ఈ పులి జోలికి పోకండి!
– గణేష్ రావూరి