టాలీవుడ్ – ఓ ఫ్లాప్ స్టోరీ

సినిమాకు కోటి రూపాయిల నుంచి నలభై కోట్ల ఖర్చు. ఏడాదికి వందకు పైగా సినిమాలు. అంటే కనీసం నాలుగైదు వందల కోట్ల మొత్తం. టాలీవుడ్ టర్నోవర్. ఎక్కడికిపోతోంది ఈ మొత్తం. టాలీవుడ్ లో ఎవరు…

సినిమాకు కోటి రూపాయిల నుంచి నలభై కోట్ల ఖర్చు. ఏడాదికి వందకు పైగా సినిమాలు. అంటే కనీసం నాలుగైదు వందల కోట్ల మొత్తం. టాలీవుడ్ టర్నోవర్. ఎక్కడికిపోతోంది ఈ మొత్తం. టాలీవుడ్ లో ఎవరు సంతోషంగా వున్నారు. నిర్మాతలు? హీరోలు? దర్శకులు? నటులు? వివిధ శాఖల్లో పనిచేసే వారు? లేదా సినిమా తయారీకి సంబంధించిన వివిధ సంస్థలు? కాదూ కూడదూ అంటే…భారీ వడ్డీలకు అప్పులిచ్చే ఫైనాన్షియర్లు?

నూతన్ ప్రసాద్ పాపులర్ డైలాగు మాదిరిగా చెప్పాలంటే ఇప్పుడు టాలీవుడ్ క్లిష్ట పరిస్థితిలోవుంది. ఏ సినిమాకు కలెక్షన్లు ఆశాజనకంగా లేవు. ఏ నిర్మాతా సంతోషంగా లేడు. సినిమా తయారీకి వచ్చిన ఇబ్బందులేవీ ఇప్పుడు లేవు. సకల సౌకర్యాలు, సమస్త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మన ముంగిట్లోనే సిద్దంగా వుంది. డబ్బులుండాలే కానీ జాతీయ, అంతర్జాతీయ నటులు సైతం ఇక్కడికి వచ్చి నటించడానికి రెడీ. కానీ సినిమా విడుదల దగ్గర నుంచే బాధలు తెలిసిరావడం ప్రారంభమవుతుంది. విడుదలయ్యాక కష్టాలు మొదలవుతాయి..మొదటి మూడు రోజులు హ్యాపీ. కలెక్షన్లు సూపర్..సోమవారం ఢమాల్..మళ్లీ శుక్రవారం వరకు సినిమా చూసేవాళ్లు కరువు. సినిమా బాగుంటే మళ్లీ శని, ఆదివారం. బాగా లేదు అంటే ఆ మూడురోజుల కలెక్షన్లతో సంతృప్తి చెందాల్సిందే. ఇదీ ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

ఎవరు కారణం..దీనికి ఎవరు బాధ్యులు..మంచి సినిమాలు తీయలేదని మీడియా అంటోంది. మంచి సమీక్షలు ఇవ్వకుండా సినిమాను మీడియానే చంపేస్తోందని ఇండస్ట్రీ అంటోంది. హీరోలు కాళ్లు చేతులు పెట్టి కెలికేస్తున్నారని, తామేం చేస్తామని డైరక్టర్లు పరోక్షంగా అంటున్నారు. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుని, దర్శకులు ఏం పీకుతున్నారని నిర్మాతలు అంటున్నారు. టికెట్ రేట్లను వందలకు పెంచేస్తే థియేటర్ కు ఎవరు వస్తారని ప్రేక్షకులు అంటున్నారు. ఇలా ఏడుగురు రాకుమారులు..చేపల కథలా తయారైంది ఆఖరికి తెలుగుసినిమా పరిశ్రమ వ్యవహారం. 

ఆగని ఖర్చు

తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద సమస్య ఖర్చు. అది తగ్గించడం అన్నది నిర్మాతల వల్ల కావడం లేదు. అసలు నిర్మాతలకు ఖర్చుపై అంచనా వుందా అన్నది అనుమానం అంటారు..ప్రముఖ దర్శకుడు రవిబాబు. ఆయన ఇప్పటివరకు తీసిన తొంభై శాతం సినిమాలు సేప్ బడ్జెట్ లో తీసినవే. ఒకసెట్ కు ఎంత ఖర్చు అవుతుందన్నదానిపై నిర్మాతలకు కనీస అవగాహన లేదు. మేకర్ ఎంత అంటే అంతే.అలాంటపుడు ఖర్చు ఎలా తగ్గుతుంది అని ప్రశ్నిస్తారాయన. పైగా కాస్త పేరు వస్తే చాలు నటుల కొర్కెలు రేట్లు పెరిగిపోతున్నాయి. డైలీ వేజ్ లు, కేరవాన్లు, ఇలా చాలా వ్యవహారాలున్నాయి. 

ఇటీవల ఒకటి రెండు హిట్ లు కొట్టిన ఓ చిన్న హీరో, తన వంటమనిషిని తాను తెచ్చుకుంటానని, అతనే మెస్ లో తనకు వండుతాడని అన్నాడట. ఇలావుంటుంది వ్యవహారం.  దర్శకులు వాళ్ల పని తప్ప అన్నీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాకు ప్యాకేజీలు తయారయ్యాయి. ఇంతలో సినిమా తీసిస్తా అని దర్శకులు ముందే నిర్మాతలకు హామీ ఇచ్చి, ఆ మేరకు ప్రొడక్షన్ వ్యవహారాలను కూడా వారి చేతిలోకి తీసుకుంటున్నారు. దీని వల్ల దర్శకులు తమకు లాభం వుంటుందనుకుంటున్నారు కానీ, తేడా వస్తే వారే బలైపోతున్నారు. ఒక దశలో నిర్మాతలు దర్శకులపై ఫిర్యాదుకు కూడా వెనుకాడడం లేదు. గతంలో దర్శకుడు లారెన్స్ ఉదంతం, తాజగా శ్రీనువైట్లపై జరుగుతున్నరగడ ఇందకు ఉదాహరణలు.

హీరోలు మాత్రమే హ్యాపీ

ఇప్పుడు టాలీవుడ్ లో  హీరోలు సేఫ్ గానే వుంటున్నారు. ఇవ్వాళ టాప్ లైన్ హీరోలు అయిదు కోట్ల నుంచి పదిహేను కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఒక సినిమా పోయినా వచ్చిన నష్టం లేదు. మరో సినిమాకు అడ్వాన్స్ ఇవ్వడానికి పది మంది నిర్మాతలు రెడీగా వుంటున్నారు. చిన్నహీరోలు కోటి నుంచి మూడు కోట్లు వరకు తీసుకుంటున్నారు. వీరికి ఫ్లాపులతో కొంచెం ఇబ్బందే కానీ, కాస్త కష్టపడితే సినిమా దొరుకుతుంది.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

హీరోలు మినహా ఇండస్ట్రీలో ఇక అందరివీ కష్టాల కథలే. దర్శకులు పరిస్థితి మరీ ఘొరంగా వుంది. టాప్ లైన్ లో ముగ్గురు, నలుగురు తప్ప లేరు. వీరు మాత్రమే ఏడు నుంది పది కోట్లు తీసుకుంటున్నారు. సినిమా పోతే, మరోసినిమా వచ్చే అవకాశం వీరికి మాత్రమే వుంది.

మిగిలిన డైరక్టర్లందరికీ సినిమా పోయిందా, కెరియర్ పోయినట్లే. మరోసినిమా దొరకాలంటే ఏళ్లు పడుతుంది. కృష్ణవంశీ లాంటి పెద్ద దర్శకుడే ఏళ్లతరబడి ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. హరీష్ శంకర్ ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేసారు. సినిమా పోతే ముందుగా బలైపోయేది దర్శకులే.  గబ్బర్ సింగ్ 2 పై పవన్ వ్యవహారం. సంపత్ నందిని దర్శకుడిగా పెట్టుకుని, స్క్రిప్ట్ మొత్తం తయారుచేయించుకుని, ఓకె చేసి, సినిమాకు ఓపెనింగ్ కార్యక్రమం కూడా నిర్వహించుకున్నారు.  అక్షరం అక్షరం పూర్తయిన బౌండ్ స్క్రిప్ట్ ను సంపత్ నంది దగ్గర ఆయన సన్నిహితులు చాలా మందే చూసారు. రాజకీయ కారణాలతో గబ్బర్ సింగ్ 2ను వెనక్కు జరుపుకుంటూ వచ్చారు. ఆపై గోపాల గోపాల కోసం మరి కొంత వెనక్కు నెట్టారు. ఆఖరికి సంపత్ నందిని తప్పించాలని డిసైడైపోయారు. 

తప్పులేదు..తమకు ఇష్టం లేనపుడు దూరంపెట్టేసుకోవచ్చు. కానీ ఓ దర్శకుడు కెరీర్ తో ఆడుకోకూడదు కదా..లైన్ మొత్తం చెప్పినా, కథ అల్ల లేకపోయాడని, పవన్ మెప్పించలేకపోయాడనీ ఏవో రూమర్లు వ్యాప్తి చేస్తూనే వున్నారు. ఇవి పవన్ కు తెలిసి జరగకపోవచ్చు. కానీ చేస్తున్నవాళ్లు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి.  బహుశా పవన్ మాటతప్పిన మనిషి కాదని చాటి చెప్పడానికి ఇలా చేస్తున్నారా? లేక సంపత్ నందిని విజయవంతంగా పక్కకు తప్పించినవారే, ఇప్పుడు ఆ అపవాదు పవన్ పై పడకూడదని ఇలా చేస్తున్నారా? సినిమా రంగంలో హీరోల ఆధిపత్యం నడుస్తుంది. అందువల్ల బహుశా ఇప్పుడు సంపత్ నంది మాట్లాడకుండా మౌనం వహించి వుండొచ్చు.  అదే తెగించి ఆ బౌండ్ స్క్రిప్ట్ మొత్తం బయటపెడితే, ఎవరు దోషులవుతారు? కానీ టాలీవుడ్ లో అలా జరగదని అందరికీ తెలుసు.  

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

మొన్నటికి మొన్న దర్శకుడు వీరభద్రమ్ చౌదరిదీ ఇదే కేసు. భాయ్ సినిమాను నాగార్జున అభీష్టానికి అనుగుణంగానే తీర్చి దిద్దాడు. నాగ్ తన గెటప్ లు అన్నీ తానే డిజైన్ చేసుకున్నారు. ఆయనే చాలా సార్లు తను, తన హెయిర్ స్టయిలర్ కలిసి డిజైన్ చేసుకున్నాం అని  చెప్పారు. భాయ్ అద్భుతం అని సినిమా విడుదలకు ముందు నాగ్ చాలా సార్లు చెప్పారు.  తీరా సినిమా ఫెయిలయ్యాక, మొత్తం తప్పు దర్శకుడు చౌదరిపైకి నెట్టే ప్రయత్నాలు చేసారు. ఎప్పటికప్పడు నర్మగర్భంగా మాట్లాడుతూ దర్శకుడిని టార్గెట్ చేసారు. దాంతో ఇప్పటి వరకు ఆ దర్శకుడికి అవకాశాలు లేవు. ఒక సినిమా పోయినా హీరోకి మరో సినిమా రావడం కష్టం కాదు. కానీ ఓ సినిమా పోతే మరో సినిమా రావడం అన్నది దర్శకుడికి చాలా కష్టం.  సినిమా నిర్మాణంలోవున్నపుడు కాళ్లు, చేతులు అన్నీ పెట్టి కెలికేయడం అన్నది టాలీవుడ్ లో వర్థమాన హీరోల  నుంచి టాప్ హీరోల వరకు తొంభై శాతం మంది చేసే పని. హిట్ అయితే తమ ఘనత..ఫ్లాప్ అయితే దర్శకుడి చేతకాని తనం అనడం మామూలైపోయింది. సినిమా అవకాశాల కోసం దర్శకులు మౌనంగా హీరోల కెలుకుడు భరించాల్సి వస్తోందన్నది వాస్తవం. దీన్ని దాదాపు ప్రతి దర్శకుడు ఆప్ ది రికార్డుగా అంగీకరిస్తారు. ఇదీ టాలీవుడ్ తీరు..దీన్ని ఎవరూ మార్చలేరు. 

నిర్మాతలు కుదేలు

ఎమ్ ఎస్ రాజు, ఆర్ ఆర్ మూవీస్ వెంకట్, కామాక్షి మూవీస్ శివప్రసాద్ రెడ్డి, బెల్లంకొండ సురేష్, వైజయంతీ మూవీస్ అశ్వనీదత్, పద్మాలయా సంస్థ, జయభేరి.. ఇలా జాబితా రాసుకుంటూ పోతే టాలీవుడ్ లో పక్కకు తప్పుకున్న నిర్మాతలు, బ్యానర్లు ఎన్నో? ఇక్కడ నిల్చుంటే అందరూ చూస్తారు..పడిపోతే ఒక్కడు చేయూత నివ్వరు. కామాక్షీ మూవీస్ సంస్థనే తీసుకోండి 13 సినిమాలు నాగార్జున, నాగ చైతన్యతో తీసిన సంస్థ అది. నాగార్జున బినామీ సంస్థ లేదా హోమ్ ప్రొడక్షన్ అనేవారు అంతా. కాదని నిర్మాతకు మాత్రమే తెలుసు.ఇప్పుడేమయింది. వరుస ఫ్లాపులతో కుదేలైపోయారు నిర్మాత. 

రగడ, దడ, కేడి, గ్రీకువీరుడు, కింగ్, బాస్ అన్నీ ఫ్లాపులు,,సగటు సినిమాలే. మరి హీరో నాగార్జున ను నమ్ముకున్నందుకు మళ్లీ ఆయన చేయూత ఇవ్వాలంటే ఇవ్వలేరా? కొడుకువో, తనవో డేట్లు ఇచ్చి, సినిమా చేసుకోమనలేరా? హలోబ్రదర్ కు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఏమయింది? పాపం ఆ దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఎక్కడున్నారు. ఢమరుకం ఫాప్ తో ఆయన కెరియర్ డిక్కీలోకి వెళ్లిపోయింది. కామాక్షి సినిమాలు అన్నీ ఫ్లాపులు కావడానికి నిర్మాత ఎంత వరకు కారణం? అసలు ఏ సినిమా అయినా హీరో కథ ఓకె చేసాకే సెట్ పైకి వెళ్తారు. దర్శకుడిని హీరోనే సెట్ చేస్తారు.  హీరో ఎలా అంటే అలాగే తల ఊపుతారు. హీరో ఎంత ఖర్చు చేయమంటే అంతా చేస్తారు. కానీ సినిమా ఫ్లాపయితే, నలుగురిలో పట్టుకుని, నిర్మాతను..'నీకు సినిమా తీయడం చేతకాలేదంటారు'. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

దాంతో సినిమా ఫ్లాపయితే నిర్మాత ఇల్లుగుల్ల, దర్శకుడి కెరియర్ ఫట్. కానీ హీరో మాత్రం సేఫ్. పైగా దర్శకుడికి సినిమా లేకపోయినా ఖర్చు తప్పని రోజులు ఇవి. నిర్మాతల మాదిరిగానే దర్శకులు కూడా ఇప్పుడు ఆఫీసుల నిర్వహించాల్సి వస్తోంది. కొంతమంది టీమ్ ను పెట్టుకోవాల్సి వస్తోంది. వారికి జీతాలు ఇవ్వాల్సి వుంది. రభస సినిమాకు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు వచ్చిన పారితోషికం కన్నా, ఆ సినిమాకు ముందు, వెనుక తన స్టాఫ్ ను పోషించడానికి అయిన ఖర్చు ఎక్కువ. 

డిస్ట్రిబ్యూషన్ అంటే డేంజర్

సినిమా పంపిణీ అంటేనే జనం భయపడిపోయే పరిస్థితికి వచ్చింది. కొన్న సినిమాలు ఫట్ ఫట్ మని తన్నేయడంతో చాలా మంది పంపిణీదారులు కుదేలైపోయారు. దిల్ రాజు లాంటి పెద్ద పంపిణీ దారు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. నాగార్జున స్వయంగా భాయ్ సినిమాతో విశాఖ ప్రాంతంలో పంపిణీ దారుగా మారి చేతులు కాల్చుకున్నారు. ఆర్ ఆర్ వెంకట్ కుదేలై, కంపెనీ ఎత్తేసుకోవడానికి కారణం పంపిణీ రంగంలో వేలు పెట్టడమే. 

దాంతో ఇప్పుడు సినిమాలు కొనే నాధుళ్లు కరువైపోయారు. కావాలంటే కాస్త అడ్వాన్స్ ఇచ్చి ఆడించేవారు తప్ప వేరు లేరు. ఏరియాల వారీ పంపిణీ దారుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగా వుంది. థియేటర్ల దగ్గర అడ్వాన్స్ లు పట్టి నిర్మాతలకు ఇస్తున్నారు. సినిమా తన్నేస్తే, థియేటర్ల వాళ్లు మళ్లీ డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు దొరకుతాడా అని చూస్తున్నారు. కార్తికేయ సినిమా హిట్. కానీ పంపిణీ దారులకు థియేటర్ల నుంచి డబ్బులు అందలేదు. కారణం అంతకు ముందు బోలెడు సినిమాలు అట్టర్ ఫ్లాప్. దాంతో వారికే వీరు బాకీ పడడం. కానీ వసూళ్లు నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లు కట్టాల్సిందే. ఎక్కడ నుంచి కడతారు? అంటే సినిమా హిట్ అయినా నిర్మాతకు టెన్షన్ తప్పదు. 

అసిస్టెంట్ ల బాధలే బాధలు

ఇప్పుడు సినిమా రంగంలో అసిస్టెంట్ లు, అసోసియేట్ లు, ఇంకా రకరకాల డిజిగ్నేషన్లతో బోలెడు మంది దర్శకత్వ శాఖ సిబ్బంది వున్నారు. వీరిలో సగానికి పైగా జనాలకు సరియైన అవకాశాలు లేవు. నిర్మాతను బట్టి, దర్శకులను బట్టి కొంతమందికి అవకాశాలు వుంటాయి. ఇక్కడ మళ్లీ రికమెండేషన్లు, సంబంధాలు, అనుబంధాలు, కులాలు కూడా కొంతవరకు ప్రాధాన్యత ఇస్తాయి.మిగిలిన వారు ఇంటి నుంచి తెచ్చుకునే డబ్బులతో కాలక్షేపం చేస్తూ, తమకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తూ వుండడమే. 

ఇదే తరహా పరిస్థితి చిన్న నటులకు కూడా వుంది. 

చిన్న నటులు, ముఖ్యంగా హాస్య నటులు, సహాయ నటులు చాలా మంది వున్నారు. వీరిలో చాలా మంది ఏడాదికి పట్టుమని పది సినిమాలు కూడా చేయడం లేదు. పైగా పెద్ద క్యారెక్టర్ నటులు, హాస్య నటులు తమ సౌలభ్యం కోసం పెట్టిన రోజువారీ పారితోషికం అన్నది ఈ చిన్న నటులకు శాపంగా మారింది. చాలా మందికి అయిదు వేలు, పదివేలు రోజువారీ  సంపాదన,. చిన్న సినిమా చకచకా కానిచ్చేస్తారు.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

అన్ని సినిమాలు కలిపి ఏడాదికి లక్షా, రెండు లక్షల సంపాదన కూడా వుండదు. అంటే హైదరాబాద్ లో ఇంటి అద్దెకు కూడా సరిపోని పరిస్థితి. హీరోల ప్రాపకం వుంటే నాలుగు సినిమాలు దొరుకుతాయి. లేదంటే లేదు. దర్శకుల చుట్టూ తిరుగుతూ, వారి గుడ్ లుక్స్ లో వుంటూ కాలం గడపాల్సిందే. ఇలా నిర్మాత, నటులు, దర్శకులు, ఎవరు హ్యాపీగా లేరు. మరి ఎవరు హ్యాపీ అంటే…

హీరోలు, సంస్థలు, ఫైనాన్షియర్లు

సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా కాస్త తట్టుకోగలిగిన వారు పెద్ద హీరోలు. చిన్న హీరోలు కొంత వరకు ఓకె. నిర్మాణ బ్యాక్ గ్రౌండ్ వుంటే ఆ హీరోకు సమస్యే లేదు. లేదా హీరో బ్యాక్ గ్రౌండ్ వుంటే ఆ నిర్మాతకు తలనొప్పి లేదు. ఇక సంస్థలు. అంటే స్టూడియోలు, ఇతర ఇన్ఫాస్ట్రక్చర్ సంస్థలు. ఇవి మాత్రం తమ తమ ఫీజులను తమ లెక్క ప్రకారం తీసుకుంటున్నాయి. డిఐ అని, సిజి అని, ఇలా రకరకాల కొత్త వ్యవహారాలు పుట్టుకువస్తున్నాయి. వాళ్ల మనుగడ మాత్రం ఓకె. ఇక ఫైనాన్షియర్లు..వీరిది మాత్రం పండగే. మూడు రూపాయిల కనీస వడ్డీ. పైగా వడ్డీ సక్రమంగా ఇవ్వకపోతే చక్రవడ్డీ. థియేటర్ల విషయంలో ఆ నలుగురు అన్నట్లు ఫైనాన్షియర్ల విషయంలో కూడా నలుగురి పేర్లు తరచు వినిపిస్తుంటాయి. బెజవాడ, రాయలసీమ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన ఈ నలుగురు బడా ఫైనాన్షియర్లు. మాల్స్, సినిమానిర్మాణం వంటి ఇంకా చాలా వ్యవహారాలున్న ఓ బడా పారిశ్రామిక వేత్త కూడా ఫైనాన్స్ చేస్తుంటారు. 

సినిమా నిర్మాణం జూదంగా మారిపోవడంతో, నిర్మాతలు ఆశగా వీరిదగ్గర అందినంత అప్పు చేస్తున్నారు. సినిమా హిట్ కొడితే చాలు అన్నీ ఇచ్చేయచ్చు అనుకుంటారు. కానీ అక్కడే సమస్య వస్తుంది. సినిమా తేడా వచ్చినా, అలా అలా నడిచినా వచ్చిన డబ్బులు అన్నీ తీర్చేయడానికే చాలవు. నూటికి తొంభై మంది నిర్మాతలు సినిమా విడుదలకు ముందు నానా మల్లగుల్లాలు పడకుండా సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదు. ఆ స్థితిలో కాగితంలో ఏం రాసి వుందో కూడా చూడకుండా సంతకాలు చేసిన సందర్భాలు కూడా వున్నాయి. సినిమా విడుదలైతే చాలు..చూసుకుందాం అనే పరిస్థితి అది. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

గీతాంజలి అనే సినిమా వచ్చింది. హిట్ అయింది. నిర్మాతను పలకరించాను..ఆయన విశాఖలో పేరు మోసిన బిల్డరు. ఎలా వుంది తొలి అనుభవం నిర్మాతగా అని అంటే, ఆయన సమాధానం…' మా వ్యాపారమే బెటరండీ..'..కార్తికేయ సినిమా హిట్ అయింది. ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు..ఎలావుందీ అని ప్రశ్నిస్తే…'ఇదో విషవలయం..ఇందులో చిక్కుకుని బయటపడినవారు అరుదుగా వుంటారు..' ఇదీ ఆన్సరు. లెజెండ్ సినిమా పెద్ద హిట్..ఎంత లాభం వచ్చిందీ అంటే సమాధానం చెప్పలేరు నిర్మాత సాయి. హాయిగా చిన్న సినిమాలు చేసుకుంటున్నారు. వచ్చినా పోయినా లక్షల్లోనే వుంటుంది వ్యవహారం. 

దర్శకుడు రవిబాబు ఇలా అంటారు…''..సినిమా ప్రపంచమే అబద్ధం..ఏ నిర్మాత, నాతో సహా తన బడ్జెట్ పై నిజం చెప్పరు. వసూళ్లు కూడా అంతే. మీరు సమాచార చట్టం ప్రకారం ఐటిశాఖ నుంచి ఏ నిర్మాత ఎంత లాభం సంపాదించారన్నది సేకరించండి..కానీ ఎవరికివారు లెక్కలు కట్టి ఇంత వసూళ్లు, అంత వసూళ్లు..అని రాస్తుంటారు. డైలీ కలెక్షన్ రిపోర్టులు ఎవరు చూసారు చెప్పమనండి..ఫ్యాన్స్ కోసమో, హీరొల మార్కెట్ పెంచడం కోసమో తప్ప ఈ లెక్కలు మరెందుకు కాదు..వాస్తవం కూడా కాదు' అవును, ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యాలే. 

పబ్లిసిటీ పీక్ కు వెళ్లింది

ఇప్పుడు కొన్ని సినిమాలు యాభై లక్షల నుంచి కోటి రూపాయలతో కూడా తయారవుతున్నాయి. కానీ వాటికైనా పెద్ద సినిమాకైనా ఒకటే పబ్లిసిటీ ఖర్చు. కోటి నుంచి మూడు కోట్లు. టీవీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊదరగొడితే తప్ప, థియేటర్లకు జనం రారు. టీఆర్పీ రేట్లను బట్టి చానెళ్ల ప్రకటనల రేట్లు. ఇక ప్రింట్ మీడియా, వెబ్ మీడియా, ఔట్ డోర్ పబ్లిసిటీ, హ్యాంగర్లు, ఇలా రకరకాల పబ్లిసిటీ. ఇది కూడా నిర్మాతకు తడిసి మోపెడవుతోంది. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

మొత్తం మీద ఏటా టాలీవుడ్ లోకి వస్తున్న వందల కోట్లతో హీరోలు, సినిమా నిర్మాణానికి ఏర్పాటైన ఇన్ఫాస్ట్రక్చర్ సంస్థలు, బాగుపడుతున్నాయి. మిగిలిన వారు నెలవారీ వేతనాలు కిట్టుబాటు చేసుకుని బతుకుతున్నారు. నిర్మాత మాత్రం బలైపోతున్నాడు. జరుగు జరుగు ఇంకోడొస్తున్నాడు…అన్నట్లు, మరో కొత్త నిర్మాత సూట్ కేస్  తో రావడం ఆలస్యం…బలి చేసేయడమే. 

ఇదే టాలీవుడ్…ది బిగ్ ఫ్లాప్ స్టోరీ.