కొత్త పాత్రలో బెంగాల్‌ టైగర్‌

బెంగాల్‌ టైగర్‌గా క్రికెట్‌ అభిమానులు ముద్దుగా పిలుచుకునే సౌరవ్‌ గంగూలీ బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరవ్‌ గంగూలీ నియామకాన్ని ఖరారు చేశారు. క్యాబ్‌ అధ్యక్షుడిగా…

బెంగాల్‌ టైగర్‌గా క్రికెట్‌ అభిమానులు ముద్దుగా పిలుచుకునే సౌరవ్‌ గంగూలీ బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరవ్‌ గంగూలీ నియామకాన్ని ఖరారు చేశారు. క్యాబ్‌ అధ్యక్షుడిగా ఇప్పటిదాకా పనిచేసిన జగ్మోహన్‌ దాల్మియా హఠాన్మరణంతో, దాల్మియా వారసుడిగా ఇంకొకర్ని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

క్రికెట్‌లో సౌరవ్‌ గంగూలీ సాధించిన విజయాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? భారత క్రికెట్‌లో 'పోరాట పటిమ'కు కేరాఫ్‌ అడ్రస్‌గా గంగూలీని పేర్కొనవచ్చు. గంగూలీ సారధ్యంలో టీమిండియా అసామాన విజయాల్ని నమోదు చేసింది. అప్పటిదాకా టీమిండియా ఆటగాళ్ళంటే చాలా మెతక.. గంగూలీ రాకతో పరిస్థితులు మారిపోయాయి. ప్రత్యర్థికి ఆటతోనే కాదు, అవసరమైతే మాటలతోనూ సమాధానం చెప్పగలమని నిరూపించాడు గంగూలీ. 

ఇక, గంగూలీ క్రీడా జీవితంలో అనూహ్య విజయాలే కాదు, అనేక వివాదాలూ వున్నాయి. ఈ వివాదాల నడుమే గంగూలీ క్రికెట్‌ని వీడాల్సి వచ్చింది. ప్రస్తుతం గంగూలీ క్యాబ్‌ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. బెంగాల్‌ క్రికెట్‌కి గంగూలీ కొత్త ఊపు తీసుకొస్తాడనీ, గంగూలీ సారధ్యంలో బెంగాల్‌ క్రికెట్‌ దూసుకుపోతుందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.