మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్ ఫీల్డ్ లోకి రావడం ఖాయమైంది. గడచిన కొద్దికాలంగా నీహారిక (నాగబాబు కుమార్తె) ఇండస్ట్రీలోకి వస్తారని వార్తలు వినవస్తునాయి. అయితే ఇంత సడెన్ గా వుంటుదని అనుకోలేదు. ఇది అంతా సడెన్ గా జరిగినట్లు తెలుస్తోంది.
టీవీ 9, మధుర శ్రీధర్ కలిసి మల్లెల తీరం డైరక్టర్ రామరాజు డైరక్షన్లో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. ఆ కథకు జ్యోతిలక్ష్మిలో నటించిన సత్య ను హీరోగా అనుకున్నారు. అయితే కథ గురించి ప్రాజెక్టు గురించి తెలుసుకుని, హీరో నాగశౌర్య ఆసక్తి కనబర్చాడు. ముందు ఏమనుకున్నా, తరువాత ఆఖరికి నాగశౌర్యను ఓకె అనుకున్నారు.
హీరోయిన్ ఎవరు అనుకున్నపుడు, నాగశౌర్య వ్యవహారాలు చూసే వాళ్లే, నీహారిక వ్యవహారాలు టేకప్ చేయడంతో, ఆమె పేరు పరిశీలనలోకి వచ్చింది. దాంతో టీవీ 9 వాళ్లు కూడా ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుంది కదా అని సై అన్నారు. అయితే ముందుగా ప్రకటించకుండా, టీవీ 9 లో మంచి డిఫరెంట్ కార్యక్రమం ద్వారా అనౌన్స్ చేయాలనుకున్నారని వినికిడి. కానీ ఎలా పొక్కిందో బయటకు పొక్కింది. దాంతో మరెందుకు..ఈ గ్యాసిప్ లు అని, ప్రకటించేసారు.
కథలో పాయింట్ బాగా నచ్చే, నీహారిక ఈ సినిమాను తన తొలిసినిమా చేయడానికి ఓకె అన్నదని వినికిడి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే తొలి లేడీ స్టార్ నీహారికనే.
మొన్నటికి మొన్న కంచె అడియో ఫంక్షన్ లో ఆమెను చూసి, అందరూ హీరోయిన్ గా వంద మార్కులు వేసేసారు. ఇదిలా వుంటే నీహారిక పారితోషికం ఎంతయి వుంటుంది అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో డిస్కషన్ పాయింట్ గా వుంది. మామూలుగా ఎంట్రీ లెవెల్ కొత్త హీరోయిన్ కు అయిదు నుంచి పది లక్షలు ఇవ్వడం కామన్.
చిన్నసినిమా అయితే లక్షా రెండు లక్షలు కూడా ఇస్తారు. అయితే ప్రాజెక్టుకు నీహారిక కారణంగా కాస్త క్రేజ్ వస్తుందన్నది వాస్తవం. ఎందుకంటే మెగా ఫ్యామిలీ హీరోయిన్ కావడం, సినిమా విడుదలకు ముందు మెగా ఫ్యామిలీ సపోర్టుతో హైప్ రావడం కామన్. మరి ఆ మేరకు ఏమన్నా అదనంగా రెమ్యూనరేషన్ వుంటుందా అన్నది అనుమానం. కాస్త పాపులర్ హీరోయిన్లకు ఇచ్చే రేంజ్ లో నీహారిక పారితోషికం వుంటుందా అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
అన్నీ బాగానే వున్నాయి. కానీ పాపం మంచి హీరో చాన్స్ దొరికింది అనుకున్న సత్యకు ఆ చాన్స్ చేజారిపోయింది.