జగన్ సహా అన్నీ కాగితం పులులే

రాజధాని వ్యవహారం మెలమెల్లగా క్లయిమాక్స్ కు చేరుకుంటోంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు మెలమెల్లగా తన మనసులో దాచుకున్న ప్రణాళికలోని అంశాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తూ,  చాకచక్యంగా వ్వవహరించుకుంటూ వస్తున్నారు. అక్కడ రాజధానికి భూములు అర్పించాల్సిన రైతులు, తమ…

రాజధాని వ్యవహారం మెలమెల్లగా క్లయిమాక్స్ కు చేరుకుంటోంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు మెలమెల్లగా తన మనసులో దాచుకున్న ప్రణాళికలోని అంశాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తూ,  చాకచక్యంగా వ్వవహరించుకుంటూ వస్తున్నారు. అక్కడ రాజధానికి భూములు అర్పించాల్సిన రైతులు, తమ భవిష్యత్ ఏమిటి అన్నది అది మంచిదా, చెడ్డదా, ఇస్తే బతకు బంగారమవుతుందా..బూడిదవుతుందా అన్నది తెలియక కిందా మీదా పడుతున్నారు. 

ఒక పక్క ‘పచ్చ’పాత పత్రికలు ఇంత సదవకాశం, మహద్భాగ్యం మరి రాదని ఊదరగొడుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు ఇన్ని భూములు, అందునా పచ్చటి పంటచేలు లాగేసుకోవడం తగదంటున్నారు. ఇది రాష్ట్రం వ్యవహారం అన్నట్లు కేంద్రం చోద్యం చూస్తోంది. అంతకు మించి జరుగుతున్నదీ..లేదు..జరిగేదీ లేదు..

ప్రతిపక్ష నేత జగన్ తో సహా మిగిలిన విపక్షాల నేతలందరూ కాగితం పులులుగానే ప్రవర్తిస్తున్నారు. మైకుల ముందు, మీడియా ముందు నోరు చేసుకుంటున్నారు తప్ప, కార్యాచరణ అంతంత మాత్రంగా వుంది.

ఇక్కడ సమస్య చిన్నది కాదు..వేలాది మంది రైతులకు సంబంధించినది. వేలాది ఎకరాల పంటచేలకు సంబంధించినది. మొండిగా ముందుకు వెళ్తున్నది సాదా సీదా మనిషికాదు..అనేక యుద్దములందు ఆరితేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మరి అలాంటపుడు ఏ రేంజ్ కార్యాచరణ వుండాలి. రైతులను ఎలా సంఘటితం చేయాలి? అసలు ఆ దిశగా ఆలోచన చేసిన దాఖలాలు వున్నాయా? కాంగ్రెస్, వైకాపా లాంటి పెద్ద పార్టీలు ఆ దిశగా అస్సలు ఆలోచించడం లేదు. 

పోనీ అఖిలపక్ష పోరాట కమిటీ ఏమన్నా ఏర్పాటయిందా? అదీ లేదు. గుంటూరు కేంద్రంగా తెలుగుదేశం దాని మిత్రపక్షమైన భాజపా మినహా మిగిలిన అన్ని పక్షాలు కలిపి ఓ రైతు బహిరంగ సభకు పిలుపు ఇవ్వచ్చు కదా? ఆ విధంగా రైతు గొంత వినిపించే అవకాశం కల్పించవచ్చు. దానికి జాతీయ మీడియాను ఆహ్వానించవచ్చు. వారికి ఆ పచ్చటి పంటచేలు చూపించవచ్చు. భాజపా మినహా మిగిలిన జాతీయ పార్టీల నాయకులను పిలవచ్చు..

కానీ ఇవన్నీ ఎందుకు చేయరు? వారికి తెలియకనా? చేయలేకనా? చిత్త శుద్ధి లేక.

జగన్ కు సహా ఎవరికి వుండే మొగమాటాలు, అవసరాలు వారివి. జగన్ కు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీగా భూములు వున్నాయని అంటారు. సరస్వతీ సిమెంట్ భూములు వుండనే వున్నాయి. ఇప్పుడు రాజధాని అక్కడ వస్తే, వాటి ధరలు భయంకరంగా పెరుగుతాయి. అలాగే రాఘవులు, నారాయణ, జెపి లాంటి వాళ్ల సంగతి తేలిసిందే. పైకి ప్రజల హితం..లోపల చంద్రబాబు అభిమతం అన్నట్లు వుంటుంది వారి ధోరణి. కాంగ్రెస్ నాయకుల సంగతి సరేసరి. ప్రతిపక్షంగా వారు దమ్మిడీకి పనిచేయలేరు.

ఇక పార్టీలతో సంబంధం లేకుండా రాయలసీమ నాయకులు వున్నారు. వారికి వుండే బినామీ వ్యవహారాలు వారికి వున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, వైకాపా అని లేకుండా రాయలసీమకు చెందిన అనేక మంది నాయకులు గుంటూరు, కృష్ణాజిల్లాల్లో భారీగా భూములు కొనుగొలుచేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరింక వారేం మాట్లాడతారు.

ఈ సంగతులు అన్నీ చంద్రబాబుకు తెలియని కావు. అందుకే ఆయన తన చిత్తానికి తన ప్రణాళిక అమలు చేసుకుంటూ పోతున్నారు. నాయకులు చోద్యం చూస్తున్నారు..చంద్రబాబు తన వాస్తుసమేత పథకం తాను అమలు చేసుకుంటూ, ఆ విధంగా ముందుకు పోతున్నారు.