జగన్ పార్టీకి శతృవు ‘సాక్షి’

కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు..కాంగ్రెస్ ను కాంగ్రెస్ మాత్రమే ఓడిస్తుంది అన్నది చాలా కాలంగా వినిపించే మాట. ఇప్పుడు వైకాపా వ్యవహారం కూడా ఇంచుమించు అలాగే తయారవుతోంది. వైకాపాకు దాని అనుకూల దినపత్రిక సాక్షి…

కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు..కాంగ్రెస్ ను కాంగ్రెస్ మాత్రమే ఓడిస్తుంది అన్నది చాలా కాలంగా వినిపించే మాట. ఇప్పుడు వైకాపా వ్యవహారం కూడా ఇంచుమించు అలాగే తయారవుతోంది. వైకాపాకు దాని అనుకూల దినపత్రిక సాక్షి శతృవులా తయారవుతోంది. దాని కథానాలు అలా వుంటున్నారు.

శనివారం సంచిక మొదటి పేజీలో..పాడికి తోడేదీ..అంటూ కథనం ప్రచురించింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం పాల సేకరణ ధర పెంచింది..ఆంధ్ర ప్రభుత్వం పెంచలేదు..దానికి కారణం, ప్రభుత్వం పెంచితే హెరిటేజ్ వంటి ప్రయివేటు సంస్థలు కూడా పెంచాల్సి వుంటుంది. ఇందువల్ల పాడి రైతులు నష్టపోతున్నారు. అదీ వార్త సారాంశం.

కానీ ఇక్కడ కొన్ని విషయాలు మరిచిపోతున్నారు. పాల సేకరణ ధర నాలుగు రూపాయిలు పెరిగితే, పాల విక్రయం ధర కూడా నాలుగు రూపాయిలు పెరగాల్సి వుంటుంది. అప్పుడు ధరాఘాతం ఎవరిమీద పడుతుంది. అంటే సాక్షి కథనం పుణ్యమా అని పాల ధర పెరగాలన్నమాట. అయితే అలా అని పాడి రైతుల పొట్ట కొట్టమని కాదు. ఆ కథనం హైలైట్స్ లోనే విరుద్ధ స్టేట్ మెంట్ లు వున్నాయి.  ఫస్ట్ లైన్ లోనే ఫ్రభుత్వం కన్నా ప్రయివేటు సేకరణ ధరే ఎక్కువ. కావాలనే ధర పెంచడం లేదు..ధర పెంచితే హెరిటేజ్ పెంచాలి. ఇవీ హైలైట్స్.

అంటే ఇప్పటికే ప్రయివేటు డైరీలు ఎక్కువ ధర చెల్లిస్తున్నాయని సాక్షి అంగీకరిస్తోంది. ప్రభుత్వం పెంచితే, హెరిటేజ్ తో సమానం అవుతుంది తప్ప, దానికి పడేదేముంది. మన దేశంలో కావచ్చు…రాష్ట్రంలో కావచ్చు..ప్రభుత్వాలు రైతుకు న్యాయం చేస్తే, వినియోగదారు అన్యాయం అవుతాడు..వినియోగదారుకు న్యాయం చేయాలని చూస్తే రైతుకు అన్యాయం జరుగుతుంది. ఇది అన్నింటా, అంతటా వున్న సమస్య.

దిగుమతి పన్నులు తగ్గించి, వదిలేస్తే, పామాయిల్, సన్ ఫ్లవర్ నూనె ఇండియాలోకి తక్కువకే వచ్చి పడుతుంది. అప్పుడు మన రైతు అన్యాయమైపోతాడు. అలా అని కళ్లాలు బిగిస్తే, ధరలు పెరిగి జనం లబో దిబో అంటారు. ఇలాంటి సమస్య పంచదార, బియ్యం, ఇంకా చాలా వాటికి వుంది. అందుకే ప్రభుత్వాలు ఆచి తూచి వ్యవహరిస్తాయి. కథనాలు రాసేటపుడు కేవలం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం అన్నది చూడకుండా, రెండు వైపులా చూడాలి. రేపు ఈ కథనం పట్టుకుని పాల సేకరణ ధర ప్రభుత్వం పెంచేస్తుంది. అలాగే అమ్మకం ధర నాలుగు రూపాయిలు పెంచేస్తుంది. అప్పుడు వైకాపా ఇది అడ్డగోలుగా పెంచడం అనగలదా? అని రోడ్డు ఎక్కగలదా? అప్పుడు ప్రభుత్వం …మీ సాక్షి పత్రికే ధరలు పెంచమంది అని అంటే ఏమంటారు?

ఇక్కడ ఇంకో విషయం వుంది. ధరలు పెంచితే హెరిటేజ్ కు పాలు పోయరు అని భయం…అన్న పాయింట్ భలే చిత్రంగా వుంది.దీన్ని బట్టి డెయిరీ వ్యవహారాలు ఆ కథనం రాసిన వారికి అంతగా తెలియవు అని అర్థమైపోతోంది. ఇప్పుడు పాల రైతులు అందరూ డెయిరీల వారీ ఎప్పుడో విడిపోయి వున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు డైరీలు వేటికి అవి, తగిన రాయితీలు, సదుపాయాలు, రుణాలు ఇచ్చి రైతులను తమకు అనుబంధంగా ఫిక్స్ చేసుకున్నాయి. ఓ రూపాయి ఎక్కువైనా, తక్కువైనా ఏ రైతు ఆ డైరీకే పోస్తాడు తప్ప, మరో డైరీకి మారిపోయేది లేదు. అలా మారాలంటే, రుణాలు తీర్చడం, సదుపాయాలు వదులుకోవడం వంటి వ్యవహారాలు చాలా వుంటాయి.

ప్రభుత్వాన్నిఇరుకున పెట్టాలని ఆలోచించి రాసే ఇటువంటి కథనాల వల్ల వైకాపా పార్టీ కూడా ఇరుకున పడే ప్రమాదం వుంది. ఎందుకంటే పాలు ఉత్పత్తిచేసేవారి ఓట్ల కంటే కొనేవారి ఓట్లు ఎక్కవ వుంటాయి..అదీ సంగతి.