అమ్మకి ఆత్మకథ తొలి కాపీ…

క్రికెట్‌లో తిరుగులేని రికార్డుల్ని సొంతం చేసుకున్న సచిన్‌ టెండూల్కర్‌ ఆత్మకథ రాసుకున్నాడంటే దానికి వచ్చే క్రేజ్‌ ఓ రేంజ్‌లో వుంటుంది. తమ అభిమాన క్రికెటర్‌ సచిన్‌ ఆత్మకథ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

క్రికెట్‌లో తిరుగులేని రికార్డుల్ని సొంతం చేసుకున్న సచిన్‌ టెండూల్కర్‌ ఆత్మకథ రాసుకున్నాడంటే దానికి వచ్చే క్రేజ్‌ ఓ రేంజ్‌లో వుంటుంది. తమ అభిమాన క్రికెటర్‌ సచిన్‌ ఆత్మకథ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పిన సచిన్‌, తన ఆత్మ కథలో ఏం రాసుకున్నాడోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

దానికి తోడు ఆత్మకథకు సంబంధించి కొన్ని ఎపిసోడ్స్‌ని సచిన్‌ మీడియా ముందుంచడం, అందులో ఛాపెల్‌కి వ్యతిరేకంగా సచిన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెల్సిన విషయాలే.

ఈ నేపథ్యంలో సచిన్‌ ఆత్మకథ హాట్‌ టాపిక్‌గా మారింది. మొత్తానికి సస్పెన్స్‌ వీడిరది. సచిన్‌ ఆత్మకథ ఆవిష్కృతమైంది. ‘ప్లేయింగ్‌ ఇట్‌ మై వే’ పేరుతో సచిన్‌ రాసుకున్న ఆత్మకథ బయటకు వచ్చింది. తొలి కాపీని సచిన్‌, తాను అమితంగా ప్రేమించే తన తల్లికి అందించాడు. ఈ సందర్భంగా తన తల్లి మోములో కన్పించిన గర్వం అమూల్యమని సచిన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. తల్లికి పుస్తకాన్ని ఇస్తూ ఆ ఫొటోని కూడా సచిన్‌ ట్విట్టర్‌లో పెట్టాడు.

ఇక, ‘ప్లేయింగ్‌ ఇట్‌ మై వే’ మార్కెట్‌లోకి పూర్తిస్థాయిలో వచ్చాక, అందులో ఏముందన్నదానిపై చర్చ షురూ అవ్వాల్సి వుంది. టెస్టుల్లో, వన్డేల్లో ఇంకెవరికీ సాధ్యం కాని రికార్డుల్ని నెలకొల్పిన సచిన్‌, క్రికెట్‌ కెరీర్‌లో ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్ళలేదు. కానీ ఆత్మకథలో మాత్రం కొన్ని వివాదాలకు తెరలేపాడు. తెరపైకొచ్చింది ఛాపెల్‌ వివాదం మాత్రమే. ప్లేయింగ్‌ ఇట్‌ మై వే ఆత్మకథలో సచిన్‌ ఇంకెన్ని సంచలనాలకు ఆస్కారం కల్పించాడో ఏమో.!