సినిమా రివ్యూ: దొంగాట

రివ్యూ: దొంగాట రేటింగ్‌: 3/5 బ్యానర్‌: మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. తారాగణం: లక్ష్మీ మంచు, అడివి శేష్‌, మధునందన్‌, ప్రభాకర్‌, బ్రహ్మానందం, పృధ్వీ, పవిత్ర తదితరులు మాటలు: సాయి మాధవ్‌ బుర్రా సంగీతం: సత్య…

రివ్యూ: దొంగాట
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.
తారాగణం: లక్ష్మీ మంచు, అడివి శేష్‌, మధునందన్‌, ప్రభాకర్‌, బ్రహ్మానందం, పృధ్వీ, పవిత్ర తదితరులు
మాటలు: సాయి మాధవ్‌ బుర్రా
సంగీతం: సత్య మహావీర్‌, సాయి కార్తీక్‌, రఘు కుంచె (యాందిరో)
కూర్పు: యస్‌.ఆర్‌. శేఖర్‌
ఛాయాగ్రహణం: సామల భాస్కర్‌
నిర్మాత: లక్ష్మీ మంచు
రచన, దర్శకత్వం: వంశీకృష్ణ
విడుదల తేదీ: మే 8, 2015

లక్ష్మీ మంచు నిర్మించిన ‘దొంగాట’ సినిమా ప్రోమోలు రిలీజ్‌ అయిన దగ్గర్నుంచీ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది. ఈ సినిమా ప్రామిసింగ్‌గా కనిపిస్తోందని, అలరించే క్రైమ్‌ కామెడీ అవుతుందనే నమ్మకం కలిగించింది. లక్ష్మీ మంచు అగ్రెసివ్‌ ప్రమోషన్స్‌తో దొంగాట అనే సినిమాకి ఒక అటెన్షన్‌ అంటూ దక్కింది. ఏ అంచనాలు లేకుండా వచ్చేయడం వేరు, కాస్తో కూస్తో ఆకర్షించి రావడం వేరు. ప్రామిసింగ్‌గా కనిపించినప్పుడు దానిని నిలబెట్టుకోవడం, ఫైనల్‌గా ఇంప్రెస్‌ చేయడం కష్టమే. కానీ ‘దొంగాట’ సినిమాకి ఉన్న స్ట్రాంగ్‌ స్క్రిప్ట్‌ వల్ల ఆ పని సులువైపోయింది. 

విడుదల కాకముందు కలిగించిన నమ్మకానికి తగ్గట్టే ఇందులో వినోదానికి లోటు లేదు. మనిషిలోని స్వార్ధాన్ని హైలైట్‌ చేస్తూ తీసిన ఈ క్రైమ్‌ కామెడీలో కాస్త సెంటిమెంట్‌ డోస్‌ కూడా పడింది. అది మోతాదుకి మించి అసలు సినిమాకే అనర్ధం జరిగే ప్రమాదం కూడా కనిపించింది. అయితే సినిమాని చివరి ఘట్టంలో తిరిగి పట్టాలెక్కించడం వల్ల అది తప్పింది. ఓవరాల్‌గా ‘దొంగాట’ ఒక్కసారి చూడదగ్గ టైమ్‌పాస్‌ సినిమా అనిపిస్తుంది. 

జీవితంలో ఏదైనా చెడ్డ పని చేసి అయినా సెటిల్‌ అయిపోవాలని చూసే వెంకట్‌ (శేష్‌), విజ్జు (మధు), కాటంరాజు (ప్రభాకర్‌) కలిసి శృతి (లక్ష్మీ) అనే ఓ సినిమా హీరోయిన్‌ని కిడ్నాప్‌ చేస్తారు. ఆమె తల్లి (పవిత్ర) దగ్గర్నుంచి పది కోట్లు డిమాండ్‌ చేస్తారు. మరి వారు ప్లాన్‌ చేసినట్టుగానే ఆ పది కోట్లు వారి చేతికి వస్తాయా, రావా? సెటప్‌ పాతదే అయినా కానీ ట్రీట్‌మెంట్‌ పరంగా కొత్తదనం అందించారు. ఎక్కడికక్కడ ట్విస్టులతో ఈ క్రైమ్‌ కామెడీని ఎంటర్‌టైనింగ్‌గా నడిపించారు. మధ్యలో సెంటిమెంటల్‌ టచ్‌ ఇవ్వడం కూడా బాగుంది. అయితే ఆ సెంటిమెంట్‌కి ఎక్కడ బ్రేక్‌ వేయాలో తెలీక చాలా సేపు కొనసాగించారు. 

దీని వల్ల ఫస్టాఫ్‌ ఎంత సాఫీగా సాగిపోయినా సెకండాఫ్‌కి స్టార్టింగ్‌లోనే స్పీడ్‌ బ్రేకర్స్‌ ఎదురయ్యాయి. అనాధాశ్రమంలో సన్నివేశాలు అవసరానికి మించిపోయాయి. అన్నపూర్ణ, గిరిబాబు ఎపిసోడ్‌, ఆ తర్వాత వచ్చే పాట అనవసరం అనిపిస్తుంది. అప్పటికి పర్పస్‌ ఏంటనేది స్పష్టంగా రిజిష్టర్‌ అయిపోయింది. అలాంటప్పుడు ఇంకా దానిని కొనసాగించి జనం నెత్తిన రుద్దాల్సిన పని లేదు. ఆ ఎపిసోడ్‌ని, ఆ సాంగ్‌ని ఇప్పటికైనా ఎడిట్‌ చేసుకునే వీలుంది. అసలు కథ చప్పగా ముగించేసి, ఏం లేకుండా తేల్చేసారు అనిపించినంతలోనే మళ్లీ ట్విస్ట్‌ ఇచ్చి.. ఆడియన్స్‌నే ‘కాన్‌’ చేసారు. ఆ ట్విస్ట్‌తో పాటు మారియట్‌ హోటల్‌లో జరిగే క్లయిమాక్స్‌ బాగా వచ్చింది. టైటిల్‌కి తగ్గ జస్టిఫికేషన్‌ జరగడంతో పాటు… సినిమా స్థాయి సైతం పెరిగింది. 

మిడిల్‌లో కొన్ని అప్‌ అండ్‌ డౌన్స్‌ ఉన్నా కానీ ఫస్ట్‌ హాఫ్‌, క్లయిమాక్స్‌ బాగా రావడంతో ‘దొంగాట’ పాస్‌ అయిపోయింది. దర్శకుడు వంశీ కృష్ణ స్క్రిప్ట్‌ స్టేజ్‌లోనే సక్సెస్‌ అయ్యాడు. పకడ్బందీ స్క్రీన్‌ప్లే రాసుకోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ మళ్లీ సినిమాని నిలబెట్టగలిగాడు. దర్శకుడికి కొత్తే అయినా కానీ ఎక్కడా తడబడకుండా నడిపించాడు. మంచు లక్ష్మి ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్‌కి భిన్నమైన పాత్రలో కనిపించింది. ఆమె స్క్రీన్‌ ప్రెజెన్స్‌, పర్‌ఫార్మెన్స్‌తో పాటు తనకున్న పాపులారిటీ ఈ సినిమాకి హెల్ప్‌ అవుతుంది. అడివి శేష్‌ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. కాన్‌మేన్‌గా అతని బాడీ లాంగ్వేజ్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ బాగున్నాయి. మధునందన్‌, ప్రభాకర్‌ తమ వంతు సహకారం అందించారు. పవిత్రతో ఫ్లర్ట్‌ చేసే డిటెక్టివ్‌గా బ్రహ్మానందం కొన్ని సీన్స్‌లో నవ్వించాడు. పృధ్వీ కూడా జత కలిసి తన మార్కు పంచ్‌లతో అలరించాడు. 

నటీనటులు తక్కువే అయినా కానీ మెయిన్‌ క్యారెక్టర్స్‌ చేసినవారంతా ‘దొంగాట’ రక్తి కట్టడంలో తలో చెయ్యి వేసారు. సాంగ్స్‌ అవసరం లేదనిపించింది. నాగార్జున, రవితేజ, రాణా, తాప్సీ, మనోజ్‌, నాని, శింబు.. తదితరులున్న స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరణ మాత్రం కనువిందుగా ఉంది. సాయిమాధవ్‌ బుర్రా కొన్ని మంచి డైలాగ్స్‌ రాసి తన ప్రత్యేకత చాటుకున్నారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ బాగానే ఉన్నాయి. మంచు లక్ష్మి ఇంతకాలం కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పెద్దగా లేని సినిమాలతో ప్రయోగాలు చేసినా ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌ బాగా ఉన్న స్క్రిప్ట్‌ని కరెక్ట్‌గా జడ్జ్‌ చేసి ప్రొడ్యూసర్‌గా సినిమా అవసరం మేరకు ఖర్చు పెట్టింది. 

కాలక్షేపానికి లోటు లేని ఈ చిత్రంలో క్లాస్‌ని ఆకట్టుకునే ఇంటిల్లిజెంట్‌ స్క్రీన్‌ప్లేతో పాటు మాస్‌ ఆడియన్స్‌కి నచ్చే వినోదం కూడా ఉంది. బాక్సాఫీస్‌ని గెలిచే మేటర్‌ అయితే సినిమాలో ఉంది. మరి స్టార్స్‌ లేని ఈ చిన్న సినిమా ఆడియన్స్‌ని థియేటర్ల వరకు ఏ మేరకు రప్పిస్తుందనే దానిపై సక్సెస్‌ డిపెండ్‌ అవుతుంది. 

బోటమ్‌ లైన్‌: ఆట బానే వుంది!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri