రివ్యూ: సినిమా చూపిస్త మావ
రేటింగ్: 2.75/5
బ్యానర్: ఆర్యత్ సిని ఎంటర్‌టైన్‌మెంట్స్, లక్కీ మీడియా
తారాగణం: రాజ్ తరుణ్, అవిక గోర్, రావు రమేష్, తోటపల్లి మధు, సత్య, ప్రవీణ్, కృష్ణభగవాన్, జయలక్ష్మి తదితరులు
సంగీతం: శేఖర్‌చంద్ర
మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
కూర్పు: కార్తీక శ్రీనివాస్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
నిర్మాతలు: బోగాధి అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేష్ డి. గోహిల్, జి. సునీత
కథ, కథనం, దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
విడుదల తేదీ: ఆగస్టు 14, 2015
అన్నిట్లో క్వాలిటీ కోరుకునే వ్యక్తి తన కూతురికి కూడా అన్నిటా మంచి క్వాలిటీస్ ఉన్న వాడిని తెచ్చి పెళ్లి చేద్దామనుకుంటాడు. కానీ ఆమె మాత్రం ఎలాంటి గుడ్ క్వాలిటీస్ లేని ఒక రోడ్ సైడ్ రోమియోని ప్రేమిస్తుంది. కూతురి సెలక్షన్ నచ్చక సదరు రోమియోకి ఆ 'మావ' ఓ కండిషన్ పెడతాడు. ఫైనల్‌గా తన పద్ధతులు మార్చుకుని కూతురికి నచ్చినవాడిని యాక్సెప్ట్ చేస్తాడు. ఈ పాయింట్‌తో ఇప్పటికి చాలా సినిమాలు తెరకెక్కాయి. త్రివిక్రమ్‌లాంటి వాళ్లు ఈ కథని 'నువ్వే నువ్వే' అంటూ క్లాసీగా డీల్ చేస్తే, పూరి జగన్నాథ్‌లాంటి వాళ్లు తమదైన శైలిలో 'ఇడియట్'లని చూపించారు. అసలు కథ నుంచి 'రేసుగుర్రం'లాంటి సినిమాల్లో సబ్ ప్లాట్‌గా మారిపోయిన ఈ కథతో ఇంకోసారి 'సినిమా చూపిస్తానంటూ' వచ్చాడు త్రినాథరావు నక్కిన.
క్వాలిటీ అనే కాన్సెప్ట్ మీద చాంతాడంత ఉపోద్ఘాతంతో మొదలయ్యే ఈ చిత్రంలో దురదృష్టవశాత్తూ క్వాలిటీ స్క్రిప్ట్ లేదు. తెలుగు సినిమాలో స్క్రిప్టుదేముంది… స్టార్ట్ టు ఎండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే పాస్ అయిపోతుందని అనుకోవడానికీ లేదు. క్వాలిటీ స్క్రిప్ట్ ఉంటే ప్రేక్షకాదరణ కూడా బాగుంటుందని రీసెంట్‌గా శ్రీమంతుడు ఉదాహరణగా నిలుస్తుంది. అవిక గోర్, రాజ్ తరుణ్‌ల మొదటి సినిమా 'ఉయ్యాల జంపాల' తీసుకుంటే దాంట్లో స్క్రిప్టు పరంగా నాణ్యత ఉంది, అలాగే ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ ఉంది. సినిమాలో వినోదం పేరిట ఏం చూపించినా ఫర్వాలేదనే వారికి, పాప్‌కార్న్ ఎంటర్‌టైన్‌మెంట్ సీకర్స్‌కి 'సినిమా చూపిస్త మావ' అప్పీల్ అవుతుంది. కామెడీ కోసమని చేయని ప్రయత్నమంటూ లేని ఈ చిత్రంలో అక్కడక్కడా నవ్వించే సన్నివేశాలయితే ఉన్నాయి కానీ దీనిని ఎంజాయ్ చేయడానికి మనకి బుర్రలు ఉన్న సంగతి పూర్తిగా మర్చిపోవాలి. ఎందుకంటే లాజిక్ అనేది ఏ కోశాన అయినా లేని మసాలా ఎంటర్‌టైనర్ ఇది.
ఇంటర్ తప్పిన కుర్రాడు ఇంజినీరింగ్ కాలేజ్‌లోకి వచ్చి క్లాసులకి అటెండ్ అయిపోతుంటాడు. స్టేజీలెక్కి డ్రామాలు కూడా వేసేస్తుంటాడు. అసలు అతడు తమ కాలేజ్‌లో చదువుతున్నాడా లేదా అనేది కూడా ప్రిన్సిపల్‌కి తెలియదు. ఏకంగా బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ కూడా ఇచ్చేస్తాడు. తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి నెల రోజులు తమ కుటుంబాన్ని పోషిస్తే చాలని 'క్వాలిటీ' తండ్రి కండిషన్ పెడతాడు. అతడెలా సంపాదిస్తున్నాడో, ఏం చేసి ఆ నెల గడిపేస్తున్నాడో అతనికి పట్టదు. ఊరినుంచి తన చుట్టాల్ని పిలిపించి వాళ్లతో భోజనం టేబుల్ దగ్గర హీరోని వేధించడం అతడు వేసే మాస్టర్ ప్లాన్. తల, తోక లేకుండా.. అసలు అర్థం పర్ధం లేకుండా సాగిపోతున్న తంతు అంతా కామెడీ అని సరిపెట్టుకునేంత పెద్ద మనసుండాలి. ఇదంతా లాజికల్‌గా సాధ్యమా అని ఆలోచించలేనంత చిన్న బుర్ర కూడా వుండాలి.
కామెడీ పేరిట చేసే తంతులో చాలా భాగం వేరే సినిమాల నుంచి, పాపులర్ సన్నివేశాల నుంచి ఇన్‌స్పయిర్ అయినదే. 'ద్రౌపది వస్త్రాపహరణం' కాన్సెప్ట్‌కి 'స్వామీ నదికి పోలేదా' టచ్ ఇచ్చి ఒక రూపకం, శ్రీను వైట్ల సినిమాల్లో తరచుగా కనిపించే తాగుడు ప్రహసనం… ఇలాంటివన్నీ కామెడీలో భాగాలే. కొన్ని సందర్భాల్లో ఆకట్టుకునే సంభాషణలు, కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయిన కామెడీ మినహా ఇందులో చెప్పుకోతగ్గ విశేషాలేం లేవు. 'సినిమా చూపిస్త మావ' అంటూ అల్లు అర్జున్ పాటలోంచి టైటిల్‌ని, ఆ థీమ్‌లోంచి సబ్జెక్ట్‌ని రెడీ చేసుకున్నట్టు అనిపిస్తుంది.
రాజ్ తరుణ్ కాన్ఫిడెంట్‌గా నటించాడు కానీ ఇలాంటి కథలకి కాస్త పేరున్న హీరోలైతే తమ ఇమేజ్‌తో ఎక్స్‌ట్రా మైలేజ్ ఇస్తారు. ఇంకా లేతగా వున్న రాజ్ తరుణ్ ఇలాంటి హైపర్ క్యారెక్టర్ల కంటే, 'ఉయ్యాల జంపాల'లో చేసిన పక్కింటి కుర్రాడి పాత్రలకి కొన్నాళ్లు కట్టుబడి వుంటే మంచిదేమో. అవిక గోర్ గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. రావు రమేష్‌కి ఇలాంటి పాత్రలు రొటీన్ అయిపోతున్నాయి. మధు, సత్య, ప్రవీణ్ తదితరులు కామెడీ పరంగా హెల్పయ్యారు. కామెడీ పేరుతో రావు రమేష్, జయలక్ష్మి నడుమ ఫోర్స్‌డ్ రొమాన్స్ పాత్రోచితంగా లేదు.
ముందే చెప్పినట్టు సంభాషణలు బాగున్నాయి. పిల్లి కళ్ల పాపా, సినిమా చూపిస్త మావ పాటలు మాస్‌ని ఆకట్టుకుంటాయి. ఛాయాగ్రహణం ఫర్వాలేదు. దర్శకుడు త్రినాథరావు ఇంతకుముందు ఫీల్ గుడ్ సినిమాలు తీసి సక్సెస్ కాలేకపోవడంతో ఈసారి ఫక్తు ఫార్ములాని నమ్ముకున్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి, కమర్షియల్ ఎలిమెంట్స్‌కి కొంచెమైనా అర్థవంతమైన కథ జోడించినట్టయితే బాగుండేది. లోపాలు చాలానే ఉన్నా, లాజిక్‌కి చోటు లేకపోయినా కామెడీ పరంగా స్కోర్ చేసిన ఈ చిత్రం కేవలం అదే బలంతో బాక్సాఫీస్‌ని సక్సెస్‌ఫుల్‌గా దాటేస్తుందో లేదో చూడాలి.
బోటమ్ లైన్: అదే పాత సినిమా సినిమా మామా!
– గణేష్ రావూరి