చితిపైకి కాంగ్రెస్

ఎన్నికల ఘట్టంలో తుది ఫలితం ఎలా వుంటుదన్న ఉత్కంఠ మరో 24 గంటలు వుంటుంది. కానీ ఎన్నికలకు ముందే తెలిసిపోయిన ఫలితం కాంగ్రెస్ ది. పోలింగ్ తరువాత మరింత స్పష్టమైంది. రేపు ఈ పాటికి…

ఎన్నికల ఘట్టంలో తుది ఫలితం ఎలా వుంటుదన్న ఉత్కంఠ మరో 24 గంటలు వుంటుంది. కానీ ఎన్నికలకు ముందే తెలిసిపోయిన ఫలితం కాంగ్రెస్ ది. పోలింగ్ తరువాత మరింత స్పష్టమైంది. రేపు ఈ పాటికి పూర్తిగా చితిపైకి చేరిపోతోంది సీమాంద్రలో కాంగ్రెస్ పార్టీ. ఎన్టీఆర్ ప్రభంజనాన్ని కూడా తట్టకుని అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఒడించరు. దాన్ని అదే ఓటించుకోగలదు అనే అర్థం వచ్చేలా గతంలో చాలా మంది పెద్దలు చాలా స్టేట్మెంట్ లు ఇచ్చారు. ఇప్పుడే అదే జరుగుతోంది. పచ్చగా వున్న రాష్ట్రాన్ని చూసి ఓర్వలేకో, మరే విధమైన అడ్డగోలు ప్రయోజనాలు ఆశించో, పార్టీ పెద్దలు చేసిన పనికి ఇవ్వాళ సీమాంద్ర కాంగ్రెస్ అభిమానులు, నేతలు, కార్యకర్తలు మూల్యం చెల్లిస్తున్నారు. 

ఎంత మంది రాజకీయ భవిష్యత్ సమాధి అయిపోతోంది. తెలివైన వారు, సామాజిక వర్గ అండా దండా వున్నవారు, పక్క పార్టీల్లోకి జంప్ జిలానీ అనేసి అదృష్ట వంతులైపోయారు. వారి పాపం ప్రక్షాళన చేసేసుకున్నారు. అమ్మకు చిక్కిన మేకల్లా బోత్స, రఘువీరా, చిరంజీవి లాంటి వారు బలైపోయారు. ఉండవల్లి, కిరణ్, లాంటి వాళ్లు వాన ప్రస్థం స్వీకరిస్తున్నారు. లగడపాటి లాటి వాళ్లు అప్పుడప్పుడు గాండ్రిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సీమాంద్రలో పాతాళానికి పోవడం ఖాయమైంది. ఇప్పుడు మిగిలిన పెద్దలు పార్టీ మారే వీలూ లేదు. మరో ఏడాది, రెండేళ్ల వరకు మాటాడే పరిస్థితి లేదు. మహా అయితే, ఓటమికి నైతిక బాధ్యత మాదే అంటే, దొరికిందే అవకాశంగా పార్టీని వదిలేసుకోవచ్చు. ఆపై ఓ ఏడాది సైలెంట్ గా వుండి అపై నచ్చిన పార్టీలోకి జారుకుని,వచ్చే ఎన్నికలకు రెడీ కావచ్చు. 

కానీ ఈ తెలివితేటలు విభజనకు ముందు వుండి వుంటే, వారికి, ఈ రాష్ట్రానికి కూడా ఈ తరహా పరిస్థితి వచ్చి వుండేది కాదు. ధైర్యం చేసి అధిష్టానాన్ని ఎదిరించి, మొత్తం జనాలు అంతా ఆ రోజే పదవులను, పార్టీని వీడి వుంటే, కాంగ్రెస్ కచ్చితంగా వెనుకంజ వేసి వుండేదేమో? కానీ విభజనపై అధిష్టానం మనోగతం తెలియక, పార్టీ ఆగ్రహిస్తే తమ బతుకులు ఏమైపోతాయో అని, అధికారాన్ని, అధిష్టానాన్ని పట్టుకుని అంటకాగారు. కానీ ప్రజలు ఆగ్రహిస్తే ఏమవుతుంది అని ఆలోచించలేకపోయారు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు, పుస్తకాలు, నిబంధనలు వల్లించిన ఉండవల్లి లాంటివారు, గాల్లో చేతులు తిప్పుతూ, జరగదు అని జోస్యాలు చెప్పిన లగడపాటి లాంటివాళ్లు ఇప్పుడు బాగనే వున్నారు. కానీ పార్టీని నమ్ముకున్న చోటా మోటా నాయకులు కుదేలైపోయారు. కార్యకర్తలు ఎప్పడో అటో, ఇటో జారుకున్నారు. 

ఇప్పుడు అందరూ కలిసి విజయవంతంగా పార్టీని చితిపైకి చేర్చేసారు. ఇప్పటికి కూడా కనువిప్పు కలుగడం లేదు పార్టీ అధిష్టానానికి. తప్పుచేసాం లేదా తప్పుడు అంచనా వేసాం..అని ప్రజల ముందు లెంపలు వేసుకునే ఆలోచన చేయడం లేదు. పైగా విభజన పాపం మా ఖాతాలోనే వేసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కత్తి అందించిన వాడి కన్నా అందుకుని హత్య చేసినవాడిదే అసలు నేరం అవుతుందనే కనీస ఇంగిత జ్ఞానం లేదా వందేళ్లకు పైగా అనుభవం పండిన పార్టీకి. అధినేత్రి ధైర్యంగా సీమాంధ్రలో అడుగుపెడితే, సీమాంధ్రులకు పౌరుషం లేదా..కనీసం నిరసన తెలియచేయలేదే అనుకున్నారు కొందరు. కానీ సీమాంధ్రులు తెలివైన వారు, నచ్చని వారికి సైలెంట్ గానే సమాధి కట్టేస్తారు అని ఇప్పడు స్పష్టమైంది. 

మొత్తానికి దాన్ని పట్టకుని వేలాడిన,వేలాడుతున్న నాయకుల ముందే అది కనుమరుగైపోతోంది.

చాణక్య

[email protected]