అభయ కేసులో 20 ఏళ్ళ జైలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార – హత్య ఘటనను తలపించేలా ఆంధ్రప్రదేశ్‌లో అభయ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని అపహరించి, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులపై నిర్బయ కేసు నమోదు చేసి,…

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార – హత్య ఘటనను తలపించేలా ఆంధ్రప్రదేశ్‌లో అభయ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని అపహరించి, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులపై నిర్బయ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆ నిందితుల్ని దోషులుగా తేల్చారు. న్యాయస్థానం ఈ కేసులో ఈ రోజు తీర్పునిచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో నిర్భయ చట్టం కింద తొలి తీర్పుగా అభయ కేసులో రంగారెడ్డి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని చెప్పుకోవచ్చు. నిందితుల్ని దోషులుగా తేల్చిన న్యాయస్థానం ఏకంగా 20 ఏళ్ళ జైలు శిక్ష విధించింది వారికి. అయితే హైకోర్టును ఆశ్రయిస్తామనీ, నిందితులపై తప్పుడు అభియోగాలు నమోదయ్యాయనీ నిందితుల తరఫు న్యాయవాది చెబుతున్నారు.

అత్యాచారానికి గురైన బాధితురాలు.. నిందితుల నుంచి తప్పించుకుని, తన నివాసానికి చేరుకుంది. అక్టోబర్‌ 18, 2013 అర్థరాత్రి జరిగిందీ ఘటన. ఘటన గురించి బయటకు చెప్పుకోలేక బాధితురాలు లోలోపల కుమిలిపోగా, గమనించిన సన్నిహితులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్‌ఐఏ సహకారంతో కేసుని ఛేదించారు. సుమారు 7 నెలల వ్యవధిలో ఈ కేసు విచారణ పూర్తవడం, దోషులకు శిక్ష పడటం గమనార్హం.