ఒంటరిగా మిగులుతున్న జూనియర్ ?

వయసు తక్కువైనా, తొడ కొట్టడంలో ట్రయినింగ్  బాగా పొందిన వాడు జూనియర్ ఎన్టీఆర్. తను వేసిన పాత్రల ప్రభావమో, తన చుట్టూ చేరిన జనాలు అందించిన మైకమో, తన స్థాయిని కాస్త ఎక్కువగా అంచనా…

వయసు తక్కువైనా, తొడ కొట్టడంలో ట్రయినింగ్  బాగా పొందిన వాడు జూనియర్ ఎన్టీఆర్. తను వేసిన పాత్రల ప్రభావమో, తన చుట్టూ చేరిన జనాలు అందించిన మైకమో, తన స్థాయిని కాస్త ఎక్కువగా అంచనా వేసుకున్నాడు. పోనీ కుర్రాడు పార్టీకి పనికి రాకుండా పోతాడా అని చంద్రబాబు కూడా, దగ్గర సంబంధం చూసి కట్టబెట్టేసాడు. ఆ మాత్రం కట్టుబడి వుండకపోతాడా అనుకున్నాడు. కానీ తొందరపడి ముందే కూసే కోయిల టైపు మనవాడు. అందుకే రాజకీయాల్లో వేలు పెట్టడం, మామ చానెల్ ను తన కంట్రోల్ లోకి తీసుకోవడం, తన వాళ్లని కనుసైగతో వేరే పార్టీల్లోకి పంపడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. తాను కాదన్నా, ఈ విషయం తెలుగుదేశం అభిమానులు నమ్ముతున్నదే. 

సరే అక్కడితో అసలు కథ ప్రారంభమైంది. తెలుగుదేశం వర్గాలు ఈ చిన్న ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కత్తులు నూరడం ప్రారంభించాయి. విజయవాడ వెళ్తే, కలవ కూడదని శాసనం. సినిమాలు విడుదలైతే, చూడవద్దంటూ ఎస్సెమ్మెస్ లు. మరొపక్క చంద్రబాబు ఇంటి నుంచి చినబాబు వారసుడి కథ మొదలయింది. దాంతో కథ మరింత రంజుగా తయారైంది. హరికృష్ణకు కుతకుత లాడింది. ఎన్టీఆర్ కు చిమచిమ లాడింది. కానీ ఏం సుఖం. చంద్రబాబు చాణక్యం ముందు ఎవరు ఆగగలరు? చాలా తెలివిగా లోకేష్ ను తెరవెనుక నుంచి తెరపైకి తెచ్చాడు. ఇప్పుడు లోకేష్ తండ్రితో సమానంగా యువ గర్జనలు వినిపిస్తున్నారు. పార్టీ పిలిస్తే, ఎప్పుడైనా ప్రచారానికి రెడీ అని పాపం, ఎన్నిసార్లు ప్రకటనలిచ్చినా, హరిబాబుగారి చినబాబును బొట్టు పెట్టి పిలిచేవారు కరువయ్యారు.  ఎన్నికలు సమీపిస్తున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన కనపడడంలేదు. అలాగే చంద్రబాబునాయుడు కూడా జూనియర్ మాట ఎత్తడం లేదు. దీంతో టిడిపికి జూనియర్ ను బాబు దూరంగా ఉంచినట్టే అన్నది క్లియర్ అయిపోయింది. . హరిక్రిష్ణ వ్యవహారం ముదిరిన తరువాత కూడా జూనియర్ తాను టిడిపి కోసమే పనిచేస్తాను. చంద్రబాబు కోరితే టిడిపికి ప్రచారం చేస్తాను అని మీడియా ముందు ప్రకటించారు. అయినా అదేమంత ఫలితం ఇవ్వలేదు. 

తాత పెట్టిన పార్టీని కాపాడుకోవడం తన భాద్యత అంటూ చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నుంచి జూనియర్ విషయంలో నామమాత్రపు స్పందన కూడా లేదంటే ఇక టిడిపిలో 'బుడ్డోడి' శకం ముగిసినట్టే అన్నది క్లియర్. ఇంత క్లియర్ గా విషయం తెలిసిన తరవాత కూడా జూనియర్ నుంచి ఎలాంటి స్పందన కానరావడం లేదు. అంటే ఆయన కూడా ఇక రాజకీయాల జోలికి రావొద్దనుకుంటున్నారా… లేక మరేదైనా ఆలోచిస్తున్నారా అన్నదే అనుమానం. .

అప్పట్లో ఆయన తన మితుడు నాని కోసం వైకాపా కు పరోక్ష సహకారం అందిస్తారు అన్న ప్రచారం జరిగింది. అందులో భాగంగానే వైకాపా పోస్టర్లపై జూనియర్ ఫోటోలు వెలిసాయి అన్నారు. ఆ గొడవ సద్దుమనిగినా కూడా దాని వెనుక ఏదో మతలబు ఉందని మాత్రం అందరు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే హరికృష్ణ కూడా జగన్ మాదిరిగానే సమైక్యాంధ్ర టర్నింగ్ ఇచ్చుకున్నారు.

చంద్రబాబుకు తెలియకుండా, ఆయనకు సమాచారం ఇవ్వకుండా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు, ఆమోదింప చేసుకున్నారు. అంతే కాదు చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రకు సిద్దమవుతున్న వేళ, అంతకు రెండు రోజుల ముందునుంచే తాను చైతన్యయాత్రను చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే చంద్రబాబు  ముందు హరికృష్ణ పప్పులుడకలేదు.

తర్వాత జూనియర్ ను, హరికృష్ణను చంద్రబాబు పూర్తిగా దూరం ఉంచడం మొదలెట్టారు. చివరకు బాలకృష్ణ రెండో కూతురు వివాహానికి కూడా జూనియర్ కు పిలుపు రాలేదంటేనే వారి మద్య విభేదాలు ఏ స్థాయికి చేరాయో అర్థం అయింది. అయితే మద్యలో ఆపదవేళ అందరు ఒక్కటవుతున్నారు అన్న వాఖ్యలు వినిపించాయి. లోకేష్ కూడా జూనియర్, హరికృష్ణను కలుపుకు పోయేందుకు ప్రయత్నాలు చేసారు అన్నారు. కాని ఇప్పుడు టిడిపి పరిస్థితి మారింది. పటిష్టమైన స్థితికి వచ్చేసినట్టు కనిపిస్తోంది. మరో వైపు పవన్ కళ్యాణ్ వంటి హీరో మద్దతు పరోక్షంగా లభించింది. ఇలాంటి తరుణంలో జూనియర్ అవసరం ఏమిటి అన్న భావం చంద్రబాబుకు కలిగిందేమో ?.

పైగా ప్రత్యర్థి పార్టీలలో కూడా సినిమా చరిష్మా ఉన్న వాళ్లు లేరు. అంతో ఇంతో టిడిపి, బిజేపిలలోనే సినిమా వాళ్లంతా చేరారు. ఈ దశలో జూనియర్ ను చేరదీసి మళ్లీ తలమీదకు  తెచ్చుకోవడం ఎందుకు అని చంద్రబాబు భావించి ఉంటారు. అందుకే హరికృష్ణకు టికెట్ విషయంలో కూడా బాబు స్పందించడం లేదు. పైగా హరికృష్ణ కోరుకుంటున్న హిందుపురం స్థానాన్ని బాలకృష్ణకు కేటాయించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నింటిని చూస్తే జూనియర్, ఆయన తండ్రి హరికృష్ణ శకం ఇక టిడిపిలో ముగిసినట్టే అన్న వాదనకే బలం చేకూరుతోంది. కావచ్చు కాకపోవచ్చు. ఒకవేళ పార్టీలోకి వచ్చినా జూనియర్ అక్కడ కూడా జూనియరే. ఎందుకంటే లోకేష్ బాబు ఇప్పుడు ఆల్రెడీ స్టీరింగ్ చేతిలోకి తీసుకుని చక్రం తిప్పేస్తున్నాడు. అలాంటి సమయంలో జూనియర్ మరి ఎందుకు ముందుకు వస్తాడు? 

ఇదిలా వుంటే జూనియర్ కు ఇంకా చాలా సమస్యలు చుట్టుముట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో శుభవార్త కూడా వినిపిస్తోంది. త్వరలో తండ్రి కాబోతున్నాడన్నది ఆ శుభవార్త. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు వస్తున్నాయన్నది ఆ గుసగుస. అవి ఎంతవరకు నిజమో కానీ, ప్రస్తుతం జూనియర్ మామగారు నార్నే శ్రీనివాసరావు కూడా అతగాడితో అంత సయోధ్యగా లేనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ కు దగ్గరైన నార్నె శ్రీనివాసరావు మళ్లీ ఇప్పుడు చంద్రబాబు దగ్గరకు వచ్చేసారు. ఆయన ఛానెల్ ఇప్పుడు తెలుగుదేశం వాణినే వినిపిస్తోంది. అంటే అటు కూడా జూనియర్ కు మద్దతు లేనట్లే. 

తమ తమ స్థాయి తెలియకుండా, సమయా సమయాలు చూడకుండా గెంతితే ఇలాగే వుంటుంది. కొన్నిసార్లు తమకు నచ్చకున్నా కొన్ని భరించాలి. తప్పదు. లేకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది.

చాణక్య

[email protected]