ఎమ్బీయస్‌ : రోత పుడుతోంది – 4

చీఫ్‌ సెక్రటరీ ద్వారా ఆర్థిక సమాచారం గురించి కేంద్ర హోం శాఖను అడిగించడం, హోం శాఖ నుండి 'మేం మీకేం చెప్పం ఫో' అనిపించుకోవడం కూడా మంచి స్ట్రాటజీయే. కేంద్రం ఎంత అసంబద్ధంగా, తలతిక్కగా,…

చీఫ్‌ సెక్రటరీ ద్వారా ఆర్థిక సమాచారం గురించి కేంద్ర హోం శాఖను అడిగించడం, హోం శాఖ నుండి 'మేం మీకేం చెప్పం ఫో' అనిపించుకోవడం కూడా మంచి స్ట్రాటజీయే. కేంద్రం ఎంత అసంబద్ధంగా, తలతిక్కగా, హోం వర్క్‌ లేకుండా పని చేస్తోందో అందరికీ చాటిచెప్పినట్టయింది. రేపు బిజెపి వాళ్లు దీనిపై మాట్లాడుతూ 'మీకు విభజన చేతకాదు' అనడానికి స్కోప్‌ వుంది కదా. బిల్లు అడ్డుకోము కానీ, సవరణలు చేయాలి అని పట్టుబట్టవచ్చు కదా. ఇంతకుమించి ఏ ముఖ్యమంత్రి మాత్రం ఏం చేస్తాడు? ఆయన అన్న 'ఆఖరి బంతి వరకూ ఆట పూర్తయినట్లు కాదు' అన్నది ఫేమస్‌ కొటేషనే. ఆయన కొత్తగా పుట్టించినది కాదు,  చివరివరకూ పోరాడతాం అనే అర్థంలో అందరూ వాడతారు. అంతే తప్ప ఆ బంతి నేనే వేస్తానని కాని, అది హైదరాబాదులోనే వేస్తానని అని కానీ అనలేదు. అననివి వూహించుకుని ఆఖరి బంతి ఢిల్లీలో వుందని ఒకరు, ఆ బాల్‌ 'నో బాల్‌' అని కొందరు, ఒక్క బాల్‌తో మాగ్జిమమ్‌ సిక్సర్‌ తప్ప సెంచరీ కొట్టలేడని మరొకరు… ఏమిటో యీ వ్యాఖ్యానాలు! 'బిల్లు అసెంబ్లీకి రాకుండా చేస్తానని కిరణ్‌ అన్నారు, వచ్చిందేం?' అంటున్నారు కొందరు. అసెంబ్లీ తీర్మానం లేకుండా యిప్పటిదాకా ఏ రాష్ట్రవిభజన జరగలేదు. ఇక్కడికి రప్పించి, ఓడించి పంపుదాం అన్నాడాయన. 

ఇప్పుడు ఎవరైనా ఒంటి చేత్తో సమైక్యం సాధిస్తానని అంటే అంతకంటె పిచ్చివాడు వుండడు. తెలంగాణ తీర్మానం రాగానే కిరణ్‌ రాజీనామా చేసేసినా,  యిప్పుడు తెలంగాణ బిల్లు అసెంబ్లీకి చేరాక సమైక్యతీర్మానం చేసేసినా విభజన ఆగిపోతుందని వాదించేవాళ్లు జనాల్ని మోసం చేస్తున్నట్లే. కిరణ్‌ రాజీనామా చేసి, మరొకరు అతని స్థానంలో వచ్చి కూర్చుంటే ఏం చేసేవాడో ఎవరికీ తెలియదు. కావూరి, పనబాక లక్ష్మి, పళ్లంరాజు, చిరంజీవి.. అందర్నీ చూస్తున్నాం. అధిష్టానంతో ఎందుకొచ్చిన గొడవ తలవంచుకుని పోతే చాలు అనుకుంటున్నారు. కిరణ్‌ ఒక్కడే తన రాజకీయజీవితాన్ని పణంగా పెడుతున్నారు. కాంగ్రెసును ఎదిరించి పార్టీ పెట్టినా ఎన్ని సీట్లు వస్తాయి? పోనీ తర్వాత కాంగ్రెసులో విలీనమైనా మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడా? ఎన్నికల తర్వాత కాంగ్రెసు జగన్‌తోగాని, తెరాసతోగాని, యిద్దరితోగాని పొత్తు కుదుర్చుకుంటే – కెసియార్‌, జగన్‌ కిరణ్‌ను ఒక్క క్షణమైనా సహిస్తారా? ఎటు చూసినా కిరణ్‌ మళ్లీ మంత్రి కూడా అయ్యే ఛాన్సు కనబడటం లేదు. అయినా రిస్కు తీసుకుంటున్నాడు. 
కిరణ్‌ను కొనసాగిస్తున్నారంటే దాని అర్థం – కిరణ్‌ సోనియా చెప్పినట్టే నడుచుకుంటున్నాడని కూడా కాదు. కిరణ్‌ వలన అధిష్టానానికి యిప్పటిదాకా ముప్పు రాలేదు – యీ సమైక్యవాదం విషయంలో తప్ప! బిల్లు ఎసెంబ్లీ నుండి వెళ్లిపోయిన తర్వాత కిరణ్‌ చేయగలిగేది ఏమీ లేదు. ఆ తర్వాత వుంచినా యీ విషయంలో నష్టం లేదు. తీసేస్తే సీమాంధ్రలో మార్టియర్‌డమ్‌ (అమరవీరత్వం) వచ్చేస్తుందని సంకోచించవచ్చు. పైగా కిరణ్‌ స్థానంలో ఎవర్ని తేవాలన్నది కూడా సమస్యగానే వుండవచ్చు. ఆశావహులు చాలామంది వుంటారు. ఎవరిని తృప్తి పరచకపోయినా వాళ్లు వెళ్లి వేరే పార్టీలో చేరవచ్చు, ప్రభుత్వం పడిపోవచ్చు. అంతకంటె గుడ్డి బావే మేలన్నట్టు కిరణ్‌తోనే బండి లాగించవచ్చు. అధిష్టానం అనుకున్నట్టు ఫిబ్రవరి మూడోవారంలో బిల్లు పాస్‌ అయిపోయి, విభజన ప్రక్రియ ప్రారంభమైపోతే కిరణ్‌ ప్రాధాన్యత తగ్గిపోతుంది. కేంద్రం నుండి సలహాదారులు వచ్చి కూర్చుంటారు.

ఇవన్నీ తెలిసి కూడా వైకాపా యాగీ చేస్తోంది. తెలంగాణ బిల్లుపై చర్చిస్తే చాలు విభజనకు ఒప్పేసుకున్నట్టే అంటూ సమైక్యతీర్మానం చేసేసి పంపేస్తే చాలంటూ అసెంబ్లీని మాటిమాటికీ అడ్డుకుంది. తెలంగాణ బిల్లు వచ్చి డిస్కస్‌ చేయమంటూ వుంటే యింకా తీర్మానం ఏమిటి నా బొంద! వైకాపాతో సహా అందరూ మీరే నిర్ణయం తీసుకోవాలని వూదరగొట్టడంతో కేంద్రం నిర్ణయం తీసేసుకుంది. 'మీ రాష్ట్రాన్ని విభజన ఎందుకు చేయకూడదు' అంటూ షోకాజ్‌ నోటీసు యిచ్చింది. ఇప్పుడు ఎందుకు విడగొట్టకూడదో కారణాలు చెప్పుకోవాలంతే. 'విభజన చేస్తే ఫలానా ప్రాంతానికి కష్టమండి, ఫలానావారికి నష్టమండి' అంటూ బతిమాలుతూ చెప్పుకోవాలి. ఈ థలో సమైక్యతీర్మానం అంటే ఫిజిక్స్‌ ప్రశ్నపత్రానికి కెమిస్ట్రీ ఆన్సరు రాసినట్టు వుంటుంది. తెలివుంటే ఫిజిక్స్‌, కెమిస్ట్రీ కలుపుతూ ఆన్సర్‌ చెప్పాలి. 'విభజనలో కష్టనష్టాలున్నాయి కాబట్టి, సమైక్యంగానే వుంచండి' అనే ధోరణిలో వాదించాలి. అంతేగానీ నీ బిల్లును పట్టించుకోం, మేం చెప్పేది విను అంటే పోయిరా అంటారు. 

ఉపనిషత్తుల్లో నేతినేతి వాదం అని వుంది. దీనికి నేతితో, నూనెతో సంబంధం లేదు. న-ఇతి 'నేతి' అయింది. బ్రహ్మపదార్థం గురించి తెలుసుకోవడానికి ఒక్కోదాన్నీ తీసుకుని యిదా, యిదా అని పరిశీలించి బ్రహ్మపదార్థంలో వుండవలసిన ఫలానా లక్షణం లేదు కాబట్టి, ఇది కాదు (న-ఇతి) అనుకుంటూ వెళ్లడమన్నమాట. అలాగే రాష్ట్రప్రజల్లో వున్న అసంతృప్తి పోగొట్టడానికి ఏం చేయాలి అంటూ చర్చ మొదలుపెట్టి ఒక్కో క్లాజూ తీసుకుని, న-ఇతి, యిది పనికి రాదు అనుకుంటూ వాదించవచ్చు. వాదించడం అంటూ మొదలుపెడితే లక్ష పాయింట్లు వున్నాయి. వాటిల్లో వంద పాయింట్లయినా పార్లమెంటు సభ్యుల మెదళ్లలో నాటుకునేట్లు చెప్పగలిగితే చాలు, బిల్లు రూపం మారిపోతుంది. 'ప్రస్తుత రూపంలో వున్న బిల్లు అటు సీమాంధ్రులను, యిటు తెలంగాణ వారిని ఎవరినీ మెప్పించటం లేదు. అందువలన ప్రస్తుతానికి సెలక్టు కమిటీకి పంపి, వారి వాదనలు పరిగణనలోకి తీసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లు తయారుచేయండి చాలు' అని మెజారిటీ సభ్యులు చెపితే, కనీసం రాష్ట్రపతి సూచిస్తే యీ విభజన యింత అన్యాయంగా జరగదు. 

చర్చ జరగకుండా అడ్డుపడితేనే సమైక్య ఛాంపియన్లు అవుతాం అనుకుంటూన్న వైకాపా యీ దిశగా ఆలోచించలేదు. వైకాపా చేష్టల వలన భారతదేశంలోని తక్కిన ప్రాంతాల ప్రజలు, నాయకులు కూడా – 'ఓహో సీమాంధ్రుల వద్ద పాయింట్లు ఏమీ లేవన్నమాట, అల్లరి చేసి విభజన ఆపుదామని చూస్తున్నారు. ఇలాటివి జరుగుతాయనే ఆర్టికల్‌ 3 ద్వారా కేంద్రానికి అన్ని అధికారాలు యిచ్చారు..' అని కన్విన్స్‌ అవుతారు. నిజానికి ప్రతి క్లాజుపై చర్చించమని సూచించి, రాష్ట్రపతి మనకు మహోపకారం చేశారు.  వాటిపై ఓటింగు జరుగుతుందని స్పీకరు హామీ యిచ్చారు. ఇంకేం కావాలి? ఒక్కో క్లాజుపై చర్చించి, ఓటింగు జరుపుతూ పోతే బిల్లులో చాలా క్లాజులు వీగిపోవచ్చు, అంతిమంగా బిల్లు అందరికీ ఆమోదయోగ్యంగా మారవచ్చు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2014) 

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3