సినిమా రివ్యూ: పల్నాడు

రివ్యూ: పల్నాడు రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ తారాగణం: విశాల్‌, లక్ష్మీ మీనన్‌, భారతీరాజా, సూరి, సోమసుందరం తదితరులు సంగీతం: ఇమాన్‌ కూర్పు: ఆంటోనీ ఛాయాగ్రహణం: మాధి నిర్మాత: విశాల్‌ కథ,…

రివ్యూ: పల్నాడు
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ
తారాగణం: విశాల్‌, లక్ష్మీ మీనన్‌, భారతీరాజా, సూరి, సోమసుందరం తదితరులు
సంగీతం: ఇమాన్‌
కూర్పు: ఆంటోనీ
ఛాయాగ్రహణం: మాధి
నిర్మాత: విశాల్‌
కథ, కథనం, దర్శకత్వం: సుసీంద్రన్‌
విడుదల తేదీ: నవంబర్‌ 2, 2013

‘పందెంకోడి’తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన తమిళ హీరో విశాల్‌ కొంత కాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. సక్సెస్‌ కోసం సాగిస్తున్న అన్వేషణలో అతను నిర్మాతగా కూడా అవతారమెత్తాడు. ‘పాండియనాడు’ పేరుతో తమిళంలో విశాల్‌ నిర్మించిన చిత్రం తెలుగులో ‘పల్నాడు’గా విడుదలైంది. ‘నా పేరు శివ’ సినిమాతో ఆకట్టుకున్న తమిళ దర్శకుడు సుసీంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విశాల్‌ కష్టాలు తీర్చి అతడిని ఒడ్డున పడేసిందా?

కథేంటి?

సెల్‌ ఫోన్‌ షాప్‌ నడుపుకునే శివకుమార్‌ (విశాల్‌) స్వతహాగా పిరికివాడు. తమ ఇంటిపైనే అద్దెకుండే మాలతిని (లక్ష్మి మీనన్‌) ప్రేమిస్తాడు. ఆ ఊరికి పెద్ద దాదా అయిన కాటమ రవి తన మైనింగ్‌ వ్యాపారానికి అడ్డు తగిలాడని, శివకుమార్‌ అన్నయ్యని చంపేస్తాడు. దాంతో శివకుమార్‌, అతని తండ్రి (భారతీరాజా) విడివిడిగా రవిపై పగ తీర్చుకోవాలని పథకం వేసుకుంటారు. వారు వాటిని ఎలా అమలు చేస్తారనేది మిగతా కథ.

కళాకారుల పనితీరు!

ఇంతకుముందు ఎక్కువగా మాస్‌ క్యారెక్టర్స్‌లో హీరోయిజం చూపించిన విశాల్‌ ఈసారి సగటు యువకుడిగా, భయస్తుడిగా నటించాడు. విశాల్‌కి ఉన్న యాక్షన్‌ హీరో ఇమేజ్‌కి భిన్నంగా అతడిని ప్రెజెంట్‌ చేయడంతో కొత్తగా అనిపిస్తుంది. విశాల్‌ కూడా తన పాత్రకి న్యాయం చేశాడు. కొన్ని సీన్స్‌లో కామెడీ కూడా ట్రై చేశాడు. లక్ష్మీమీనన్‌ చూడ్డానికి సింపుల్‌గా, పక్కింటి అమ్మాయిలా ఉంది. ఆమె నటన కూడా సహజంగా అనిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇందులో హీరో తండ్రిగా కీలక పాత్ర పోషించారు. ఆయన నటన మెప్పిస్తుంది. విలన్‌ పాత్ర పోషించిన నటుడు ఫర్వాలేదనిపించాడు. 

సాంకేతిక వర్గం పనితీరు:

పాటలు ఆకట్టుకోవు. సంగీతమే బాలేదంటే, అనువాద సాహిత్యం పాటల్ని మరింత చెడగొట్టింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. సినిమాటోగ్రఫీ ప్లస్‌ పాయింట్‌. నేచురల్‌ లైటింగ్‌తోనే తీయడం వల్ల సినిమా చాలా రియల్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్‌ పరంగా ప్లస్‌లు, మైనస్‌లు ఏమీ లేవు. 

డైరెక్టర్‌ సుసీంద్రన్‌ ‘నా పేరు శివ’ తరహాలోనే దీనిని కూడా రూపొందించే ప్రయత్నం చేశాడు. దానిలానే ఇది కూడా రివెంజ్‌ బ్యాక్‌డ్రాప్‌తో నడుస్తుంది. డైరెక్టర్‌గా కొన్ని సీన్స్‌లో రాణించాడు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కొన్ని బాగా చిత్రీకరించాడు. కాకపోతే రచయితగా మాత్రం విఫలమయ్యాడు. రొటీన్‌ స్టోరీని ఇంట్రెస్టింగ్‌గా మలిచే ప్రయత్నమైతే జరిగింది కానీ ఫలితం మాత్రం దక్కలేదు. 

హైలైట్స్‌:

  •     – సహజత్వానికి దగ్గరగా ఉన్న ప్రొడక్షన్‌ డిజైన్‌
  •     – విశాల్‌ పర్‌ఫార్మెన్స్‌
  •     – హీరో హీరోయిన్స్‌ లవ్‌ ట్రాక్‌

డ్రాబ్యాక్స్‌:

  •     – రొటీన్‌ స్టోరీ
  •     – వీక్‌ స్క్రీన్‌ప్లే

విశ్లేషణ:

ఇద్దరు సామాన్యులు అంగ బలం, అర్థ బలం ఉన్నవాడిపై పగ తీర్చుకోవడానికి ఏం చేశారు అనేది ఈ చిత్రానికి మెయిన్‌ ప్లాట్‌. పాత థీమ్‌ అయినా కానీ సరిగ్గా ఎగ్జిక్యూట్‌ చేస్తే ఏ టైమ్‌లో వచ్చినా కానీ తప్పకుండా ఎక్సయిట్‌ చేసేదే. అయితే ఇలాంటి కథల్లో ప్రతి పాత్రని సరిగ్గా తీర్చి దిద్దాలి. ఒక సగటు మనిషి అన్యాయానికి గురయ్యాడంటే, అతని పెయిన్‌తో ఆడియన్స్‌ కూడా కనెక్ట్‌ అవ్వాలి. కాబట్టి క్యారెక్టర్‌ డెవలప్‌మెంట్‌ చాలా కీలకం. 

దర్శకుడు క్యారెక్టర్‌ డెవలప్‌మెంట్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టలేదు. అన్ని పాత్రల్ని అలా పైపైన పరిచయం చేసి వదిలేశాడు. ముఖ్యంగా తండ్రి పాత్రని మొదట్నుంచీ సరిగ్గా ఎస్టాబ్లిష్‌ చేయాలి. ఒకట్రెండు సన్నివేశాల్లో తండ్రి తత్వం తెలిసే డైలాగ్స్‌ అయితే వినిపించారు కానీ ఆ పాత్ర మీద కూడా మొదట్లో ఫోకస్‌ తగ్గింది. హీరో పిరికివాడని కొన్ని సందర్భాల్లో చెప్పినా అది బాగా రిజిష్టర్‌ అయ్యే సీన్స్‌ మిస్‌ అయ్యాయి. 

అసలు కథకి, హీరో హీరోయిన్ల ట్రాక్‌కి సంబంధం లేదు. దీనివల్ల ఒక్కసారి సినిమా రివెంజ్‌ మోడ్‌లోకి మారగానే హీరోయిన్‌ క్యారెక్టర్‌ స్టోరీలోంచి ఎగ్జిట్‌ అయిపోయింది. సెకండాఫ్‌లో ఆమెపై బలవంతంగా ఒక సీన్‌, సాంగ్‌ ఇరికించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే సినిమాలో వినోదాన్ని పంచిన అంశం ఏదైనా ఉందంటే అది హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌ ఒక్కటే కాబట్టి దాని గురించి కంప్లయింట్స్‌ అక్కర్లేదు. 

క్యారెక్టర్‌ డెవలప్‌మెంట్‌ విషయంలో తప్పులు జరిగినా కానీ రివెంజ్‌ తీర్చుకునే ప్రాసెస్‌ని సరిగ్గా డీల్‌ చేసినట్టయితే ఖచ్చితంగా రక్తి కట్టేది. కానీ దానికి కూడా సరైన సీన్స్‌ పడలేదు. విలన్‌పై పగ తీర్చుకోవాలని అనుకోవడం, పిరికివాడైనా కానీ విలన్‌ని చంపాలని హీరో నిర్ణయించుకోవడం వంటివి సరిగా చిత్రీకరించలేదు. దాంతో ఆ సన్నివేశాలు తేలిపోయాయి. స్కెచ్‌లు వేయడం, రెక్కీ నిర్వహించడం వంటి హంగామా చాలానే జరుగుతుంది కానీ ఏదీ ఎఫెక్టివ్‌గా లేకపోవడంతో సినిమా పలుచబడిపోయింది. బిగి సడలకుండా థ్రిల్‌ చేయాల్సిన చోట స్క్రీన్‌ప్లే లూజ్‌గా ఉండడం వల్ల ‘పల్నాడు’లో విషయం ఉన్నా కానీ అది ఎందుకు కొరగాకుండా మిగిలిపోయింది. సినిమా అమాంతం క్లయిమాక్స్‌కి వెళ్లిపోతుంది. క్లయిమాక్స్‌కి చేరుకోవడానికి ముందు ఉండాల్సిన ఉద్విగ్నత అస్సలు లేకపోవడంతో ఓవరాల్‌గా ‘పల్నాడు’ నిరాశ పరుస్తుంది.

ద్వితీయార్థంపై శ్రద్ధ పెట్టి మంచి సన్నివేశాలతో పాటు బలమైన కథనం రాసుకుని, వేగంగా నడిపించి ఉన్నట్టయితే ‘పల్నాడు’ ఆకట్టుకుని ఉండేది. పేపర్‌పై చదివినప్పుడు ఎక్సయిట్‌ అవడానికి అవకాశం ఎక్కువే కాబట్టి విశాల్‌ ఈ సినిమాని స్వయంగా నిర్మించాలనుకోవడానికి కారణం ఏమిటనేది తెలుస్తుంది. కానీ ఆ కథ తెర మీదకి వచ్చేసరికి బలహీనంగా మారిపోయింది. 

బోటమ్‌ లైన్‌:    ఆకట్టుకోని ‘పల్నాటి’ పగ, ప్రతీకారాలు!

–   గణేష్‌ రావూరి

Feedback at:

[email protected]

twitter.com/ganeshravuri