ఎమ్బీయస్‌ : చట్టానికి లాలూ చిక్కిన విధం- 3/4

ఉత్తమ్‌ ఇది చదివి ‘‘తప్పకుండా ప్రచురిస్తాను, కానీ ఒక్క విషయం. ఇది 1993లో రాసిన ఉత్తరం. అంటే అప్పటికే దీని గురించి మీకు తెలుసని రుజువౌతోంది.’’ అన్నాడు. ఆ విషయం వాళ్లెవరికీ తట్టలేదు. ‘‘ఇప్పుడు…

ఉత్తమ్‌ ఇది చదివి ‘‘తప్పకుండా ప్రచురిస్తాను, కానీ ఒక్క విషయం. ఇది 1993లో రాసిన ఉత్తరం. అంటే అప్పటికే దీని గురించి మీకు తెలుసని రుజువౌతోంది.’’ అన్నాడు. ఆ విషయం వాళ్లెవరికీ తట్టలేదు. ‘‘ఇప్పుడు మీరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి, మీరే సిబిఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తే ప్రజలు పొంగిపోతారు. ఇప్పటి కంటె భారీ మెజారిటీతో గెలిపించి ప్రధానమంత్రిని చేస్తారు.’’ అన్నాడు ఉత్తమ్‌ నవ్వుతూ. ‘‘సిబిఐకు అప్పగిస్తే ఎన్నికల తర్వాత పివి నరసింహారావు అది చూపించి నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. నాకెందుకు ఆ తలకాయనొప్పి?’’ అన్నాడు లాలూ. ఇది జరిగిన కొద్ది వారాలకే బిహార్‌ హై కోర్టు సిబిఐకు కేసు అప్పగించాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో విచారణ ముగించాలంది. 

ఉత్తమ్‌ ఒక నెల్లాళ్లు లీవుపై వెళ్లి వచ్చాక చూస్తే దాణా కుంభకోణం గురించి అన్ని పత్రికలూ రాయడం మానుకున్నాయి. ఎందుకంటే సిబిఐ అధికారులు తమ విచారణపై రిపోర్టులు సీల్టు కవర్లో చీఫ్‌ జస్టిస్‌ డి పి వాధ్వాకు యిస్తున్నారు. ఉత్తమ్‌ వాధ్వా వద్దకు వెళ్లి ‘ప్రజలకు సమాచారం చేరకుండా చేస్తే ఎలా? మీరు ప్రెస్‌కు బ్రీఫింగ్స్‌ యివ్వాలి కదా’ అని అడిగాడు. ‘ఏ చట్టం కింద అలా యిచ్చే సావకాశం వుంది?’ అని ఆయన అడిగాడు. తమ విచారణ సవ్యంగా సాగకుండా బిహార్‌ అధికారులు, ప్రజాప్రతినిథులు అడ్డుపడుతున్నారని, అడిగిన దస్తావేజులు యివ్వడం లేదని సిబిఐ కోర్టుకి విన్నవించింది. సిబిఐ కోర్టుకి తప్పుడు సమాచారం యిస్తోందంటూ బిహార్‌ ఎమ్‌ఎల్‌సిలు సిబిఐ అధికారులపై ప్రివిలేజ్‌ మోషన్‌ పెడతామని బెదిరించారు. సిబిఐ అధికారులు క్షమాపణ చెప్పి బయటపడ్డారు. విచారణకు కేటాయించిన సమయాన్ని పెంచాలని కోర్టుని కోరారు. అప్పుడు వాధ్వా డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటు చేసి సిబిఐను తన వాదనలు చెప్పుకోమన్నాడు. ఆ విధంగా సిబిఐ విచారణ ఏ దశకు చేరిందో తెలుసుకునే వీలు కలిగింది. సహజంగానే యిది లాలూకి నచ్చలేదు. 

1996 ఎన్నికల తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వం పడిపోయి లాలూ మద్దతుతో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడిరది. దేవెగౌడ ప్రధాని అయ్యాడు. ఇక కేంద్రం, సిబిఐ లాలూకు అనుకూలంగా వ్యవహరించ సాగాయి. బిహార్‌ పశుసంవర్ధక శాఖ ఉద్యోగులకు బాగా సన్నిహితుడు, సిబిఐ రాంచీ ఆఫీసులో డిఐజిగా పని చేసే ఒక వ్యక్తి జస్టిస్‌ వాధ్వాను కలిసి ‘‘సుప్రీం కోర్టుకి మిమ్మల్ని ప్రమోట్‌ చేద్దామని చూస్తున్నారు. దానికి ఇంటెలిజెన్సు బ్యూరో క్లియరెన్సు యివ్వాలి. దానిలో కాస్త యిబ్బంది వుంది. మీరు కాస్త సఖ్యంగా వుంటే దాని సంగతి నేను చూసుకుంటాను.’’ అన్నాడు. హైకోర్టు ఎపాయింట్‌మెంట్స్‌కు ఐబీ క్లియరెన్సు కావాలి తప్ప సుప్రీం కోర్టు ఎపాయింట్‌మెంట్స్‌కు అక్కరలేదు. ఆ విషయం తెలిసిన వాధ్వా నవ్వి వూరుకున్నాడు.  కొన్ని నెలల తర్వాత ఆయనకు ప్రమోషన్‌ వచ్చింది. వెళ్లబోయేముందు ఉత్తమ్‌ను పిలిచి యీ సంగతి చెప్పి ‘‘ఈ విచారణ వలన ఏదో బయటపడుతుందని ఆశ పెట్టుకోకండి. కొందరు సుప్రీం కోర్టు జడ్జిల యిళ్లల్లో లాలూ బ్లూ లేబుల్‌ స్కాచ్‌ తీసుకుంటూ వుండగా చూశాను. వ్యవస్థను ఎలా వుపయోగించుకోవాలో అతనికి బాగా తెలుసు.’’ అని హెచ్చరించాడు.

మామూలు పరిస్థితుల్లో అయితే వాధ్వా చెప్పినట్లే సిబిఐ విచారణ సాగేది కానీ సిబిఐ జాయింట్‌ డైరక్టరుగా కలకత్తాలో అప్పుడు ఉపేన్‌ బిశ్వాస్‌ వుండడంతో కథ మారిపోయింది. బిసిలకు రాజకీయ ప్రాధాన్యత తెచ్చినందుకు అతను లాలూను చాలా మెచ్చుకునేవాడు. హై కోర్టు అతన్ని పిలిచి ‘సిబిఐ విచారణ సరిగ్గా జరగటం లేదు. మీరు దాన్ని సరిగ్గా పర్యవేక్షించటం లేదు’ అని బాగా తిట్టిన కొద్ది రోజులకే ఉత్తమ్‌ అతన్ని కలిశాడు. సిబిఐ అధికారులకు, పోలీసు అధికారులకు కోర్టు తమను తిట్టడంతో మంట పుట్టింది. తమ వద్ద వున్న సమాచారాన్ని బయటపెట్టకుండా సిబిఐ ఉన్నతాధికారులు ఒత్తిడి ఒక పక్క, కోర్టు చివాట్లు మరో పక్క. దానితో వాళ్లు ఉత్తమ్‌ను కలిసి తమ వద్ద వున్న సమాచారమంతా అందచేసి ‘వీటిని మీ పత్రికలో వేయండి. బిశ్వాస్‌ పరువు కాపాడండి.’ అని అడిగారు. ఉత్తమ్‌ అవన్నీ తన పత్రికలో వేసి కోర్టు బిశ్వాస్‌ను నిందించడాన్ని విమర్శించింది. దానిపై కోర్టు తన ఆర్డరును మార్చింది. ఇది బిశ్వాస్‌కు చాలా ఆనందం కలిగించింది. పట్నా వచ్చినపుడు ఉత్తమ్‌ను ప్రత్యేకంగా పిలిపించి అభినందించాడు. 
    
కొన్ని వారాల తర్వాత ఉత్తమ్‌ రాంచీకి వెళ్లినపుడు ఒక స్నేహితుణ్ని కలిశాడు. అతను ఇండియన్‌ ఎయిర్‌లైన్సులో పని చేస్తాడు. అవీ యివీ చెపుతూ ‘‘నీలాటి రెసిడెంట్‌ ఎడిటర్లు ఎప్పుడో కానీ విమానంలో వెళ్లరు. కానీ మా వూళ్లో సాధారణ రిపోర్టరు కూడా నీకంటె ఎక్కువగా విమానాల్లో తిరుగుతారు.’’ అని జోక్‌ చేశాడు. అదేమిటి అంటే కన్నుగీటి ‘‘పశుసంవర్ధకం కదా’’ అని నవ్వాడు. సరిగ్గా చెప్పు అంటే అప్పుడు అతను చెప్పుకొచ్చాడు – ‘‘ఆ డిపార్టుమెంటులో పనిచేసే అతనే తన భార్య పేర ఓ ట్రావెల్‌ ఏజన్సీ నడుపుతాడు. తన శాఖలో పని చేసే స్టాఫ్‌ టిక్కెట్లే కాదు, స్థానిక పత్రికా విలేకరులకు, యితర ప్రభుత్వాధికారులకు, రాంచీలో చదువుతున్న ముఖ్యమంత్రి పిల్లలకు – అందరికీ ఆ ఏజన్సీయే టిక్కెట్లు కొంటుంది. అంతా నగదు వ్యవహారమే!’’ 

స్నేహితుడితో కబుర్లు అయిపోయి ఆఫీసు చేరగానే ఉత్తమ్‌ రాంచీ నుండే పట్నా ఆఫీసులో కొలీగ్‌కి ఫోన్‌ చేసి ‘పట్నాలో క్యాంప్‌ చేస్తున్న బిశ్వాస్‌కు యీ ట్రావెల్‌ ఏజన్సీ సంగతి తెలియపరచు.’ అని చెప్పాడు. రాత్రి 9 గంటలకు బిశ్వాస్‌నుండి ఉత్తమ్‌కు ఫోన్‌ వచ్చింది. ‘‘విషయం సరిగ్గా అర్థం కాలేదు. వివరంగా చెప్పు.’’ అని. ఉత్తమ్‌ అంతా చెప్పాక ‘‘థాంక్యూ’’ అని ఫోన్‌ పెట్టేశాడు బిశ్వాస్‌. మర్నాటికల్లా రాంచీలోని ట్రావెల్‌ ఏజన్సీపై ఇన్‌కమ్‌ టాక్స్‌ దాడి జరిగింది. అతని నుండి అనేక విషయాలు బయటపడ్డాయి. సిబిఐ విచారణ జోరందుకుంది.

ఇంతలో దేవెగౌడ దిగిపోయి ఐకె గుజ్రాల్‌ ప్రధాని అయ్యాడు. అతనూ లాలూ మద్దతుపై ఆధారపడినవాడే. అతని ఆధ్వర్యంలోని సిబిఐ లాలూను అరెస్టు చేయకుండా అతనిపై విచారణ జరపడానికి గవర్నరు అనుమతి కోరింది. అనుమతి అవసరం లేదు కదా,  ఎందుకడిగారు అని సిబిఐను హై కోర్టు నిలదీసింది. ‘ముందుజాగ్రత్తగా…’ అని సిబిఐ నసిగింది. ‘ఈ పేరు చెప్పి ఆలస్యం చేస్తే మేమే అరెస్టుకి ఆదేశించాల్సి వస్తుంది’ అని హై కోర్టు హెచ్చరించింది. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2013)

[email protected]                                                          

                                                     Click Here For Part-1

                                                      Click here For Part-2