భారతీయులతో పాటు బ్రిటీషర్లకు, ఆస్ట్రేలియన్లకు బాగా ఇష్టమైన స్పోర్ట్ అయినప్పటికీ.. దీనికి పాశ్చాత్యమూలాలు గట్టిగా ఉన్నా… క్రికెట్ విశ్వవ్యాప్తం కాలేదింకా. వందల సంవత్సరాలు గడుస్తున్నా.. ఫుట్ బాల్ స్థాయిలో క్రికెట్ కు విశ్వప్రేక్షాకదరణ లభించలేదు. వాస్తవానికి ఇండియా వంటి భారీ జనాభా ఉన్న దేశంలో గనుక క్రికెట్ ఆదరణ పొందకపోయినట్టుగా అయితే దానికి ఇంత మార్కెట్ కూడా ఉండేది కాదు! క్రికెట్ మార్కెట్ మరింత విస్తరించాలంటే.. మరిన్ని దేశాలకు ఈ ఆటను తీసుకెళ్లడమే ఐసీసీకి ఉన్న మార్గం. ఇలాంటి నేపథ్యంలో క్రికెట్ ను మరింతగా అంతర్జాతీయం చేయడానికి ఐసీసీ చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.
ఎప్పుడో దశాబ్దాల క్రితమే కెనడాలో క్రికెట్ మ్యాచ్ లను నిర్వహించేవారు. ఇండియా, పాకిస్తాన్ వంటి జట్లు కూడా కెనడాలోని టొరంటోలో మ్యాచ్ లు ఆడేవి. అయితే ఆ తర్వాత టొరంటోలో మ్యాచ్ ల నిర్వహణ పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి కెనడా జట్టుకు, ఆ పై అమెరికా జట్టుకు కూడా ఐసీసీ ట్రోఫీలు ఆడే అవకావాన్ని ఇచ్చారు. కెనడా ఒక సారి ప్రపంచకప్ లో కూడా పాల్గొన్నట్టుగా ఉంది. అమెరికా జట్టును చాంఫియన్స్ ట్రోఫి వరకూ తీసుకొచ్చారు! అయితే ఐసీసీ ఆశించిన ప్రయోజనాలు దక్కలేదు. రెండు దశాబ్దాల క్రితమే ఐసీసీ అమెరికా జట్టును తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ యూఎస్ కు క్రికెట్ ఫీవర్ అంటించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొన్నాళ్ల కిందట ఇండియా- వెస్టిండీస్ టీ20 మ్యాచ్ లను అమెరికాలో కూడా నిర్వహించారు. అది ఓ మోస్తరుగా విజయవంతం అయ్యింది. త్వరలో వెస్టిండీస్ వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లను కూడా కొన్నింటిని అమెరికాలో నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది ఐసీసీ. అమెరికాలో క్రికెట్ కు అంటూ ప్రత్యేకంగా గ్రౌండ్స్ ఉండవు. దీంతో రగ్బీ, బేస్ బాల్ గ్రౌండ్ లలో పిచ్ లను ఏర్పాటు చేసి మ్యాచ్ లను నిర్వహిస్తూ వస్తున్నారు. స్క్వైర్ షేప్ లో ఉండే గ్రౌండ్ లలో క్రికెట్ మ్యాచ్ లు చూడటం ప్రేక్షకులకు కూడా వింతే.
ఇక మరోవైపు మేజర్ క్రికెట్ లీగ్ అంటూ మాజీ ఆటగాళ్లు, బోర్డులకు దూరమైన ఆటగాళ్లతో ఒక లీగ్ జరుగుతూ ఉంది. రెండు దశాబ్దాల కిందటే అమెరికా-కెనడా వంటి దేశాలకు క్రికెట్ ను తీసుకెళ్లినా.. సక్సెస్ కాలేదు. ఇప్పుడు టీ20 ఫార్మాట్ లో అయినా ఈ విషయంలో ఐసీసీ విజయవంతం అవుతుందేమో చూడాలి.
ప్రధానంగా టీమ్ స్పోర్ట్స్ లో ఎన్బీఏ, బేస్ బాల్, ఫుల్ బాల్, రగ్బీలకు ఆదరణ ఉండే అమెరికాలో క్రికెట్ వాటి సరసన ఎలాంటి స్థానం పొందలేకపోతోంది. మరి ఐసీసీ ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా విజయవంతం అవుతాయేమో చూడాలి.