ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేత. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు అయిన కిమిడి కళా వెంకటరావు ఎంతో ఆశలు పెట్టుకున్న ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు బీజేపీకి వెళ్ళిపోయింది. ఇంతకాలం ప్రచారంలో ఉంటూ వచ్చిన ఈ విషయం బీజేపీ అభ్యర్థుల ప్రకటనతో నిజం అయింది. ఈ సీటు కోసం కళా ఎంత పట్టుబట్టినా చివరికి దక్కలేదు.
దీంతో కళా వర్గీయులు తీవ్రంగా మధనం చెందుతున్నారు. ఈ సీటు నుంచి మరోసారి పోటీ చేసి గెలిచి మంత్రి కావాలని కళా ఆలోచనలకు ఆదిలోనే గండి పడిపోయింది. 1983 నుంచి టీడీపీ తరఫున గెలుస్తూ అనేకసార్లు మంత్రి కూడా అయిన కళాకు ఇపుడు జీవిత చరమాంకంలో రాజకీయం ఎదురు నిలిచింది అని అంటున్నారు.
ఆయన రాజకీయం కూడా కుమారుడి భవిష్యత్తు కోసమని అందువల్ల ఈసారి పోటీ అనివార్యం అని అంటున్నారు. చంద్రబాబుకు లోకేష్ కి సన్నిహితుడుగా ఉన్నా కూడా టికెట్ దక్కక పోవడం పట్ల కళా క్యాంప్ లో నైరాశ్యం కనిపిస్తుంది.
ఇదే ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్ ని టీడీపీలో ఆశించిన మరో సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడుకు కూడా షాక్ తగిలినట్టు అయింది. గత ఏడాది మహానాడులో ఆయన పనితీరు మెచ్చి సత్కరించిన అధినాయకత్వం తప్పకుండా సీటు ఇస్తుందని ఆయన అనుచరులు ఆశించారు. కానీ ఇపుడు బీజేపీకి ఈ సీటు వెళ్ళిపోయింది.
శ్రీకాకుళం జిల్లాలో బీజేపీకి పెద్దగా బలం లేదు. అయినా ఈ సీటు ఆ పార్టీకి ఇచ్చేయడమేంటి అని టీడీపీ తమ్ముళ్ళు రగిలిపోతున్నారు 2019 ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి బీజేపీ పోటీ చేస్తే 1,022 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎనభై వేల దాకా ఓట్లు తెచ్చుకున్న టీడీపీని కాదని బీజేపీకి ఈ సీటు ఎలా కట్టబెడతారు అని టీడీపీ నేతలు అంటున్నారు.
విశాఖ సిటీలో కొన్ని ప్యాకెట్స్ లో తప్ప బీజేపీకి బలం ఎక్కడ ఉందని అంటున్నారు. ఈ సీటు బీజేపీకి ఇవ్వడం అంటే వైసీపీని గెలిపించడమే అని కూడా అంటున్న వారూ ఉన్నారు. ఎచ్చెర్ల వైసీపీలో మాత్రం ఈ పరిణామాలు ఆనందం కలిగిస్తున్నాయని అంటున్నారు.