ఎక్కడ నుంచో వచ్చి పోటీ చేస్తామంటే పక్కా లోకల్ కే ఓటేస్తూ గెలిపిస్తూ వస్తున్న అనకాపల్లి ప్రజలు జై కొడతారా అన్న చర్చకు తెర లేస్తోంది. సీఎం రమేష్ అన్న నేత ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడా ఇంతవరకు పోటీ చేయలేదు. ఆయన టీడీపీ నుంచి పెద్దల సభకు రెండు సార్లు నామినేట్ అయిన నేత మాత్రమే.
ఆయన తొలిసారి పోటీ చేస్తున్నపుడు బలమైన పార్టీతో రావాలి. స్థానికంగా బలంగా ఉన్న నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. కానీ ఈ రెండు లెక్కలూ పక్కకు పెట్టి అర్ధబలం అంగబలం అన్న మరో రెండు లెక్కలతో సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా పోటీకి దిగిపోతున్నారు.
అనకాపల్లిలో టీడీపీ కూటమి నేతలు అంతా ఆయనకు రెడ్ కార్పెట్ పరిచారు. ఆయనకు స్వాగత సత్కారాలు భారీగానే జరిపారు. సీఎం రమేష్ బిగ్ షాట్ కాబట్టి ఆయన అండతో ఎన్నికలలో లబ్ది పొందాలన్నది లోకల్ లీడర్లు చాలా మంది ఆశగా ఉంది అంటున్నారు.
ఎంపీ అభ్యర్ధి ఎమ్మెల్యేల అభ్యర్ధులకు ఆర్ధిక సాయం చేయడం అన్నది కూడా పార్టీలు సంప్రదాయంగా చాలాకాలంగా పెడుతున్న షరతు. దాంతో సీఎం రమేష్ కోసం వేయి కళ్లతో ఎదురు చూసే నాయకులు అయితే దండీగా ఉన్నారు.
కానీ ఆయన పోటీ చేస్తున్నది సమస్త పట్టింపులు ఉన్న అనకాపల్లి నియోజకవర్గంలో. అంతే కాదు పూర్తి గ్రామీణ నేపథ్యం కల సీటులో. బీసీ ఎంపీ సీటులో ఓసీ నేత పోటీ చేయడం కూడా మరో సవాల్ అని అంటున్నారు. బీసీ అభ్యర్ధితో పక్కా లోకల్ తో వైసీపీ ఢీ కొంటోంది. అయితే అపుడే బూడి ముత్యాలనాయుడు మీద టీడీపీ నేతలు నోరు చేసుకుంటున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేయడంతో ఆయనను టార్గెట్ చేస్తున్నారు.
ఎవరెన్ని చేసినా ఎంతగా ఖర్చులు పెట్టినా కూడా జనాలు మాత్రం అనకాపల్లిలో రాజకీయ చైతన్యం కలిగిన వారు అని అంటున్నారు. వారు సలక్షణంగా విలక్షణమైన తీర్పునే ఇస్తారు అని అంటున్నారు.