తెలుగుదేశం పార్టీ మొత్తం సీట్లను ప్రకటించింది. జనసేన మూడు సీట్లు పెండింగులో పెట్టింది. అందులో రెండు ఉత్తరాంధ్రాలో ఉన్నాయి. విశాఖ సౌత్ నుంచి జనసేన అధికారికంగా అభ్యర్ధిని ప్రకటించలేదు. అయితే జనసేన అభ్యర్ధిగా వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ప్రచారం చేసుకుంటున్నారు.
ఆయన పేరుని ప్రకటిస్తారా లేక మరో కొత్త పేరు తెర మీదకు వస్తుందా అన్న సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. జనసేన పొత్తులో తీసుకున్న మరో సీటు పాలకొండ. ఇది ఎస్టీ రిజర్వుడ్ సీటు. ఈ సీటులో జనసేనకు సరైన అభ్యర్థులు లేరు అని ప్రచారం సాగుతోంది.
ఇక్కడ నుంచి రెండు సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలు అయిన నిమ్మక జయకృష్ణ జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు టీడీపీ టికెట్ కేటాయించలేకపోయింది. పొత్తు వల్ల ఆయనకు చాన్స్ ఇవ్వట్లేదని చెప్పేశారు.
దాంతో ఆయన జనసేన వైపుగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ఏది అయితే నేమి కూటమిలోనే ఉంటాం కదా అని ఆయన అనుచరులు అంటున్నారు. జనసేనకు కూడా నిమ్మక జయకృష్ణ వస్తే పార్టీ కండువా కప్పి పోటీ చేయించాలని ఉంది అని అంటున్నారు.
పాలకొండలో రాజకీయ కుటుంబంగా ఉన్న జయక్రిష్ణ ఇప్పటిదాకా పోటీ చేస్తూనే ఉన్నారు తప్ప ఎమ్మెల్యే కాలేకపోయారు. ఇక్కడ వైసీపీకి గట్టి పట్టు ఉంది. ఆ పార్టీ తరఫున విశ్వాసరాయి కళావతి 2014, 2019లలో రెండు సార్లు గెలిచారు. 2024లో ఆమెకే టికెట్ ఇచ్చారు.
దాంతో ఆమె గెలుపు సాధిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారు. పొత్తులో జనసేనకు టికెట్ ఇవ్వడం పట్ల టీడీపీలో అసంతృప్తి ఉన్నా జనసేన నుంచి పోటీ చేయవచ్చు అన్న ప్లాన్ బీ ఫార్ములా ఉండడంతో నిమ్మక వర్గం నిదానంగా ఉంది అంటున్నారు. ఈ సీటులో 2019లో జనసేన పోటీ ఒంటరిగా పోటీ చేయలేదు పొత్తులో భాగంగా సీపీఐకి సీటు ఇచ్చింది. ఆ పార్టీకి మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.