పిఠాపురంలో ఎవరు గెలుస్తారు? పవన్ నా? వంగా గీతనా? ఈ ప్రశ్నకు పిఠాపురం రాజకీయ వర్గాల్లో వినిపించే సమాధానం ఒక్కటే. అది వర్మ మీద ఆధారపడి వుంటుంది. వర్మ ఏం చేస్తారు.. చివరి నిమిషం వరకు ఇదే నిబద్దత తో వుంటారా? అన్నదే డిసైడింగ్ ఫ్యాక్టర్.
ఇది తెలుస్తూనే వుంది. ఎందుకంటే నిన్నటికి నిన్న స్టేజ్ మీద తేదేపా నాయకుడు వర్మ సుముఖంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిందే. ‘నన్ను గెలిపించండి.. నా గెలుపు మీ చేతిలో పెట్టా.. మీరు గొప్పోళ్లు.. మీ కెపాసిటీ గొప్పది… మీరు తలుచుకుంటే ఇండిపెండెంట్ గా గెలిచేయగలరు.. మీరు సూపర్.. మీ అబ్బాయి సూపర్’ అనే అర్థాలు వచ్చేలా పవన్ సాగించిన భజన మామూలుది కాదు.
సాధారణంగా టాలీవుడ్ లో ఇండస్ట్రీ జనాలు హీరోలకు భజన చేస్తారు. కానీ హీరోలు రాజకీయాల్లోకి దిగితే రాజకీయ నాయకులకు భజన చేయాల్సి వుంటుంది. పవన్ ఇప్పుడు అదే చేస్తున్నారు. వర్మ భజనలో తరిస్తున్నారు. ఇదంతా గెలిచే వరకే. ఆ సంగతి ఏ రాజకీయ నాయకుడిని అడిగినా చెబుతారు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, దాటేసిన తరువాత బోడి మల్లన్న అన్నదే కదా సినిమా హీరోలకు, రాజకీయనాయకులకు అలవాటైన, నచ్చే నానుడి. రాజకీయాల్లో పండిపోయిన వర్మకు ఈ సంగతి తెలియదా? నిజంగా చంద్రబాబు ఎమ్మెల్సీ, మంత్రి పదవి అన్నారని పవన్ ను గెలిపించాలనుకుంటున్నారా?
ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతూ వుండొచ్చు వర్మ. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందే అనుకోండి కాస్సేపు. పవన్ ఎమ్మెల్యేగా వున్న నియోజకవర్గంలోనే వర్మ మంత్రిగా వుండడం సాధ్యమవుతుందా? లేదా పవన్, వర్మ ఇద్దరూ మంత్రులుగా వుంటే ఎవరి పెత్తనం ఎక్కువ సాగుతుందో వర్మకు తెలియనిదా? వన్స్ పవన్ ఎమ్మెల్యేగా పిఠాపురంలో ఫిక్స్ అయిన తరువాత వర్మ, ఆయన కొడుకు ఎప్పటికీ ఎమ్మెల్సీలగా వుండాల్సిందేనా? ఇలాంటి ఆలోచనలు వర్మకు వుండవు అని అనుకోవడానికి లేదు.
కానీ పవన్ మాత్రం వర్మ చేతిలోనే పెట్టారు తన ఎన్నికల భవిష్యత్ ను. నామినేషన్ల పర్వం ఇంకా చాలా దూరం వుంది కనుక, ఇప్పటి నుంచీ ఈ ఎండల్లో తిరగడం అన్నది హీరోగా పవన్ కు కష్టం కనుక, ప్రస్తుతానికి ప్రచారానికి పాజ్ బటన్ నొక్కారు. ఈ టైమ్ లో పిఠాపురంలో ప్రచారం ఎలా సాగుతుందో గమనిస్తే మిగిలిన విషయాలు అవే తెలుస్తాయి.