బీజేపీ అభ్యర్ధిగా అనకాపల్లి నుంచి పోటీకి దిగిన కడప జిల్లా నేత సీఎం రమేష్ ఇంకా ప్రజలతో మమేకం కావడం కంటే కూటమి పార్టీ నేతలతో భేటీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అనకాపల్లిలో ఏ మాత్రం బలం లేని బీజేపీ తరఫున పోటీకి దిగారు. ఆయన గతంలో సుదీర్ఘ కాలం పనిచేసిన టీడీపీ దన్ను ఉంది. జనసేన అండ ఉంది.
అయితే పొత్తులలో సీట్లు రాలేదని అలిగిన నేతలు, పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను సముదాయించడం ఇపుడు సీఎం రమేష్ ముందున్న అతి పెద్ద పనిగా మారుతోంది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు టీడీపీలో చేరినా ఆయన కుమారుడికి సీటు దక్కలేదు. దాంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
ఆయనను కలసి మంచి చేసుకున్నారు సీఎం రమేష్. తన రాజకీయ గురువు అని కితాబు ఇచ్చారు. ఇపుడు మరో మాజీ మంత్రి పెందుర్తికి చెందిన బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి సీఎం రమేష్ వెళ్ళారు. ఆయన సొంత గ్రామం వెన్నెలపాలెం వెళ్ళి బండారుతో మంతనాలు జరిపారు.
టీడీపీ రాజకీయాలకు ఒక దండం అంటూ అస్త్రసన్యాసం చేసిన బండారుని తిరిగి కార్యోన్ముఖుడిని చేయడానికి సీఎం రమేష్ తన చాతుర్యాన్ని ఉపయోగిస్తున్నారు అని అంటున్నారు. బండారు కాడె వదిలేస్తే అది పెందుర్తి టీడీపీతో పాటు అనకాపల్లి ఎంపీ సీటుకు కూడా దెబ్బ పడేలా చేస్తుంది. బండారు రమేష్ కి ఏ హామీ ఇచ్చారో తెలియదు కానీ ఆయన ప్రయత్నం మాత్రం చేశారు.
తనకు సీటు ఇవ్వకుండా జనసేనకు పొత్తులో ఇచ్చారు అని బండారు మధనపడుతూ రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ప్రకటించారు. బండారు వంటి సీనియర్ నేత బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత సాయం ఇపుడు అవసరం అయిందా అని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుడుకి సరైన హామీ దక్కితే తప్ప పనిచేయరని వారు అంటున్నారు.
బండారు అయితే ఎవరు వచ్చినా అలకపానుపు వీడేది లేదు అంటున్నారు. సీఎం రమేష్ మాజీ మంత్రులను కలసి వచ్చినా రాజకీయాల్లో ఎవరికి ఏమిటి అన్నది చూసుకుంటారని అంటున్నారు. అధినాయకత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే తప్ప ఎవరూ కదిలేది లేదని అంటున్నారు. సీఎం రమేష్ కి ఎంపీ సీటు కాదు కానీ ఆయన ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అంటూ నేతలను కలిసేందుకు సరిపోతుంది అని అంటున్నారు.