ఆమె సినిమా జీవితం ఎప్పుడో ముగిసింది. రాజకీయ అధ్యాయం కూడా ముగిసింది. కానీ తాను ఇంకా ఓటర్లను ప్రభావితం చేయగలనని అనుకుంటోంది. తాను చెబితే జనం ఓట్లు వేస్తారనుకుంటోంది. అందుకే ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరపున ప్రచారం చేయాలని ఉత్సాహం చూపిస్తోంది.
ఆమె ఒకప్పటి టాలీవుడ్ అండ్ బాలీవుడ్ టాప్ హీరోయిన్ జయప్రద. అప్పట్లో ఆమె గ్లామరస్ హీరోయిన్. సినిమా రంగాన్ని వదిలేసి కూడా దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ గ్లామర్ లేదు. ఆమె ప్రచారానికి ఆకర్షితులయ్యే జనం లేరు. ఇప్పటి యువతకు ఆమె ఎవరో కూడా తెలియదు. ఇప్పటి జనరేషన్ ఆమెకు కనెక్ట్ అయ్యే అవకాశం లేదు.
సినిమాల సంగతి అలా ఉంచితే జయప్రద తెలుగువాళ్ళకు దూరమయ్యే దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ వాస్తవాన్ని గుర్తించని వెటరన్ హీరోయిన్ తనకు ఏపీ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తే అందుకు సిద్ధంగా ఉన్నానని కొంతకాలం కిందట చెప్పింది.
కానీ బీజేపీ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో పార్టీ తనను స్టార్ క్యాంపెయినర్ గా నియమిస్తే ఏపీలో ప్రచారం చేస్తానని అంటోంది. తనకు పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ అంటే ఇష్టమని చెప్పింది. చంద్రబాబు తనకు ఆత్మీయుడని అన్నది. కూటమిలోని పార్టీలు తనను ఆహ్వానిస్తే తప్పకుండా ప్రచారం చేస్తానంటోంది. ప్రస్తుతం ఆమె యూపీలో బీజేపీ తరపున ప్రచారం చేస్తోంది.
అక్కడివాళ్లకు జయప్రద బాగా పరిచయం. యూపీలోని రాంపూర్ నుంచే ఆమె రెండుసార్లు ఎంపీగా సమాజ్‌వాదీ పార్టీ నుంచి గెలిచింది. అందులోనూ బాలీవుడ్ హీరోయిన్ గా పాపులర్. టీడీపీతోనే రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ నుంచి ఎంపీగా పనిచేసింది. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పని చేసింది.
కాలక్రమంలో టీడీపీతో విభేదించి యూపీకి వెళ్ళిపోయి సమాజ్ వాదీ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసింది. రెండుసార్లు గెలిచాక ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చి బీజేపీలో చేరింది. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలని, మోడీ మళ్ళీ ప్రధాని కావాలని అంటోంది.
కానీ ఇదే జయప్రద ఒకసారి అంటే 2014 లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగింది. తాను ఏపీలో పోటీ చేయకపోవడానికి చంద్రబాబే కారణమని చెప్పింది. కానీ రాజకీయ నాయకులకు పాత విషయాలు గుర్తుండవు కదా.