పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌పై ప్రముఖ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేయనున్నారు. గతంలో మంగళగిరి నుంచి లోకేశ్‌పై తమన్నా సింహాద్రి పోటీ చేసి, వార్తల్లో నిలిచారు. ఈ ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) నుంచి ఆమె పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ ప్రకటించడం విశేషం. ఎన్నికల ప్రచార ఇన్చార్జ్గా పవన్‌కల్యాణ్ బాధితురాలు ఆకుల జయకల్యాణ్ వ్యవహరించనున్నారు.
ఇదిలా వుండగా ఏపీలో మరే ఇతర పార్టీ చేయని సాహసాన్ని, సమన్యాయాన్ని తమ పార్టీ అమలు చేసినట్టు రామచంద్రయాదవ్ పేర్కొన్నారు. సమాజ సేవలో పేరు పొంది, ప్రజాసేవ చేయాలనే ఇష్టం ఉన్న ట్రాన్స్‌జెండర్స్‌కు చట్టసభల్లో అవకాశం కల్పించాలనే ఆలోచనతో తమన్నా సింహాద్రికి పిఠాపురం సీటు ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. తమన్నా స్వస్థలం విజయవాడ.
బిగ్‌బాస్ రియాల్టీ షోలో తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ హౌజ్‌లో తమన్నా రచ్చ ఓ రేంజ్లో వుండింది. తమన్నాకు రాజకీయ ఆసక్తి ఎక్కువే. గతంలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలనే ఆశయంతో మంగళగిరి నుంచి లోకేశ్‌పై పోటీ చేసినట్టు వెల్లడించారు. రాజకీయాలు వ్యాపారమయం అయ్యాయని, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన నాయకుల్లో కొరవడిందనేది తమన్నా భావన. ప్రజలకు తమలాంటి సేవ చేసే వాళ్లు ఉండాలనే ఉద్దేశంతో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు.
అయితే జనసేనలో ఆమె పని చేశారు. కానీ పవన్‌కల్యాణ్‌ను కనీసం కలిసే అవకాశం రాలేదనే బాధ ఆమెలో బలంగా వుంది. గతంలో జనసేన నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి జనసేనపై తమన్నా కాస్త కోపంగా ఉన్నారు. ఈ దఫా పిఠాపురం నుంచి తమన్నా సింహాద్రి బరిలో దిగడం ద్వారా రచ్చ మామూలుగా ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.