ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎన్డీయే కూటమి పోటీచేస్తున్నట్టుగానే కదా ప్రస్తుతం వ్యవహారం నడుస్తోంది. జగన్ ను ఓడించడం ఒక్కటే లక్ష్యంగా.. జెండాలు వేరైనప్పటికీ కూడా మూడు పార్టీలు కలసికట్టుగా పోటీచేస్తున్నాం అని.. చంద్రబాబునాయుడు పాపం.. తమ సమైక్యత గురించి పదేపదే సభల్లో ఊదరగొడుతున్నారు. అయితే నిజంగానే ఈ మూడు పార్టీలు కలిసే పోటీచేస్తున్నాయా? లేదా, తాము కలసి ఉన్నట్టుగా ప్రజలను భ్రమ పెడుతున్నాయా? అనే అనుమానం కలుగుతోంది.
ఎందుకంటే.. పవన్ కల్యాణ్ తో కలిసి రెండు రోజుల పాటు చంద్రబాబునాయుడు సభలు నిర్వహిస్తే.. బిజెపి సారథి పురందేశ్వరి ఒక్కరోజే వారితో కలిసి పాల్గొన్నారు. బహుశా అది కూడా ఆమె స్వయంగా ఎంపీగా పోటీచేస్తున్న నియోజకవర్గం గనుక. భారతీయ జనతా పార్టీ అంటేనే జాతీయ నాయకులని అర్థం. మరి ఏపీలోని ఎన్డీయే ప్రచారపర్వంలో ఇప్పటి దాకా బిజెపి జాతీయ నేతలు కనిపించడం లేదు ఎందుకని? ఇది ఇలాగే కంటిన్యూ అయితే చంద్రబాబుకు డేమేజీనే కదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
మూడు పార్టీలు కలసి పోటీ చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత.. ఒక్క సభ మాత్రం చాలా భారీస్థాయిలో నిర్వహించారు. ఆ సభకు ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. కానీ ఆయన ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిశిత విమర్శలు చేయకుండానే.. బిజెపికి నాలగు వందల సీట్లు ఇవ్వండి అనే ఒక్క మాట మాత్రమే తెలుగు ప్రజలకు చెబుతూ తన ప్రసంగం ముగించారు. ఆరోజు మోడీ ప్రసంగం చూసిన వారు- చంద్రబాబునాయుడు బిజెపి పెద్దలను బతిమాలి, ఒత్తిడి చేసి, ప్రలోభపెట్టి వారిని పొత్తులకు ఒప్పించినట్లుగా ఉన్నదని అభిప్రాయపడ్డారు కూడా.
ఆ తర్వాత.. బిజెపి జాతీయ నాయకులు ఏపీ ఊసు ఎత్తడం లేదు. చంద్రబాబు మాత్రం.. ప్రచారానికి జాతీయ నాయకులు చాలా మంది వస్తారు.. అంటున్నారు. ఒకవైపు ప్రచారం ఇప్పటికే చాలా చోట్ల పూర్తిచేసేస్తున్నారు. జాతీయ నాయకులు కూటమి ప్రచార సభల్లో చురుగ్గా పాల్గొనకుంటే.. దాని వలన కమలం పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి. మనం మనస్ఫూర్తిగా తెలుగుదేశానికి సహకరించాల్సిన అవసరం లేదు- అనే సంకేతం వెళుతుంది.
చంద్రబాబు వారి కోసం ఆరాటపడి పొత్తులు పెట్టుకున్నారే తప్ప.. వారేమీ ఈ పొత్తులపై అంత ప్రేమగా లేరనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. అప్పుడిక సైకిలుకు అనుకూలంగా కమలం ఓటు బదిలీకావడం కూడా కష్టమే అవుతుంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. చంద్రబాబునాయుడు మోడీ సహా, తనకు సత్సంబంధాలు ఉండే జాతీయ నాయకులను ఎంతమందిని ప్రచారానికి తీసుకువస్తే అంత మంచిది అని పలువురు విశ్లేషిస్తున్నారు.