తనది నలభై యేళ్ల అనుభవం అని నలభై వేల సార్లు చెప్పుకుని ఉంటారు చంద్రబాబు నాయుడు! తను 14 యేళ్ల సీఎంనని, మరో 14 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా చేశానని కూడా రోజూ గుర్తు చేస్తూ ఉంటారు! నిజమే ఒకవేళ గుర్తు చేయకపోతే.. చంద్రబాబు నాయుడు రాజకీయ తీరును చూసి ఆయన అనుభవజ్ఞుడు అంటూ నమ్మే వాళ్లు ఉండరు!
ఎన్నికల వేళ రాజకీయ చర్చలకు బార్బర్ షాపులు పెద్ద వేదికలు! క్షవరం చేయించుకోవడానికి అలవాటైన షాపుల్లోకి వెళ్లే వారే ఎక్కువ! క్షవర శాలకు ప్రతి రోజూ పదుల మంది వెళ్తూ ఉంటారు. ఓ మోస్తరు పట్టణాలు, మండల హెడ్ క్వార్టర్లలో క్షురకులను అడిగితే.. పబ్లిక్ ట్రెండ్ ఏమిటో చెప్పేస్తారు! అలాంటి రాజకీయ ప్రావీణ్యం ఉన్న క్షురకులు కూడా చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపిక తీరు పట్ల నిశ్చేష్టులవుతూ స్పందిస్తున్నారు!
అభ్యర్థుల ప్రకటన వరకూ పోరు ఉత్కంఠ భరితంగా ఉంటుందనుకున్న నియోజకవర్గాల్లో… అభ్యర్థుల ప్రకటన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది! పొత్తు వల్ల చాలా నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు లేకుండా పోవడం.. అక్కడ పెద్ద మైనస్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది! పొత్తు మాటలెన్ని అయినా చెప్పొచ్చు.. సైకిల్ గుర్తు కాకుండా, కమలం గుర్తో, గ్లాస్ గుర్తో ఉండటం.. అక్కడ పోరాట వేడినే తగ్గించేస్తోంది!
ఇలాంటి నియోజకవర్గాలు ఒకటీ రెండు కాదు.. ఏకంగా ముప్పై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆ పై ఎనిమిది ఎంపీ సీట్లున్నాయి. ఈ ప్రభావం గట్టిగా పడబోతోంది! ఇక ఇన్నాళ్లూ ఇన్ చార్జిలుగా పని చేసి, స్థానిక టీడీపీకి పెద్ద దిక్కులుగా వ్యవహరించి, డబ్బులు ఖర్చు పెట్టుకుని, పార్టీ కష్టకాలంలో పని చేసిన చాలా మందికి ఈ సారి టికెట్లు దక్కనే లేదు! ఇది ముందు నుంచి అయినా క్లూగా ఇచ్చి, మార్పు ఉంటుందని కార్యకర్తలను ప్రిపేర్ చేసి ఉంటే అదో లెక్క! అయితే అభ్యర్థుల ప్రకటన గురించి పత్రికల్లో వార్తలు రావడం వల్ల మాత్రమే క్లారిటీ వచ్చింది.
అనంతపురం నుంచి పిఠాపురం వరకూ ఇలాంటి అనూహ్యమైన మార్పు జరిగిన నియోజకవర్గాలు మరో ఇరవై వరకూ ఉన్నాయి! ఈ మార్పులను స్థానిక క్యాడర్ కూడా ఊహించలేదు! అనూహ్యంగా కొత్త వారు తెరపైకి రావడాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. అలాంటిది ఈ కొత్త వాళ్లు నియోజకవర్గానికి ఎప్పటికి చేరువ కావాలి? సరే.. అలాంటి ప్రకటనలకు అయినా కట్టుబడుతున్నారా అంటే, ఇప్పుడు మళ్లీ మార్పులు చేస్తున్నారు! పది రోజుల కిందట అభ్యర్థులుగా ప్రకటించిన వారిని మార్చి ఇప్పుడు మళ్లీ కొత్త వాళ్లను తెరపైకి తెస్తున్నారు!
పదిరోజుల కిందట జరిగిన అభ్యర్థుల ప్రకటన ఇప్పుడు జస్ట్ ఓ తమాషాగా మారింది! నామినేషన్లకు మరికాస్త సమయం దొరికిందని చిత్తానికి మార్పులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇది టీడీపీ గ్రాఫ్ ను మరింత తగ్గించి వేస్తోంది. ఎవరు అభ్యర్థులు, ఎవరు నామినేషన్లు వేస్తారో, ఎవరు రెబల్సో, ఏది మిత్రధర్మమో అంతుబట్టని పరిస్థితుల్లోకి క్యాడర్ ను నెట్టేశారు చంద్రబాబు! ఇదీ ఆయన నాలుగు దశాబ్దాల అనుభవంతో చేస్తున్న రాజకీయం! క్యాడర్ లోనే ఇంత గందరగోళం నెలకొన్ని నేపథ్యంలో.. జనాల్లో టీడీపీ పనైపోయిందనే భావన బలపడుతుండటంలో ఆశ్చర్యం లేదు!