కల్కి.. కర్త.. కర్మ.. క్రియ.. తానే

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక గీతం ను విడుదల చేసారు. పంజాబీ పాప్ స్టయిల్ లో వుంది కానీ పాటలో మంచి అర్థం…

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక గీతం ను విడుదల చేసారు. పంజాబీ పాప్ స్టయిల్ లో వుంది కానీ పాటలో మంచి అర్థం వుంది. హీరో పాత్ర తీరు తెన్నులు వివరించే పరమార్థం వుంది. కవి రామజోగయ్య శాస్త్రి హీరో క్యారెక్టర్ ను, ఆలోచనా భావాన్ని ఈ గీతంలో ఎలివేట్ చేసే ప్రయత్నం చేసారు.

ఒక్క నేనే నాకు చుట్టూ నేనే

ఒక్కడైనా ఒంటరోణ్ణి కానే

ధీరుడినే యోధుడినే

అనడంలోనే హీరో నేపథ్యం వివరించే ప్రయత్నం కనిపించింది. హీరో ధీరుడు.. వీరుడు.. ఒంటరి అని క్లారిటీ ఇచ్చారు.

భూమి నేనే సూర్యుడైన నేనే

నన్ను నేనే చుట్టి తిరుగుతానే

స్వార్ధము నేనే పరమార్ధము నేనే

అంటూ చెప్పడంలో పరమాత్మ స్వరూపం అనే ఫిలాసఫీ తొంగి చూసింది. అక్కడితో ఆగకుండా మనుషులు, మనస్తత్వాలు కూడా చదివేసిన హీరో మాటలను కూడా కోట్ చేసారు.

నా రెండు కళ్ళతో లోకాన్ని చదివేసా

ముసుగున మనుషుల రంగులు చూశా

నేనా నువ్వా అంటే నాకు ముఖ్యం నేనంటా …అంటూ వివరించారు.

నాకు నేనే కర్త కర్మ క్రియ

ఒక్క నేనే వేల సైన్యమయ్యా

నా గమనం నిత్య రణం

కణ కణ కణం అనుచరగణం

ఇలా చెప్పడం ద్వారా సినిమాలో హీరో పయనం ఎలా వుండబోతోందో, చెప్పుకు వచ్చేసారు. తనకు తానుగా వుంటూ వచ్చే అనాధ, తన స్వార్ధమే తన లోకం అనుకునే హీరో, తన చర్యలకు తనదే బాధ్యత అని భావించే వీరుడు, నిత్య రణం దిశగా ఎలా సాగాడు అనేది సూక్ష్మంగా ఓ పాటలో వివరంచినట్లు అయింది.