పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. అంతే కాదు.. మూడు బలమైన శాఖలకు మంత్రి. క్షణం తీరుబాటు వుండదు. కానీ ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలు రెండు వున్నాయి.
టేకప్ చేసిన సినిమా మరోటి వుంది. కనీసం ఓజి, హరి హర వీరమల్లు సినిమాలు పూర్తి చేస్తారేమో అని అభిమానుల ఆశ. కానీ క్లారిటీ ఇచ్చేది ఎవరు. పవన్ కళ్యాణ్ నే ఇవ్వాలి స్వయంగా. అందుకే ఆయనే ఇచ్చారు. ఇప్పట్లో కుదిరేది కాదు అంటూ.
పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కు అభిమానుల నుంచి ఓజి.. ఓజి అనే నినాదాలు ఎదురయ్యాయి. దానికి ఆయన బదులిస్తూ..’ఓజి నా.. ఇప్పుడు నేను ఓజి అంటే మీరు క్యాజీ అంటారేమో? అసలు అంత టైమ్ వుందంటారా? ఒక్క గుంత కూడా పూడ్చకుండా, రోడ్లు వేయడం మాట సరే, కాస్తయినా బాగు చేయకుండా నేను సినిమాలు చేసుకుంటే మీరే మళ్లీ ఏమంటారో? అందుకే మూడు నెలలు ఆగండి. ఓజి బాగుంటుంది..’ అన్నారు.
అంటే ఇప్పట్లో సినిమాలు చేసే తీరిక లేదన్నది వాస్తవం. బహుశా మంత్రిత్వ వ్యవహారాలు ఆకళింపు చేసుకుని, వాటిని ఓ కొలిక్కి తీసుకువచ్చి, అప్పుడు కాస్త గ్యాప్స్ లో సినిమాలు చేయాలన్నది పవన్ ఆలోచన కావచ్చు. బహుశా ఆయన మూడు నెలలు అన్నారు అంటే మరో రెండు నెలలు అయినా అదనంగా పడుతుంది. అందువల్ల పవన్ సినిమా మళ్లీ ఫ్యాన్స్ చూడాలంటే కనీసం ఆరేడు నెలలు అయినా వేచి వుండాలేమో?