బ‌చ్చ‌న్ … ఏమిటీ శిక్ష‌న్‌?

బ‌చ్చ‌న్ చూసాను. ఈ సారైనా హ‌రీశ్ శంక‌ర్ బాగా తీస్తాడ‌ని ఆశ‌ప‌డ్డాను. కానీ తీయ‌లేదు. టికెట్‌తో క‌లిపి రూ.800 వ‌దిలింది. సినిమాలు చూసేది డ‌బ్బు పోగొట్టుకోడానికే కాబ‌ట్టి, ఎలాంటి ప‌శ్చాత్తాపం లేదు. రాత్రి తెగ…

బ‌చ్చ‌న్ చూసాను. ఈ సారైనా హ‌రీశ్ శంక‌ర్ బాగా తీస్తాడ‌ని ఆశ‌ప‌డ్డాను. కానీ తీయ‌లేదు. టికెట్‌తో క‌లిపి రూ.800 వ‌దిలింది. సినిమాలు చూసేది డ‌బ్బు పోగొట్టుకోడానికే కాబ‌ట్టి, ఎలాంటి ప‌శ్చాత్తాపం లేదు. రాత్రి తెగ తాగి, హ్యాంగోవ‌ర్‌లో ఇక జీవితంలో మందు ముట్ట‌న‌ని ప్ర‌మాణం చేసిన‌ట్టు, జూదంలో పోగొట్టుకున్న‌వాడు ఈ క్ష‌ణం నుంచి వ‌దిలేస్తున్నాన‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సినిమా చూసిన ప్ర‌తిసారీ ఇక ఎన్న‌టికీ థియేట‌ర్‌కి వెళ్ల‌కుండా ఓటీటీల‌కి ప‌రిమితం కావాల‌ని అనుకుంటా. కానీ సినిమా కూడా మామూలు వ్య‌స‌నం కాదు. అందుకే జేబులు ఖాళీ చేస్తున్నారు.

బ‌చ్చ‌న్ బాలేదా అంటే, చాలా చోట్ల చాలా బాగుంది. నాలుగు జీడి పప్పులు బాగుండి, పాయ‌సం పుల్ల‌గా వుంటే ఎవ‌డూ తిన‌డు. ఉడికీ ఉడ‌క‌ని ప‌లావులో రెండు చికెన్ ముక్క‌లు రుచిగా వుంటే ఏం ప్ర‌యోజ‌నం. హ‌రీశ్ శంకర్ మంచి వంట‌కం వండ‌డానికే పూనుకున్నాడు కానీ, రెసిపీ మ‌రిచిపోయాడు. 1980 నాటి క‌థ అనుకుని, అప్ప‌టి సినిమానే తీసాడు. ర‌వితేజ‌కి మంచి క‌ర్ర‌సాము ప్రాక్టీస్ చేయించి మూల‌నున్న ముస‌లోడు జ‌గ‌ప‌తిబాబుని కొట్ట‌డానికి పంపించాడు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య డైలాగ్‌ల‌తో సినిమా లాగ్ అయింది తాయార‌మ్మ. (తాయార‌మ్మ జ‌గ‌ప‌తిబాబు ప్రేమ దేవ‌త‌. నిరంత‌రం ఆమెను స్మ‌రిస్తూ బిల్డ‌ప్ ఇస్తూ పాట‌లు పాడి తాట తీస్తుంటాడు)

బ‌చ్చ‌న్ ప్యాకేజి ఏంటంటే ఒక ఆర్కెస్ట్రా, నాలుగు హిందీపాటలు, కొన్ని తెలుగు పాట‌లు, ఒక రెయిడ్‌, ఆరుగురు క‌మెడియ‌న్లు, ఐదు ఫైట్లు. అన్నీ తూక‌మేసి విస్త‌రాకులో వ‌డ్డించారు. స్క్రీన్ ప్లేని మ‌రిచిపోయారు. గిజిగాడి గూడులా టైట్ స్క్రీన్ ప్లే వుంటే త‌ప్ప ప్రేక్ష‌కుల‌కి ఆన‌ని కాలం. ప్ర‌తిదీ ముందే తెలిసిపోయేలా, అల్లికే లేని క‌థ‌నం పూర్తిగా నీర‌స‌ప‌రిచింది.

సెకెండాఫ్‌లో పాట‌లు వ‌స్తున్న‌ప్పుడు, భూకంపాన్ని ప‌సిగ‌ట్టే స‌రీసృపాల్లా జ‌నం కెవ్వున అరిచారంటే ఎవ‌రిది త‌ప్పు? అంద‌మైన హీరోయిన్ ఉన్నా పాట‌లంటే జ‌నం జ‌డుసుకున్నారంటే ఎంత రాంగ్ ప్లేస్‌మెంట్‌.

సినిమాలో మెయిన్‌ప్లాట్, ఒక దుర్మార్గ రాజ‌కీయ నాయ‌కుడిపై ఇన్‌క‌మ్ ట్యాక్స్ రెయిడ్‌. అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌కుండా ఫ‌స్టాఫ్ అంతా హీరో ల‌వ్ ట్రాక్‌తో స‌రిపోయింది. సెకెండాఫ్‌లో రెయిడ్‌కి వెళ్లిన హీరో, శుభం కార్డు ప‌డే వ‌ర‌కూ ఆ ఇంట్లో ఇరుక్కుపోయి మ‌న‌ల్ని ఇరికించేస్తాడు.

విల‌న్ తోపులా ప్రారంభ‌మై, చివ‌రికి కాసేపు తోక ఊపుతూ, తోక ముడుస్తూ వుంటాడు. ఎక్సైజ్ అధికారిని రోడ్డు రోల‌ర్ ఎక్కించి చంపిన విల‌న్, హీరోని ఎదిరించ‌లేక అవ‌స్థ‌లు ప‌డుతుంటాడు. అరువు తెచ్చుకున్న క‌థ‌ని, బ‌రువుగా మార్చుకున్న ద‌ర్శ‌కుడు రైటింగ్‌లో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. జాన‌ర్, టోన్‌, ఫిక్స్ చేసుకోక కాసేపు కామెడీ, కొంచెం సీరియ‌స్‌నెస్ క‌ల‌గాపుల‌గం చేసాడు. హీరో హీరోయిన్, కొంద‌రు క‌మెడియ‌న్లు, ఒక విల‌న్ ఇలా సింగిల్ లేయ‌ర్ క‌థలు ఇప్పుడు వ‌ర్కౌట్ కావు. మ‌ల్టిఫుల్ లేయ‌ర్స్ వుండాలి. క‌థ‌లో వ‌చ్చే ప్ర‌తి ముఖ్య పాత్ర‌కి ఒక రౌండ‌ప్ వుండాలి. ఇవేమీ లేకుండా కృష్ణ‌వంశీ సినిమాకి రెండింత‌ల జ‌నం ప్ర‌తి సీన్‌లో వుంటారు. వాళ్ల‌కి ఏ ఇంపార్టెన్స్ లేన‌ప్పుడు వాళ్ల ప‌రిచ‌యం కూడా స్క్రీన్ టైమ్ వేస్ట్‌.

సినిమాలో రిలీఫ్ ఏమంటే మంచి పాత పాట‌లు వినిపిస్తూ వుంటాయి. హిందీ , తెలుగు క‌లిసి. నోస్టాల్జియాని ఇష్ట‌ప‌డే వాళ్ల‌కి ఫ‌స్టాఫ్ హాయిగా వుంటుంది. విల‌న్ , అత‌ని త‌ల్లి ముస‌ల‌మ్మ (అన్న‌పూర్ణ‌మ్మ‌)తో స‌హా ప్ర‌తి వాళ్ల‌కీ పాట‌లంటే ఇష్ట‌మే. హ‌రీశ్‌కి పాట‌లంటే ఇష్ట‌మైతే మిస్ట‌ర్ మ‌హ‌దేవన్ అని ఇంకో సినిమా తీసుకోవాలి. సీరియ‌స్ క‌థ‌లోకి ఈ మిక్చ‌ర్ కుద‌ర్లేదు.

నిజానికి ర‌వితేజ ఎన‌ర్జీ లెవెల్స్ వేరు. ఆయ‌న చ‌మ‌త్కారాల‌తో విప‌రీతంగా న‌వ్వించాలి. కానీ ఆ ప‌ని స‌త్య చేసాడు. భారాన్ని తేలిక చేసాడు. షోలేలో ఒక డైలాగ్ వుంది. చెల్ల‌ని నాణెం రెండు వైపులా చెల్ల‌దు. హ‌రీశ్ మ‌న‌కే కాదు, హీరో ర‌వితేజ‌కి కూడా ఖోటేసిక్కే (చెల్ల‌ని నాణెం) ఇచ్చాడు.

షోలేలో ఇంకో డైలాగ్ కూడా వుంది. ఇనుము వేడిగా వున్న‌ప్పుడే సుత్తితో కొట్టు. క‌థ‌లో వేడి లేక‌పోతే అది ఆయుధంగా మార‌దు. కొలిమి లేకుండా క‌త్తిని ఎవ‌రూ చేయ‌లేడు.

హ‌రీశ్‌కి ఒక విష‌యానికి అభినంద‌న‌లు చెప్పాలి. త‌న‌తో ప‌ని చేసిన అంద‌రి అసిస్టెంట్ల పేర్లు స్క్రీన్ మీద చ‌దువుకునేంత స‌మ‌యం వేసాడు. చాలా మంది క‌క్కుర్తి డైరెక్ట‌ర్లు త‌మ కోసం సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ప‌ని చేసిన వారి పేర్లు అర సెక‌ను కూడా వేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.

అప్డేట్‌కి, అవుట్‌డేట్‌కి ఒక ప‌ద‌మే తేడా. గుర్తించ‌క‌పోతే ఒక జీవిత‌కాలం వృథా అవుతుంది. ఇదంతా రాయ‌డానికి నాకేం హ‌క్కు వుందంటారా? నేను ప్రేక్ష‌కున్ని. నేను డ‌బ్బులిచ్చేవాన్ని. మీరు తీసుకునేవాళ్లు. ఇచ్చే వాడికి చాలా హ‌క్కులుంటాయి. డ‌బ్బులు ఎవ‌రికీ ఊరికే రావు.

జీఆర్ మ‌హ‌ర్షి

14 Replies to “బ‌చ్చ‌న్ … ఏమిటీ శిక్ష‌న్‌?”

  1. డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూడడం మీ వ్యసనం చదవడం నా వ్యసనం, ఈ సారికి ఇద్దరం తిన్నాము దెబ్బ , మీకు OTT నాకూ చదవడానికి వేరే ఆప్షన్ ఉన్నా! ఏమి చేస్తామఁ. కర్మ గా .. మా.. రే తో .. అని సరిపెట్టుకోవడమే

  2. మహర్షి అని రాసుకుంటే వెజ్ అనుకున్నాను, చికెన్ గురించి రాసారు అంటే కాదన్న మాట!

  3. Movie release ayina 1st day ne intha detailed ga reviews adi kuda full negatives isthe, daanardham entandi….Movie anedi oka business, alage mee media kuda oka business….pakka vaadi business paina respect lekapothe ela….mee reviews ivvandi, May be one week tatvatha….munde ichi vaalla business enduku chedagodataru….konchem values maintain cheyyandi….lekapothe vaalla edupulu meeku tagulutayi

Comments are closed.