షాకిచ్చిన హీరోలు.. ఊహించని ఫ్లాపులు

ఎన్నో సినిమాలు ఊహించినట్టే ఫ్లాప్ అవ్వగా, కొన్ని సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. ఈ ఏడాది షాకులు సంక్రాంతి నుంచే మొదలవ్వడం బాధాకరం.

తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ. వందల్లో సినిమాలు విడుదలైతే కేవలం 5-6 శాతం సక్సెస్ రేట్ తో నడుస్తున్న పరిశ్రమ టాలీవుడ్. అది ఈ ఏడాది కూడా కొనసాగింది. ఎన్నో సినిమాలు ఊహించినట్టే ఫ్లాప్ అవ్వగా, కొన్ని సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. ఈ ఏడాది షాకులు సంక్రాంతి నుంచే మొదలవ్వడం బాధాకరం.

2024 సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. నిర్మాత మాత్రం బాగా డబ్బులొచ్చాయని వాదిస్తాడు. చర్చ ఇలా మొదలైందంటేనే సినిమా రిజల్ట్ ఏంటనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏకగ్రీవంగా అంతా హిట్ అని చెప్పే స్థాయికి మాత్రం ఈ సినిమా చేరుకోలేకపోయింది.

ఇదే టైమ్ లో వచ్చిన సైంధవ్ మూవీ మాత్రం ఎలాంటి వాదోపవాదాలు లేకుండానే డిజాస్టర్ అయింది. కనీసం సంక్రాంతి సీజన్ కూడా ఈ సినిమాను ఆకట్టుకోలేకపోయింది. దగ్గుబాటి ఫ్యాన్స్ బాధపడే విషయం ఏంటంటే, వెంకీ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ చిత్రం ఇది.

అలా సంక్రాంతి నుంచే టాలీవుడ్ కు షాకులు మొదలవ్వగా, అక్కడ్నుంచి మినిమం గ్యాప్స్ లో డిజాస్టర్ల పరంపర కొనసాగుతూ వచ్చింది. రవితేజ నటించిన ఈగల్ సినిమా టాలీవుడ్ ను షేక్ చేసింది. భారీ నష్టాలు మిగిల్చింది. భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా గట్టిగా వారం కూడా థియేటర్లలో నిలబడలేకపోయింది. అయితే రవితేజ ఫ్లాపుల జాబితా ఈ సినిమాతోనే ఆగిపోలేదు. ఈగల్ ను మరిపించే స్థాయిలో మిస్టర్ బచ్చన్ రిలీజ్ చేశాడు. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా మిస్టర్ బచ్చన్ పేరు తెచ్చుకుంది. హరీశ్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు.

హీరో వరుణ్ తేజ్ కూడా 2 షాకులిచ్చాడు. అతడు నటించిన ఆపరేషన్ వాలంటైన్ ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా జనాలకు తెలియలేదు. అంత పెద్ద ఫ్లాప్ అది. ఓ డిజాస్టర్ తర్వాత మరో మూవీపై అంచనాలు పెంచడం చాలా కష్టం. వరుణ్ తేజ్ మాత్రం మట్కా సినిమాపై మంచి అంచనాలు సెట్ చేయగలిగాడు. కానీ దురదృష్టవశాత్తూ అది కూడా ఆడలేదు. పెట్టిన పెట్టుబడి, వచ్చిన వసూళ్లకు పోల్చి చూసుకుంటే అది కూడా డిజాస్టరే.

గోపీచంద్ కు కూడా వరుస ఫ్లాపులు తప్పలేదు. 2023లో రామబాణం లాంటి డిజాస్టర్ ఇచ్చిన ఈ హీరో, ఈ ఏడాది దానికి ఏమాత్రం తీసిపోని విధంగా భీమా, విశ్వం సినిమాలు అందించాడు. భీమా సినిమా ట్రయిలర్ సక్సెస్ అయింది, సినిమా ఫ్లాప్ అయింది. ఇక విశ్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీనువైట్ల నుంచి వచ్చిన సినిమా ఇది. గోపీచంద్ యాంగిల్ లో కంటే, శ్రీనువైట్ల కోణంలో ఈ సినిమాను చాలామంది చూశారు. కానీ సినిమా నిరాశపరిచింది.

ఈ ఏడాది బిగ్గెస్ట్ షాకుల్లో ఒకటి ది ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. గీతగోవిందం తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ చేసిన సినిమా కావడం, దిల్ రాజు నిర్మించిన చిత్రం కావడంతో మినిమం గ్యారెంటీ ఉంటుందని అంతా భావించారు. కానీ రిలీజైన తర్వాత ఫ్యామిలీ మేన్ సినిమా పెద్ద ట్రోలింగ్ స్టఫ్ గా మారింది. చివరికి విజయ్ దేవరకొండ నటన కూడా కృతకంగా అనిపించిందంటే కంటెంట్ లో ఎన్ని తప్పులున్నాయో ఊహించుకోవచ్చు.

విశ్వక్ సేన్ కూడా 2 ఫ్లాపులిచ్చాడు.ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలు రిలీజ్ చేశాడు విశ్వక్ సేన్. వీటిలో గామి సినిమా మల్టీప్లెక్స్ మూవీ అనిపించుకుంది. బ్రేక్ ఈవెన్ అయింది కూడా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలు మాత్రం క్లియర్ ఫ్లాప్స్. వీటి గురించి ఇంతకంటే ఎక్కువ చర్చించడం కూడా అనవసరం.

వీళ్లు మాత్రమే కాదు. అల్లరి నరేశ్ (ఆ ఒక్కటి అడక్కు, బచ్చల మల్లి), సుధీర్ బాబు (హరోం హర, మా నాన్న సూపర్ హీరో), శ్రీవిష్ణు (ఓ భీమ్ బుష్, శ్వాగ్) కూడా ఈ ఏడాది రెండేసి ఫ్లాపులిచ్చారు. ఇక రాజ్ తరుణ్ అయితే హ్యాట్రిక్ ఫ్లాపులిచ్చాడు.

2024 బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో డబుల్ ఇస్మార్ట్ కూడా ఉంది. ఇస్మార్ట్ శంకర్ హిట్టవ్వడంతో, సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ పై కొంతమంది ఆశలుపెట్టుకున్నారు. జనాల సంగతి పక్కనపెడితే, యూనిట్ మాత్రం గట్టిగా హోప్స్ పెట్టుకుంది. కానీ డబుల్ ఇస్మార్ట్ సినిమా డబుల్ డిజాస్టర్ అనిపించుకుంది. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాధ్, హీరోయిన్ కావ్య థాపర్.. ఇలా అందరికీ జాయింట్ గా ఫ్లాప్ ఇచ్చింది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది మరికొన్ని ఫ్లాపులు కూడా కనిపిస్తాయి. యాత్ర 2 (జీవా), ఆ ఒక్కటి అడక్కు (అల్లరి నరేశ్), ప్రతినిధి 2 (నారా రోహిత్), భజే వాయువేగం (కార్తికేయ), మనమే (శర్వానంద్), డార్లింగ్ (ప్రియదర్శి) సినిమాలు కూడా జాబితాలో కనిపిస్తాయి. ఇక చిన్న సినిమాల సంగతి సరేసరి.

6 Replies to “షాకిచ్చిన హీరోలు.. ఊహించని ఫ్లాపులు”

  1. షాకిచ్చింది హీరోలు కాదు ప్రేక్షకులు…

    వీళ్ళవి ఊహించని ఫ్లాపులేమి కావు. ప్రేక్షకులు ట్రైలర్లు చూసి సినిమా ఎలా ఉంటుందో ముందే ఊహించారు, అందుకే ఫ్లాపు చేసి పడేసారు

Comments are closed.