తప్పు ప్రజలది కాదు.. నేతలది

కూటమి అధికారంలోకి వచ్చి నెలలు దాటిన తరువాత చెత్త పన్ను రద్దు ఫలితం కనిపిస్తోంది.

అపార్ట్‌మెంట్ కొంటారు.. భారీగా వడ్డీలు కడతారు.. వేలల్లో మెయింటెనెన్స్ కడతారు.. వేలల్లో కరెంట్ బిల్లులు కడతారు. కార్లు, స్కూటర్లు, బైక్‌లు మెయింటెయిన్ చేస్తారు. కానీ నెలకు యాభై రూపాయిలు చెత్త పన్ను కట్టలేరు. పైగా చెత్త పన్ను అంటూ వెటకారం. దాని మీద రీల్స్, షార్ట్ వీడియోలు. ప్రతి ఇంటి నుంచి రోజుకు కిలోల కొద్దీ చెత్త బయటకు వస్తుంది. దీని బాధ్యత ఎవరి మీద? ఎవరు దీన్ని ‘ఉచితంగా’ డిస్పోజ్ చేయాలి?

రాజకీయ కారణాలతో వైకాపా ప్రభుత్వం వేసిన చెత్త పన్నును తెలుగుదేశం ప్లస్ జనసేన భయంకరంగా వ్యతిరేకించాయి. జనాలను ఎంత రెచ్చ గొట్టాలో అంతా రెచ్చగొట్టాయి. తాము అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం చెత్త పన్ను తీసేయడం మీదే అన్నాయి. అధికారంలోకి వచ్చాయి. అలాగే పన్నును తీసేసాయి. దీనికి ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే అలా తీసేయడం వల్ల ప్రభుత్వం మీద భారం ఏమీ పడదు కదా. మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల మీద కదా భారం పడేది. అదే జరిగింది.

ఇప్పుడు ఏం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి నెలలు దాటిన తరువాత చెత్త పన్ను రద్దు ఫలితం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నిర్ణయాలకు బేషరతు మద్దతు ఇచ్చే ఈనాడు లాంటి పత్రికే రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, విశాఖ లాంటి డబ్బున్న కార్పొరేషన్లలో చెత్త పరిస్థితి ఎలా వుందో కళ్లకు కట్టినట్లు వ్యాసం అందించింది. ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోతోందని, రోడ్ల మీద ఎక్కడ చూసినా చెత్తే వుందని చెప్పుకువచ్చింది.

ప్రభుత్వం పన్ను తీసేసి ఉపకారం చేసింది. కానీ కార్పొరేషన్లు, స్ధానిక సంస్థలు మాత్రం పట్టించుకోవడం లేదని అనడం వరకు బాగానే వుంది. కానీ ఎలా పట్టించుకోవాలి. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు పన్నులు పెంచితే ప్రతిపక్షాలు గోల చేస్తాయి. షార్ట్ వీడియోలు చేస్తాయి. రీల్స్ చేస్తాయి. సోషల్ మీడియాలో యాగీ చేస్తాయి. మీ ఇంటి చెత్త నెల పొడవునా తరలిస్తాం యాభై రూపాయిలు ఇవ్వండి చాలు అంటే ఆస్తి మొత్తం రాసివ్వమన్నట్లు నానా యాగీ చేస్తాయి.

స్థానిక సంస్థల ఆదాయ వనరులు అంతంత మాత్రం. పైగా వాటి పేరుతో భయంకరంగా రుణాలు లాగేయవచ్చు అన్నది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపించింది. వైకాపా ప్రభుత్వం అనుసరించింది. దాంతో వడ్డీల భారం. మరి అభివృద్ధి సంగతి సరే, చెత్త క్లియరింగ్ ఎలా సాధ్యం? చెత్త పన్ను వసూలు చేస్తే ఏ మున్సిపాల్టీకి ఎంత ఆదాయం వస్తుందో లెక్కలు చూసి, రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని భర్తీ చేయాలి కదా. అలా భర్తీ చేయకుండా, రద్దు చేసేసాం అని టముకు వేస్తే ఫలితం ఏముంది? ఇలా చెత్త పేరుకుపోవడం తప్ప.

8 Replies to “తప్పు ప్రజలది కాదు.. నేతలది”

  1. అంటే చెత్త పన్ను తప్పు కాదు అంటావ్…2019 కి ముందు చెత్త అంతా రోడ్డు మీదే ఉండేది అంటావ్

Comments are closed.