‘మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు’ అనేది చాలా పాత స్టేటుమెంటు. ‘ఆకాశంలో సగం మీదే’ అని అమ్మాయిలకు చెప్పవలసిన అవసరం లేదిప్పుడు. ఆకాశాన్ని దాటి రోదసిలో ప్రయోగాలు చేస్తూ ఉన్న ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌ను గుర్తు చేసుకోండి చాలు అనవచ్చు. ఆవిడ భూమిని విడిచి వెళ్లి ఏడు నెలలైంది. తిరుగు ప్రయాణం ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. అయినా చెక్కు చెదరకుండా, స్థయిర్యం చెడకుండా ప్రయోగాలు చేస్తూ పోతోంది. ఇలాటి రోజుల్లో మీరు శక్తియుక్తుల్లో, తెలివితేటల్లో మగవాళ్లతో సమానం అని ఆడవాళ్లను ఎంకరేజ్ చేయబోతే హాస్యాస్పదంగా ఉంటుంది. ‘నీకు మూడు తలకాయలున్నాయి చూసుకున్నావా?’ అని బ్రహ్మకు ‘నీకు నాలుగు చేతులున్నాయని గమనించావా?’ అని విష్ణువుకు చెప్పినట్లుంటుంది. సరిగ్గా చెప్పాలంటే మగవాళ్లతో ఆడవాళ్లు సమానం… అని కాదు, ‘ఎక్కువ సమానం’ అని చెప్పే పరిస్థితి వచ్చింది. రిజల్ట్స్ వచ్చిన రోజు పేపరు చూడండి. మగవాళ్ల కంటె ఆడవాళ్లకే ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయి!
‘ఆడపిల్లలకు చదువు చెప్పించడం దండగ. ఉద్యోగాలు చేయాలా? ఊళ్లు ఏలాలా?’ అనే సామెత మా చిన్నప్పుడు వినబడేది. చూస్తూండగానే రోజులు మారాయి. వాళ్లు ఉద్యోగాలు చేయడం మొదలెట్టాక, మగవాళ్ల కంటె త్వరగా ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. వారి కంటె శ్రద్ధగా పని చేసి, ప్రమోషన్లు తెచ్చుకుంటున్నారు. ఒక లెవెల్ వరకు మగవాళ్లు వారితో పోటీ పడలేక ఆపసోపాలు పడుతున్నారు, పళ్లు నూరుకుంటూ నివ్వెరపోయి చూస్తున్నారు. ఇక ఊళ్లేలడం అంటారా? ఊళ్లేమిటి, దేశాలే ఏలుతున్నారు. ప్రపంచంలో తొలిసారిగా మహిళా ప్రధానమంత్రిగా శ్రీలంక సిరిమావో బండారు నాయకే ఎన్నికయ్యారు. ఒక దశలో శ్రీలంక ప్రధానిగా ఆమె, భారతదేశ ప్రధానిగా ఇందిరా గాంధీ విరాజిల్లారు. కొన్నేళ్లకు పాకిస్తాన్ ప్రధానిగా బేనజీర్ భుట్టో, బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వెలిగారు. మన చుట్టూ ఉన్న దేశాల గురించే చెప్తున్నాను. ప్రపంచంలో చూసుకుంటే చాలా మందే ఉన్నారు.
మహిళలు కొన్ని రంగాలలో బాగానే ఉన్నా, యింకొన్ని రంగాలలో తగినంతగా లేరని నాకనిపిస్తుంది. దీనికి కారణం ‘ఇది మనకు సంబంధించినది కాదు’ అని మహిళలు అనుకోవడం, వారికి అలాటి ఆలోచన రావడానికి కారణం – చుట్టూ ఉన్నవారు. చాలాకాలం పాటు ఆడవారు చేసే ఉద్యోగాలు అంటే టైపిస్టులు, స్టెనోలు, రిసెప్షనిస్టులు, నర్సులు, టీచర్లు.. యిలా ఉండేవి. వీటిలో ఓర్పు ఎక్కువ కావాలి. వాళ్లకి ఓర్పు ఎక్కువ. అనేవారు. లెక్కలు ఆడవాళ్ల ఒంటికి పడవు అనే స్థిరాభిప్రాయం ఉండేది. నేను ఇంజనీరింగు చదివే రోజుల్లో మా కాలేజీలో అమ్మాయిలు అరడజనుకి లోపే ఉండేవారు. ఎదురుగా ఉండే మెడికల్ కాలేజీలోనే అమ్మాయిలు కనబడేవారు. బియస్సీ చదివే రోజుల్లో కూడా ఎంపిసి సెక్షన్‌లో అమ్మాయిలను వేళ్ల మీద లెక్కించవచ్చు. బిజెడ్‌సి (బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ) లో ఎక్కువ శాతం మంది అమ్మాయిలే. అసలు అమ్మాయిల్లో చాలామంది సైన్సు కేసి వచ్చేవారే కాదు. అందరూ ఆర్ట్స్ వైపుకే వెళ్లేవారు. కామర్స్‌కు కూడా అతి తక్కువ మంది వెళ్లేవారు.
చూస్తూండగానే ఇంజనీరింగుకి, కంప్యూటర్లకు క్రేజ్ పెరిగింది. అమ్మాయిలకు లెక్కల భయం ఎప్పుడు పోయిందో, ఎలా పోయిందో తెలియదు. ఇప్పుడు ఇంజనీరింగు కాలేజీల్లో అమ్మాయిలే అమ్మాయిలు. కంప్యూటర్ల వాడకం పెరిగాక బిటెక్, ఎంసిఏ, బియస్సీ కంప్యూటర్లు – ఎటు చూసినా వారే! దీని అర్థమేమిటి? ఇది మన ఫీల్డు కాదు అని స్త్రీలు అనుకున్నంత కాలమే మగవాళ్ల డామినేషన్ చెల్లుతోంది. ఇది మనదే అని ఒక్కసారి ఫిక్స్ అయ్యారంటే ఆడవాళ్లు దూసుకుపోతున్నారు. ప్రొఫెషనల్ కోర్సులు కూడా చూడండి. లాయర్లుగా, ఆడిటర్లుగా, మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌గా, మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్స్‌గా గతంలో మగవాళ్లే ఉండేవారు. ఇప్పుడు ఆ రంగాలు కూడా ఆడవాళ్ల వశమై పోయాయి. క్రియేటివ్ ఫీల్డులో వారు ఎప్పుడూ చురుగ్గానే ఉన్నారు. మరి వారు గట్టిగా చూపు సారించని రంగాలేమున్నాయి? అని చూడబోతే నాకు సైంటిఫిక్ ఫీల్డ్, పొలిటికల్ ఫీల్డ్ కనబడ్డాయి.
ముందుగా మహిళా సైంటిస్టుల గురించి మాట్లాడతాను. మన దేశంలో ప్రసిద్ధి చెందిన మహిళా సైంటిస్టులెవరు? అనగానే వెంటనే డా. టెస్సీ థామస్ పేరు తప్ప వేరే ఏదీ తట్టలేదు. ఆవిడ మా డిఫెన్స్ లాబ్స్ ఉద్యోగిని కాబట్టి అగ్ని మిస్సయిల్స్‌లో పని చేశారు కాబట్టి గుర్తున్నారు. పద్మ ఎవార్డులు తెచ్చుకున్న మహిళా సైంటిస్టులు ఎవరున్నారో తెలుసుకోవాలంటే గూగుల్‌లో వెతకాల్సి వచ్చింది. అసీమా చటర్జీ అనే ఆవిడకు మెడిసినల్ కెమిస్ట్రీలో 1975లో పద్మభూషణ్ యిచ్చారు. డా. జానకీ అమ్మాళ్ అనే బొటానిస్టుకి 1977లో పద్మశ్రీ యిచ్చారు. ఇంకా కొందరున్నారు కానీ వాళ్లకు పద్మ అవార్డులు రాలేదు. గ్దతమెడిసిన్‌లో రిసెర్చి చేసిన వాళ్లు చాలామందే ఉన్నారు. డ్రగ్ రిసెర్చిలో చేసిన వారూ ఎందరో ఉన్నారు. మా శాంతా బయెటెక్నిక్స్ లోనే డా. రేవతి అని అద్భుతమైన ఔషధాలనూ, వాక్సిన్‌లను డెవలప్ చేశారు. కానీ తగినంత మంది సైంటిస్టులు లేరనే ఆవేదన నాలో వుంది. మా శాంతా బయోటెక్ సంస్థలో అనేక మంది ఉద్యోగినులు, మహిళా సైంటిస్టులు పని చేశారు. ప్రతిభ, అంకితభావం అనేవి వ్యక్తిగత గుణాలు. కానీ జెండర్ కోణంలో వాళ్లలో నేను గమనించిన విషయాలు చెప్తాను.
ఆడవారిలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? – మగవాళ్లు రేషనల్‌గా ఆలోచించడంలో దిట్టలు, ఆడవారు ఎమోషనల్. వారిలో సృజనాత్మకత హెచ్చు. సైంటిఫిక్ రిసెర్చ్‌కు క్రియోటివ్ థాట్స్ ఎక్కువ అవసరం. అందువలన మహిళలకు సైంటిఫిక్ రిసెర్చి బాగా నప్పుతుంది. ప్రత్యామ్నాయాలు వెతకడంలో ఆడవారు సిద్ధహస్తులు. కూరగాయలు దొరక్కపోతే ఏదో ఒక ఆకుకూరతో పచ్చడో, కలగలుపు పప్పో చేసి భోజనం సిద్ధం చేయగలదు. రిసెర్చ్ అంటే ఆల్టర్నేటివ్స్‌పై వర్క్ చేయడం, వాటిని లాజికల్ ఎండ్‌కు తీసుకురావడం. ఒక మార్గం మూసుకుపోతే ఆ లోటు ఎలా భర్తీ చేయడమో వాళ్లు సులభంగా ఆలోచించగలరు.
రిసెర్చి బాటలో అంటే వైఫల్యాలు, నిరాశలు అడుగడుగునా ఎదురవుతాయి. 99 సార్లు విఫలమౌతేనే, నూరో సారి విజయం సిద్ధిస్తుంది. భారతీయ మహిళ ఎన్నో పరిమితుల మధ్య పెరుగుతుంది. అపజయాలు, నిరాశలు చిన్నప్పటి నుంచి అలవడుతాయి. ఆటలాడడానికి ప్లేగ్రౌండ్‌కు వెళతానంటే వద్దంటారు, స్కూల్లో ఎక్స్‌కర్షన్‌కు వెళతానంటే వద్దంటారు. పై చదువులన్నా, వేరే ఊరిలో ఉద్యోగమన్నా నో అంటారు. మగవాడికి యీ నిబంధనలుండవు. అందువలన ఆడువారికి ఎన్నో ఆశాభంగాలు, కలలు కల్లలుగా మిగులుతాయి. వీటన్నిటినీ జీర్ణం చేసుకుంటూ ఆడది ఎదుగుతుంది.
మన సమాజంలో మగపిల్లవాణ్ని గారం చేస్తారు. ఏం కావాలంటే అది యిస్తారు. ఈ పేంపరింగ్ వలన అతను దుర్బలుడవుతాడు. అనుకున్నది జరగకపోతే క్రుంగిపోతాడు, దిగాలు పడిపోయి నిశ్చేష్టుడై పోతాడు. స్త్రీకి నిబ్బరం ఎక్కువ. ఓస్, యీ మాత్రానికే బెంగపడాలా? అనుకుంటుంది. అందుకే వైఫల్యం వలన ఆత్మహత్యలు చేసుకునే వారిలో మగవాళ్లలో ఎక్కువమంది కనబడతారు. ఆడవాళ్లలో ఆత్మహత్యలు ఎమోషనల్ కారణాల వలన జరుగుతాయి తప్ప వైఫల్యాల వలన కాదు. అందువలన వైఫల్యాలతో నిండి ఉన్న రిసెర్చికి స్త్రీలు సూటవుతారు.
మన పెంపకం వలన మగవాడికి అహం ఏర్పడుతుంది. ఓటమి కలిగినా ఒప్పుకోవడానికి అభిమానం అడ్డు వస్తుంది. తన పొరపాటుని కప్పిపుచ్చుకోవడానికి ఏవో కారణాలు చెప్తారు. ఆడవాళ్లలో యీ రకమైన హిపాక్రసీ తక్కువ. అపజయం కలిగిందని చెప్పేసి, భారం దింపేసుకుంటారు. దాంతో మేనేజ్‌మెంట్‌కు క్లియర్ పిక్చర్ వస్తుంది.
రిసెర్చి అంటేనే ఓర్పు, ఓర్పు, ఓర్పు. ఫలితం వచ్చేదాకా ఓపిక పట్టాలి, సహనంగా ఉండాలి.. ఈ విషయంలో పెద్దగా వివరణ అక్కరలేదు. సహనం విషయంలో స్త్రీని భూమాతతో పోలుస్తారు. పురుషుల్లో అసహనం ఎక్కువ. త్వరగా విసుగు చెందుతారు. మల్టీ-టాస్కింగ్ విషయంలో కూడా పురుషుల కంటె స్త్రీలకే స్కోరు ఎక్కువ వస్తుంది. నిరక్షరాస్యురాలైన గృహిణి విషయంలో కూడా దీన్ని గమనించవచ్చు. ఉద్యోగినుల విషయంలో చెప్పనే అక్కరలేదు. ఈ విషయం గ్రహింపుకి వచ్చిన దగ్గర్నుంచి ఆఫీసుల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ పోతోంది.
ఇక్కడే ఒక విషయం నొక్కి చెప్పాలి. వర్కింగ్ అవర్స్ విషయంలో స్త్రీల విషయంలో పరిమితులుంటాయి. ముఖ్యంగా పెళ్లయి, పిల్లలున్న వారి విషయంలో సాయంత్రం లేటైన కొద్దీ వారు ఆందోళనకు గురవుతారు. బలవంతంగా కూర్చోబెట్టినప్పటికి యింట్లో పిల్లలు ఆకలితో ఉన్నారేమో అని ఆందోళనకు గురవుతూంటారు. 10 టు 5 వర్క్‌కు లేడీస్ బెస్ట్. లేటు అవర్స్‌లో పని చేయించాలంటే మగవాళ్లు బెస్ట్. వారు యింటి గురించి పెద్దగా వర్రీ అవరు.
ఒక ఎంప్లాయిర్‌గా నా అభిప్రాయాలు, అనుభవాలు చెప్పాను. దీనివలన మీకు అర్థమై ఉంటుంది – మహిళలకు ఉద్యోగావకాశాలు ఎక్కువని! ఇది రాత్రికి రాత్రి వచ్చిన మార్పు కాదు. గత 60, 70 ఏళ్లగా ఉద్యోగాలు చేస్తూ వచ్చిన మహిళలు కష్టపడి క్రియేట్ చేసిన యిమేజ్ యిది. దీని ఎడ్వాంటేజి యీనాటి మహిళలు తీసుకోవాలి. చదువు ముగించాక యింట్లో కూర్చోకుండా, చదివిన చదువుని సార్థకం చేసుకోవాలి. డిగ్రీ అనేది పెళ్లిచూపుల్లో చూపించుకునే సర్టిఫికెట్టుగా కాకుండా, ఒక మహిళ తన కాళ్ల మీద తను ఆర్థికంగా నిలబడగలిగే సాధనంగా, తనకు గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కలిగించే ఉపకరణంగా చూడాలి.
నా భర్త సంపాదిస్తున్నాడు కాబట్టి, నేను యింట్లో కాళ్లు చాపుకుని కూర్చుని, టీవీ సీరియల్స్, యూట్యూబు వీడియోలు చూస్తే చాలు అనుకునే రోజులు కావివి. ఎవరి ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో తెలియటం లేదు. ఉద్యోగాలే కాదు, కంపెనీలే మాయమై పోతున్నాయి. ఆర్టిఫిషియల్ యింటెలిజెన్స్ ఫుల్‌గా ఆపరేట్ అయ్యాక ఏమౌతుందో పెద్దపెద్ద వాళ్లే చెప్పలేక పోతున్నారు. ఎప్పటికప్పుడు అప్‌టుడేట్ అవుతూ ఉద్యోగాన్ని నిలబెట్టుకునే సామర్థ్యం మీ భర్తకు ఉందో లేదో మీకు తెలియదు కదా. అందువలన మీరూ సంపాదనపరులుగా ఉండండి, ఉద్యోగాలే చేయాలని లేదు, చిన్న సైజు ఎంటర్‌ప్రెనార్‌గా మారినా మంచిదే. సైన్సు రంగంలో మన దేశం ఎంతో ఎదగాలి. దానిలో మహిళలు ముఖ్యమైన భూమిక వహించాలి. మహిళా సైంటిస్టులు యిబ్బడిముబ్బడిగా తయారవ్వాలి. ఇదీ నా కోరిక.
ఇక మహిళలు ముందుకు రావలసిన రెండో రంగం ప్రజాక్షేత్రం గురించి క్లుప్తంగానే చెప్తాను. మన దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రులుగా మహిళలు వచ్చారు కానీ, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, స్థానిక సంస్థల్లో తగినంత మంది మహిళలు లేరు. రిజర్వేషన్ కల్పించి, సీట్లు కేటాయించినా ప్రయోజనం ఉండటం లేదు. పేరుకి సర్పంచిగా మహిళ ఉన్నా ‘సర్పంచి పతి’ పేరుతో ఆమె భర్తే అధికారం చలాయిస్తున్నాడు. ఇది మారాలి.
ఎవరైనా ఎమ్మెల్యే, లేదా ఎంపీ అకస్మాత్తుగా మరణిస్తే సింపతీ ఓట్ల కోసం అప్పటిదాకా రాజకీయాలతో పరిచయం లేని అతని భార్యనో, కూతుర్నో అభ్యర్థిగా నిలబెడుతున్నారు. ఇది ఆ మహిళకు అవమానకరం. తన సామర్థ్యం, చదువు, తెలివితేటలు చూపించి ఓట్లడగాలి కానీ నా భర్త శవాన్ని చూసి ఓట్లేయండి అని అడగడం ఆ మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచినట్లే!
రాజకీయాలంటే రఫ్ అండ్ టఫ్ ఫీల్డ్. నిజమే, కానీ విధానపరమైన నిర్ణయాలన్నీ రాజకీయ నాయకులే చేస్తున్నారు. అందుకని విద్యావంతులైన మహిళలు రాజకీయాల్లోకి వచ్చి వాటిని సంస్కరించాలి. పదవులు పొంది వాటి ద్వారా సమాజాన్ని బాగు పరచాలి. ఆడువారు ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు నడుపుతున్నారు. రాజకీయాల్లో రాణించలేరా? సమాజంలో 50 శాతం మంది మహిళలే. బాధితుల్లో, పీడితుల్లో కూడా ఎక్కువ శాతం వారే! సహాయం అవసరపడేది, స్త్రీలు, పిల్లలకే. మగవారి కంటె మహిళలకు వారి సమస్యలు బాగా అర్థమౌతాయి. అందుకే వారు రాజకీయాల్లోకి వస్తే మంచిదని నా అభిప్రాయం.
దీనికి అనుబంధంగా ఉద్యోగుల మధ్య సమీకరణాల గురించి నేను గమనించిన విషయాలు చెప్తాను. మహిళా ఉద్యోగుల కష్టాలు మహిళలకే తెలుస్తాయి అని గట్టిగా చెప్పడానికి లేదు. అది వ్యక్తిపై ఆధారపడుతుంది. సాధారణంగా ఆడవారు మేల్ కొలీగ్‌ను ఎలా ట్రీట్ చేస్తారో, ఫిమేల్ కొలీగ్‌నూ అలాగే ట్రీట్ చేస్తారు. సెక్సువల్ హెరాస్‌మెంట్ జరిగిన సందర్భాల్లో ఒక మగువ యిబ్బందులను మగవారి కంటె మరో మగువ బాగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు కూడా కొద్దోగొప్పో అలాటి యిబ్బందులు కలిగి ఉంటాయి కాబట్టి!
ఇక ఉమన్-మాన్ సమీకరణాల గురించి చెప్పాలంటే ఒక మగవాణ్ని మహిళ బాగా యింప్రెస్ చేయగలుగుతుంది. మహిళల పట్ల మర్యాదగా, గౌరవంగా ఉండాలని చిన్నప్పటి నుంచి నేర్పిన సంస్కారం చేతనో ఏమో మగవాడు ఆడవారితో మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తిస్తాడు. ఆమె చెప్పినది ఓపిగ్గా వింటాడు. అందువలన ఒక మహిళ తనకు జూనియర్‌గా పని చేసే మగవారి నుంచి తక్కువ ఘర్షణతో, ఎక్కువ పనిని వేగంగా రాబట్టగలుగుతుంది. వేరే డిపార్టుమెంటు నుంచి సమాచారం రాబట్టే విషయంలో కూడా వారికి సులభంగా పనులు జరుగుతాయి. లేడీ అడిగినప్పుడు కుదరదని అనడానికి మగవాడు సంకోచిస్తాడు.
ఆడవారు సహజంగా ఎమోషనల్. ఇది కొన్నిసార్లు యిబ్బందులు కొని తెస్తుంది. కొందరు యింటి సమస్యలను ఆఫీసుకి తెస్తారు. కొలీగ్స్‌తో చెప్పుకుని బాధపడి, ఓదార్పు కోసం ఎదురు చూస్తారు. ఇది కాంప్లికేషన్స్‌కు దారి తీస్తుంది. అవతలి కొలీగ్ మగవాడైతే అది వేరే వాటికి దారి తీయవచ్చు. ఆఫీసు వాతావరణం ప్రభావితమౌతుంది. ఈ ఎమోషనల్ సైడే కాదు, భౌతికపరమైన సమస్యలు కూడా ఆడవారికి ఉంటాయి. కొన్ని సమయాల్లో వారు అతి సులభంగా యిరిటేట్ అవుతారు. అప్పుడు వారిని హేండిల్ చేయడం కష్టమౌతుంది. అవతలివారికి ఓర్పు, నేర్పు ఉంటేనే వారితో డీల్ చేయగలరు.
ఆడవారితో యింకో సమస్య ఏమిటంటే, వారికి దుఃఖం కలిగినప్పుడు అప్రయత్నంగానే కంట నీరు తిరుగుతుంది. దానిని వారు ఆపుకోలేరు. ఇది ఆఫీసులో ఆక్వర్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. కుటుంబ జీవితం హాయిగా ఉంటేనే ఆడవారు ఆఫీసుల్లో బాగా పని చేయగలుగుతారు. మగవారి కంటె ఆడవారికి డొమెస్టిక్ హేపీనెస్ ముఖ్యం. సమాజంలో అందరూ దీన్ని గుర్తెరిగి తగినట్లుగా వారితో ప్రవర్తిస్తే, వారి నుంచి బెస్ట్ ఔట్‌పుట్ రాబట్టవచ్చు. మొదటి పేరాలో చెప్పినట్లు సునీతా విలియమ్స్‌నే ఒక్కసారి గుర్తు చేసుకుంటే సరి!
– కె. ఐ. వరప్రసాద్ రెడ్డి, శాంతా బయోటెక్నిక్స్
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు
Mari konni rojullo mana maga jaathi memu kuda unnam… Mammalni guthinchandi ane level ki padipotham…. Happy women’s day… And also mens destruction day…
Ammo