ఈ ముక్క అన్నది ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు. అన్నది తను తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ‘‘సాక్షి’’ (1967) గురించి – మైసూరు ఏరియాకు డిస్ట్రిబ్యూషన్‌కై వచ్చిన సోదరులతో! ‘‘సాక్షి’’ సినిమా తీయడానికి వారు పడిన అష్టకష్టాలు తెలిస్తే ఆ మాట చెప్పడానికి బాపుకి ఎంత గట్సో అనిపిస్తుంది. సినిమా రైటర్‌గా కాస్త నిలదొక్కుకున్న మూడేళ్ల లోనే చిత్ర నిర్మాణానికి సిద్ధమయ్యారు ముళ్లపూడి రమణ. పుట్టుకతో వచ్చిన సాహసమది! జీవితంలో భద్రత కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదాయన. జీవితాన్ని ఓ ఆట గానే చూశారు. కానీ ఈ చిత్ర నిర్మాణపు క్రీడలో మాత్రం స్నేహితుడు బాపును కూడా కలుపుకుని వచ్చారు.
బాపుది రమణ వంటి ఒడిదుడుకుల జీవితం కాదు. తండ్రి కోరిక మేరకు లాయరీ చదివినా పబ్లిసిటీ ఆర్టిస్టుగా, పత్రికలకు ఇలస్ట్రేటర్‌గా రెగ్యులర్‌గా వచ్చే ఆదాయానికి అలవాటు పడ్డారు. రమారమి మూడేళ్ల పాటు “జ్యోతి” మాసపత్రికకు శక్తియుక్తులు ధారపోసి, భాగస్వామితో అభిప్రాయభేదం వచ్చి బయటికి వచ్చేశారు. ఏం చేద్దామాని ఆలోచిస్తూండగానే ఆయనను రమణ సినిమా నిర్మాణం వైపు మళ్లించారు. అప్పటివరకు బాపు సినిమా షూటింగ్ కూడా చూడలేదు. తొలిసారిగా ‘అత్తా ఒకింటి కోడలే’ సినిమాకు కామిక్ స్టోరీలా వేసి పబ్లిసిటీ చేశారు. రమణ పనిచేసిన “గుడిగంటలు”, “రక్తసంబంధం”, “మూగమనసులు” సినిమాలకు పోస్టర్లు డిజైన్ చేశారు.
ఆంధ్రపత్రిక వీక్లీలో ప్రచురించబడ్డ “బంగారం-సింగారం” వంటి కామిక్ సీరియల్స్ చూస్తే బాపుకు షాట్ డివిజన్ గురించి, కెమెరా లెన్స్ వ్యూ గురించి మంచి అవగాహన ఉందని తెలుస్తుంది. ఇద్దరూ కలిసి తొలి సినిమాగా “సాక్షి” తీద్దామనుకున్నారు. “సాక్షి” కథను సినిమాకు మలచడంలోనే రమణ ప్రతిభ! “హైనూన్’’ అనే ఓ వెస్టర్న్ సినిమానుండి స్ఫూర్తి పొంది దానిలో మలుపులు తిప్పి, సస్పెన్స్ పెట్టి ఆంధ్రపత్రిక వీక్లీకి కథ రాశారు. అచ్చులో పడ్డ కథకు, “సాక్షి” సినిమా కథకు ఎంతో తేడా వుంది. సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో సాఫీగా కథ చెప్పడంలోను, లోకుల స్వార్థాన్ని ఎత్తిచూపుతూనే ముగింపు పాజిటివ్‌గా చేయడంతోనూ కథ జనాలకు నచ్చింది. బజెట్ వేసుకుని చూస్తే రెండున్నర లక్షలని తేలింది.
నందనా ఫిలింస్ అనే పేరుతో పార్ట్‌నర్‌షిప్ ఫరం రిజిస్టరు చేశారు. నంద నందనుడు శ్రీకృష్ణుడిని తలుచుకుని చక్కటి నెమలి కన్ను ఆలంబనగా బాపు అందమైన లోగో వేశాడు. పెట్టుబడి వాటా తలా అయిదేసి వేలు అనుకున్నారు. బాపు పదివేలిచ్చారు. బాపు పినతండ్రి సత్తిరాజు శేషగిరిరావు గారు, డూండీ గారి ఫ్రెండు, రెండు మూడు చిత్రాలలో పని చేసిన అనుభవం ఉన్న సురేష్‌కుమార్ ఎలియాస్ ఈడ్పుగంటి ఆశీర్వాదరావు చెరో అయిదూ ఇచ్చారు. ఎగ్రిమెంటులో నలుగురుపార్ట్‌నర్స్. మేనేజింగు పార్ట్‌నర్‌గా చెక్కు సైనింగు పవరు రమణది. సురేష్‌కుమార్, శేషగిరిరావుల పేర్లు నిర్మాతలుగా వేశారు. రమణ దగ్గర అయిదు వేలుందిగాని, అక్కినేని గారి చేయి పడాలన్న సెంటిమెంటుతో వెళ్లి అప్పడిగారు. లోగడ రమణ ఆంధ్ర పత్రిక ఉద్యోగం పోయినప్పుడు, ‘నిలదొక్కుకునే దాకా ఖర్చులకుంటుంది, మిత్రుడిగా యిస్తున్నాను.’ అంటూ ఆయన ఐదు వేలు యివ్వబోతే యీయన పుచ్చుకోలేదు. ఇప్పుడు అప్పుగా తీసుకున్నారు.
ఇలా పాతిక వేలు పోగేసి, రమణ సరాసరి నవయుగ ఫిలింస్ కాట్రగడ్డ శ్రీనివాసరావు (వాసు) గారి వద్దకు వెళ్ళారు. ‘నేనూ నా స్నేహితుడు బాపు ఒక చిన్న సినిమా తియ్యాలనుకుంటున్నాం. అంతా చిన్న నటులు, కొందరు కొత్తవారు. మాటలు నేను. సంగీతం మామ (మహదేవన్) అంతా అవుడ్డోర్…. పల్లెటూళ్ళలో తీస్తాం. సెట్లుండవు. తప్పనిసరి అయితే తప్ప మేకప్పూ విగ్గులూ వుండవు. దీనికి బడ్జెట్ రెండున్నర లక్షలు. మేము యాభై వేలు తెచ్చుకుంటాం. మీరు మమ్మల్ని నమ్మి రెండు లక్షలు పెట్టుబడి ఇస్తే ఓ కొత్తరకం మంచి సినిమా తీస్తాం.” అని ప్రతిపాదించారు.
ఆ ఏడాది వాళ్లు డిస్ట్రిబ్యూట్ చేసిన చాలా చిత్రాలు దెబ్బతిన్న మీదట తక్కువ బజెట్ చిత్రాలను ప్రోత్సహించాలని నవయుగా వారు ఎదురు చూస్తున్నవేళ యీయన వెళ్లారు. ”మీకు నాగేశ్వరరావు, దుక్కిపాటి గారు బాగా తెలుసు కదా, ఇలా సినిమా తీయాలనుకోడం వాళ్లకి తెలుసా?” అని వాసు అడిగితే, ”తెలీదు. చెప్పలేదు….. ఇది లక్షలతో వ్యాపారం కదండి – ఇలాటి దాంట్లో సిఫార్సులూ అవీ నాకిష్టం లేదండి – భయం – మీకు మీరుగా నమ్మగలిగితే ఛాన్సివ్వండి – లేకపోతే వెళ్లిపోతాను” అంటూ రమణ లేచారు. ఆయన ఆపారు. ”ఛాన్సిస్తా, ఎందుకో తెలుసా? మీకు సినిమారంగంలో ఇద్దరు పెద్దవాళ్లు ఫ్రెండ్సయి ఉండి కూడా తిన్నగా నా దగ్గరకే వచ్చి అడిగారు. ఐ లైకిట్’’ అన్నారాయన.
ఈ సినిమాకు డైరక్టరుగా ఎవరుంటారు అనే విషయాన్ని బాపురమణలు యిద్దరూ కూర్చుని ముందుగా మాట్లాడుకున్నట్లు తోచదు. ఎందుకంటే ‘‘ఇంకోతికొమ్మచ్చి’’లో రమణగారు నవయుగ వారి దగ్గర ఆ ప్రస్తావన వచ్చిన తీరు రాశారు. ఆ మీటింగు లోనే ‘‘మీరు రచయిత. మాకు తెలుసు. డైరెక్టరు ఎవరు?” అని వాళ్లడిగితే ”బాపు గారండి”, ”అంటే?”, ”ఆయన గొప్ప ఆర్టిస్టండి. ఎన్నో బొమ్మల కథలు వేశారండి. సినిమా కూడా తీయగలడండి. అతనిమీద నాకు చాలా నమ్మకం అండి. మీరు కూడా నమ్మచ్చునండి” అని రమణ అనగానే ”రమణగారూ, ఒక చిన్న సలహా, మీకు రైటర్‌గా అనుభవం ఉంది. మాకు మూగమనసులు, దాగుడుమూతలు, నవరాత్రి రాశారు. ఇప్పుడు ప్రాణమిత్రులు రాస్తున్నారు. బాపు గారికిదే ఫస్టు అంటున్నారు. ఎంతో కొంతైనా అనుభవం ఉంది కదా మీకు. అందువల్ల తొలిసారి మీరు డైరెక్టరు గానూ, మీ ఫ్రెండు సహాయకుడుగానూ వుంటే….” అంటూండగానే రమణ ”కుదరదండి. నేను రచయితనేనండి. అతనికి ఉన్న పట్టు నాకు లేదండి – అతనే డైరెక్టరు – నేను రైటర్నేనండి” అన్నారు. వాసు గారు సరేననగానే తక్షణం బాపు యింటికి వెళ్లి ”హేయ్ డైరెక్టర్!” అని గావుకేక పెట్టారు ఆనందంతో!
ఈ డైరక్షన్ విషయమై బాపురమణల ఫ్రెండయిన సీతారాముడు ‘‘కొసరుకొమ్మచ్చి’’లో రాస్తూ ‘ఒకరోజు బాపు ‘కాగితాలూ గట్రా కొనుక్కొస్తాను’ అని కారేసుకు బయటకు వెళ్లినపుడు – నేనూ, రమణ, సురేష్ గారూ షూటింగు షెడ్యూలు గురించి మాటాడుకుంటున్నాము. నేనిచ్చిన ఒక సలహా ఒకటి నచ్చక ”ఐ యామ్ ద డైరక్టర్, నేను చెప్పినట్టే వినాలి” అన్నారు సురేష్. నాకు మతోయినట్టయింది. దీన్ని బాపూ రమణలు కలిసితీద్దాం అనుకుంటే ఈయన నేనే డైరక్టరంటాడేమిటీ? అని. ఆ సంగతే ఆయనతో అన్నాను. ”డైరక్టరు అంటే కథ రాయడం కాదు. సీనులు కంపోజింగు, ఏక్టర్ల చేత నటింపజేయడం వంటి అనుభవం వుండాలి’ అన్నారు సురేష్‌గారు. ”అలా అయితే బాపుని మించిన కంపోజరు లేడు – అతను కొన్ని వేల దృశ్యాలు తన ఇలస్ట్రేషన్లలో కంపోజు చేశాడు. ఇక నటన అంటారా చిన్న గీతల్లో అతను ఎక్స్‌ప్రెషన్లు క్రియేట్ చెయ్యగలడు. అలాంటిది నటులలో నటింపజేయడం పెద్ద పని కాదు అతనికి” అన్నాను.
వెంటనే ”అవును సీతారాముడు చెప్పింది అక్షరాలా నిజం. బాపే రియల్ డైరక్టరు” అన్నాడు రమణ. అతను ఏ ముహూర్తానన్నాడో బాపు నిజంగానే గొప్ప డైరక్టరు అయిపోయాడు. మొదటిరోజు షూటింగు వేణుగోపాల స్వామి గుడిమండపంలో జరిగింది. ‘అమ్మకడుపు చల్లగా అత్త కడుపు చల్లగా’ అనే పాటతో ప్రారంభమయింది. ఒంటిగంటకు ముహూర్తం షాటుతో ప్రారంభించిన పాట మొత్తం సాయంత్రం నాలుగు గంటలకు పూర్తి చెయ్యడం జరిగింది. ఆ పాటకు షాట్లు కంపోజ్ చేసిన తీరు, షాట్లు ప్లాన్ చేసిన స్పీడుకు ఆశ్చర్యపోయిన సెల్వరాజు గారు బాపు ఒక సుప్రసిద్ధ డైరక్టరు అవుతాడని ఆనాడే జోస్యం చెప్పారు. రమణ మనస్సులో కొంత కోరికున్నా జీవితాంతం డైరక్షన్ జోలికి పోలేదు. బాపే డైరక్టరు అని మనసారా అనుకున్నాడు. అప్పుడు జరిగిన సంఘటనకు నేనే సాక్షిని. బాపుకి ఈ విషయం ఇప్పటివరకూ తెలియనే తెలియదు. దాంతో సురేష్‌కుమారు నీరుకారిపోయి, డూండీ గారికి భయపడి కొన్నాళ్లు వీళ్లతో ఉన్నారు కాని, క్రమేపీ చల్లపడిపోయారు.’’ – యిదీ సీతారాముడు గారు రాసినది!
నవయుగ వారు యిచ్చిన సజెషన్స్ మరో రెండున్నాయి. ఫొటోగ్రఫీకి సెల్వరాజు వంటి సీనియర్‌ని పెట్టుకుంటే బావుంటుంది అని ఒకటి. సెల్వరాజ్ రెమ్యూనరేషన్ 16,000 ఐనా రమణ సరేనన్నారు. ‘‘కథ బావుంది కానీ కొత్తవాళ్లను పెట్టి తీయడం, పూర్తి అవుట్‌డోరులో తీయడం ప్రయోగాలు చాలు. పాటలు లేకుండా తీసే ప్రయోగం మాత్రం చెయ్యద్దు’’ గానే రమణ పాటలూ, నాట్యాలు వగైరాలను జోడించి మామూలు సినిమాగా స్క్రిప్టు తిరగరాసి చూపించారు. ముఖ్యనటులకు, టెక్నీషియన్‌లకు అడ్వాన్సులిచ్చారు. సెల్వరాజ్‌కి పదహారు వేలు, మహదేవన్‌కి పదివేలు, కృష్ణకి నాలుగు వేలు, బి.ఎన్. రెడ్డిగారి సినిమాలో హీరోయిన్ వేసింది కాబట్టి విజయనిర్మలకి ఆరువేలు – ఇలా..!
పూర్తి అవుట్ డోర్ “సాక్షి” ప్రారంభమయింది. ఖర్చులు తగ్గించుకోవాలని ఆడియో ఓ టేప్ రికార్డర్‌తో చేశారు. ‘అజ్ఞానంవల్ల, దూరదృష్టి బొత్తిగా లేనందువల్ల – సౌండు ట్రాక్ 35 ఎంఎం ఫిలిం మీద కాక – మా దగ్గర ఉన్న సౌండు టేప్ రికార్డరు మీద రికార్డింగు చేసేశాం. ఆ సౌండు ట్రాక్‌ని ఒక వరసలో పెట్టడం చాలా పెద్ద పని. టైము తీసుకునే పని. అది తెలీక – గడుసుదనం అనుకుని మూర్ఖంగా ఆ పని చేశాం’ అని రాసుకున్నారు రమణ. సినిమా సగమయ్యాక డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి రషెస్ చూస్తామన్నారు. ఈ పూర్ క్వాలిటీ ఆడియోతో చూపడం కంటే ప్రస్తుతం సౌండ్ లేకుండా చూపించి, తర్వాత మంచి ఆడియో జతపరుద్దాం అనుకుని వారికి మూకీ సినిమాలా చూపారు వీరు.
వచ్చినవారికి ఆ సినిమా అదోలా అనిపించింది. బాగా తీయలేదని వాసు గారికి చెప్పేరు. అప్పటికి ఒక లక్ష ఇచ్చిన ఆయన పెట్టుబడి పెట్టననేశారు. ఆ ఘట్టాన్ని రమణ తన ‘‘ఇంకోతి కొమ్మచ్చి’’లో యిలా వర్ణించారు – ‘బాపు, నేను, శేషగిరిరావు గారు, సురేష్ కుమార్ బెజవాడలో ఆగి నవయుగా ఆఫీసుకు వెళ్ళాం హీరోల్లాగా. పెద్దలు దర్శనం కూడా ఇవ్వలేదు. చిన్న మానేజరు వచ్చి, ‘మీ సినిమా మాకు నచ్చలేదు – మీరు వేరే ఏర్పాట్లు చూసుకోండి. మూడు మాసాల్లో మా డబ్బు మాకు ఇచ్చేయాలి’ అని చెప్పారు. గుండెలు గుభేలు మన్నాయి. కళ్లు బయర్లు కమ్మాయి. మేము చూపింది సైలెంటు రష్. ఇంకా డబ్బింగు, ఎడిటింగు, సంగీతం – ఎన్నో ఉన్నాయి కదా! ఆ పరిస్థితులన్నీ వివరించి చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు.
నాకు రోషం తన్నుకు వచ్చింది. కిందనున్న చంద్రశేఖరరావు గారి గదిలోకి దూకుడుగా వెళ్లాను. కోపం, రోషం, భయం, ఆవేశంతో ”పిల్ల నచ్చిందని చెప్పి, పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాక, ఇపుడు నచ్చలేదు వేరే చూసుకోండి అన్నారు. ఆ పిల్లనెవరు చేసుకుంటారు సార్” అన్నాను. ఆయన తలెత్తి చూశారు. ”నవయుగా వారు తీయించిన ఫిలిమును నెత్తినేసుకుని వెళ్తే ఎవరు తీసుకుంటారు? పూర్ణా పిక్చర్సా, చమరియానా, విజయానా? ఇది ధర్మం కాదండి – పెద్దవాళ్లు – సౌండుతో ఉన్న పిక్చర్ చూడకుండా – మాకొద్దు అని తీర్పు చెప్పేస్తే మేమేం కావాలి?” అన్నాను ఆవేశంతో.
రావు గారు ”మీ బాధ మాకు తెలుస్తోంది. కాని మా సమస్యలూ, ఆర్థిక సాధక బాధకాలూ చాలా ఉన్నాయి. మీరు రెండు లక్షలడిగారు. ఇప్పటిదాకా ఒక లక్షలోపే అయింది. బజెట్ సరి చూసుకుని మిగతా లక్షలో వీలయినంత తగ్గించుకుని ఎంతలో చెయ్యగలరో చెప్పండి. నేనిక్కడే ఉంటాను. మీరు ఆ వరండాలో కూర్చుని లెక్కలు వేసుకోండి. అప్పుడు వాసు గారితో మాట్లాడి చూస్తాను” అన్నారు. ఇచ్చాక, ”పాటల సౌండు జతచేసి, ఓ వారంలో పాటలూ, మీకు నచ్చిన అయిదారు సీనులూ డబ్‌చేసి చూపించండి. రెడీ చేసి పిలవండి. నేనూ, వాసుగారూ మెడ్రాసు వస్తాము” అన్నారు. అన్నట్టే వచ్చారు. చూశారు. ప్రసన్నులయ్యారు. 75వేలు ఇస్తామని పాతికవేలు ఎడ్వాన్సు ఇచ్చి పని కొనసాగించమని చెప్పారు.
సినిమా పూర్తయ్యాక బాపు ఏమనుకున్నారు? ‘‘కొసరు కొమ్మచ్చి’’లో యిలా రాసుకున్నారు – ‘మంచి కథ, అంతకు మించిన స్క్రిప్టు వుంటే, ఆ ఉత్సాహం వున్న ఎవరైనా డైరెక్టరయిపోవచ్చు అనడానికి నేను ప్రత్యక్ష’సాక్షి’ని. 1967లో ”సాక్షి” తీసేముందు అనేక సినిమాలు చూసి వుండడం తప్ప ఎవరి వద్ద దర్శకత్వ శిష్యరికం నోచుకోలేదు. ”సాక్షి” షూటింగు వారం రోజులుందనగా మామిడి తోటలో కూచోబెట్టి క్లోజ్ షాటూ, సజెషన్ షాటూ లాటివి ఎలా తీయాలో చెప్పిన గురువు కబీరుదాసు గారు (శ్రీ ఆదుర్తి వద్ద అసిస్టెంటు). రమణ గారి స్క్రిప్టు – ప్రతి సీనూ విజువలైజ్ చేసుకొని, లొకేషన్, యాక్షన్‌తో సహా వుంటుంది. స్టార్టు, కట్టు చెప్పడమూ దర్శకుడి ప్రతిభ. ”సాక్షి” సినిమా కథ, డైలాగుల వల్ల నిలిచింది గానీ, పాత్రల నటనలో నాటకీయత, ఓవరాక్షన్ లేకుండా చూడవలసిన దర్శకుని బాధ్యత బొత్తిగా కనిపించదు. నా గాడ్‌ఫాదర్ అయిన ఒక దొరగారు ”ఇఫ్ అవర్ పీపుల్ సీ యిట్, దే విల్ లాఫ్ ఎట్ ద రాంగ్ ప్లేసెస్” అన్నారు.
అదే పుస్తకంలో బాపురమణల ఫ్రెండు సీతారాముడు రాస్తూ ‘ఈ చిత్రం గుర్తింపు పొంది దేశవ్యాప్తంగా అనేక అవార్డులు వచ్చాయి. కాని ”సాక్షి” అంటే బాపు గర్వపడడు. చిత్రీకరణలో దర్శకుడి ప్రతిభ లేదని, నటనలో నాటకీయత, ఓవరు ఏక్షను చోటు చేసుకున్నాయని వాటిని తను అరికట్టలేదని అతను బాధపడుతుంటాడు.’ అని రాశారు. బిజినెస్ పరంగా ఎలా జరిగిందో రమణ ‘‘ఇంకోతి కొమ్మచ్చి’’లో రాశారు. ‘ఫస్టు కాపీ వచ్చింది. ఒకరిద్దరు శ్రేయోభిలాషులు చూశారు. తరవాత డిస్ట్రిబ్యూటర్లు చూసి బాగుందన్నారు. ఇక విడుదలే తరువాయి. ఆంధ్రా సీడెడ్ నైజాంలతో పాటు మైసూరు కూడా బిజినెస్ ఏరియా. అది కూడా అమ్మితేగాని మాకు రిలీజు కష్టం అనిపించింది. మైసూరు మీద ఇరవై పాతికవేలు వస్తుంది.
అది వస్తే, సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ అందరికీ బాకీలు పెట్టకుండా డబ్బు ఇచ్చేసి రిలీజు చేసుకున్న భాగ్యం దక్కుతుంది. బెంగుళూరులో మ్యూజిక్ సిట్టింగులు అవుతున్నప్పుడే బెనర్జీ (సురేష్‌కి బంధువు) వచ్చి పాట వరసలూ మాట వరసలూ విని ముచ్చటపడ్డారు. మైసూరు తాను కొంటానని మాట ఇచ్చారు. ఆయన వృత్తిచేత లాయరు. ఇలా సినిమాలు కొని రిలీజు చేయడం ఒక సైడ్ బిజినెస్. సినిమా అయిపోయే లోపలే ఎడ్వాన్సు ఇవ్వాలి. ఆయన ఇవ్వలేదు. ఇస్తారనుకున్నాం. కాని ఆయన అలా అనుకోలేదు. ఆ డబ్బులేందే బండి నడవదు. ఎలా?
మెయిన్ డిస్ట్రిబ్యూటరు శ్రీఫిలింస్ (నవయుగా) చిత్రం చూసి బాగుందన్నారు. రిలీజుకి తొందర పడుతున్నారు, పెడుతున్నారు. బెంగుళూరు దగాస్కర్‌ని వదులుకుని మైసూరు కొనుగోలు దారులకై భరణీ స్టుడియోలో షోలు వేస్తున్నాము. ఒకనాడు బెంగుళూరు నించి ఇద్దరు బ్రదర్స్ వచ్చారు. వారు మైసూరుకు మంచి పిక్చర్ల కోసం వెతుకుతున్న గొప్ప డిస్ట్రిబ్యూటర్ భక్తవత్సల, సురేంద్ర. వాళ్లు – వాహినీ స్టుడియో మూలస్తంభం లాటి మూలా నారాయణ స్వామి గారి తమ్ముడు మూలా రంగప్ప గారి కుమారులు. వారికి మైసూరు రాష్ట్రంలో చాలా సినిమా హాళ్లున్నాయి. డిస్ట్రిబ్యూషన్ ఉంది. వేరే చాలా పరిశ్రమలు ఉన్నాయి. వారు వచ్చి సినిమా చూశారు. షో అవగానే భక్తాగారు లేచి ”ఏక్స్‌లెంట్” అన్నారు. నేను ఆనందంతో ఆయన దగ్గరికి పరిగెత్తాను – షేక్ హాండిస్తాడన్న ఆశతో.
”వేరీజ్ ద డైరెక్టర్?” అన్నారాయన. ఓ మూల కూర్చున్న బాపుని పిలిచాను. ”యువార్ బాపూ!?!” అన్నారు భక్తా సందేహంగా చూస్తూ. బాపు తల పంకించాడు. వెంటనే రెండు చేతులా బాపుకి షేక్‌హాండిచ్చి అదిమి ఊపేశారు. ”దిసీజ్ ఎక్స్‌లెంట్. వుయార్ హాపీ. వేరీజ్ ద ప్రొడ్యూసర్?” అన్నారు. నేను ముందుకు వచ్చి దండం పెట్టాను. అప్పుడాయన దివి నుండి భువికి సూటేసుకు వచ్చిన దేవుడిలా కనిపించాడు. ఇంకో రెండు నిముషాలు మాట్లాడి సినిమాని చాలా మెచ్చుకున్నాడు. ‘ఇక్కడ చాలా సినిమాలే చూశాను. కాని ఇంత నియోరియలిస్టిక్ తరహా చిత్రం ఇదే అన్నాడు. మైసూరు ఏరియాకి ఎంత కావాలి అన్నాడు. అంతకు ముందు బెనర్జీ పదో ఇరవయ్యో ఇస్తానన్నాడు. దానికే – అప్పటి అవసరాల వల్ల – మొగ్గాను. ఈ భక్తాగారెవరో, ఎంత కావాలీ అనగానే ఆశ, నమ్మకం పెరిగాయి. ‘పాతిక’ అన్నాను ధైర్యంచేసి. ‘‘డ్డన్’’ అన్నారు భక్తా. ”బెంగుళూరు వస్తే ఎగ్రిమెంటు చేసి చెక్కిస్తాం” అన్నారు, తమ్ముడు మితభాషి సురేంద్ర.
మూడో రోజుకి శారదా మూవీస్ ఆఫీస్‌కి వెళ్లాం. అప్పటికే సురేంద్ర గారు ఎగ్రిమెంట్లు రెడీ చేశారు. సంతకాలు పెట్టారు లీగల్ పార్ట్‌నర్స్. బాపు, నేను లీగల్‌గా సైలెంటు భాగస్వాములం. భక్తా ఎగ్రిమెంటు మీద సంతకం పెడుతుంటే, అంతవరకు తలవంచుకు కూర్చున్న బాపు – ‘సార్ – వన్ మినిట్’ అన్నాడు. ఆయన సంతకం ఆపి చూశారు. ”మా పిక్చరు కొనే ముందు ఇంకోసారి ఆలోచించండి” అన్నాడు బాపు. భక్తా గారు ఆశ్చర్యంగా చూశారు. మిగతా పార్ట్‌నర్స్ ముగ్గురం అయోమయంగా చూశాం.
”ఈ పిక్చరు రాసింది రమణ గారు. తీసింది నేను. ఆయన పని ఆయన బాగానే చేశాడు గాని డైరెక్టరుగా నాకు తృప్తిగా లేదు. ‘టెక్నికల్‌గా కొన్ని లోపాలున్నాయి. దిద్దడానికి టైము లేదు; డబ్బూ లేదు. మీకు వార్నింగివ్వడం నా కనీస ధర్మం. ఆపైన మీ ఇష్టం” అన్నాడు బాపు. మాకు ప్రాణాలు పైకెగిరిపోయాయి. గుండె ఆగిపోయింది. చెమటలు పట్టాయి. భక్తా కూడా నివ్వెరపోయి గుడ్లప్పగించి చూస్తున్నారు. ”మిస్టర్ బాపూ! యు మీన్..” అన్నారు భక్తా. ”..ఐ మీన్ వాటై సెడ్” అంటూ బాపు లేచి గది బయటకు వెళ్లి పోయాడు. తలుపు తీస్తూ ఆగి ”అ యామ్ నాటె ఫూల్ – బట్ – చెప్పడం నా ధర్మం – తరవాత మీ ఇష్టం” అని తలుపు లాగేశాడు.
నేను కంగారుపడి ఏదో చెప్పబోతున్నాను. ”రమణా – డోన్‌ట్ గెట్ పానికీ” (ఖంగారు పడవద్దు) అని తలవంచుకుని చెక్కుమీద సంతకం పెట్టేశారు భక్తా. నా చేతికిచ్చారు. నేను ఒక మైకంలాటి ఆనందంలో మునిగిపోయాను. ‘‘బాయ్, ద హైట్ ఆఫ్ ఆనెస్టీ అండ్ హ్యూమన్ అండ్ ఏరోగెన్స్ – ఆల్ ఎట్ ద సేమ్ టైమ్’’ అన్నారు. ”బాపు గారు బికాం. బీ. ఎల్. కాని ఆ రూటు వదిలేశారు. బిజినెస్ ధ్యాస ఉండదు” అన్నాను నీరసంగా.
“సాక్షి” 29 రోజులాడింది. పెట్టుబడి తిరిగి వచ్చింది. పెట్టుబడి పెట్టిన వారందరికీ సంతృప్తి నిచ్చింది. “సాక్షి” దర్శకత్వం విషయంలో బాపు అభిప్రాయంతో ఏకీభవించని వారిలో ప్రముఖ దర్శక నిర్మాత ఎల్.వి. ప్రసాద్ ఒకరు. అనేక తెలుగు సినిమాలో హిందీలో రీమేక్ చేసి కీర్తి, కనకం ఆర్జించిన ఆయన “సాక్షి” సినిమా తమిళ, హిందీ రైట్స్ కొనుక్కున్నారు. “బాపు తీసినట్లే తీస్తాను తప్ప మార్చను” అన్నారు. కానీ ఎందుకో గాని తమిళ, హిందీ వెర్షన్లు తీయలేదు. 1990లలో మలయాళంలో తీద్దామని ఎవరో ముందుకు వచ్చారు కానీ ఆ ప్రయత్నమూ కార్యరూపం దాల్చలేదు.
“సాక్షి” సినిమాలో వాటాకై రమణకు 5 వేలు అప్పిచ్చిన నాగేశ్వరరావు గారు విజయం చూసి ఒకలా ఆనందించారు, మరొకలా బాధపడ్డారు. సారథి స్టూడియోలో ఓసారి బాపు, రమణలకు క్లాసు తీసుకున్నారు – “సాక్షి” నన్ను హీరోగా పెట్టి ఎందుకు తీయలేదు?” అని అడిగారు. “నాతో తీసి వుంటే దానికి ఓ కమ్మర్షియల్ లుక్ వచ్చేది. ఓపెనింగ్స్ లోనే ఒక లక్ష తేడా వచ్చేది. నాకూ ఓ మంచి సినిమా చేసిన తృప్తి ఉండేది. పారలల్ సినిమా రంధిలో పడకండి. నాకు తగిన కథ చెప్పండి. కాల్షీట్లు ఇస్తాను. మంచి సినిమా చేద్దాం” అన్నారు. అప్పుడు తయారైనదే “బుద్ధిమంతుడు” కథ. దాని విజయమే బాపురమణలను కమ్మర్షియల్ సినిమా వైపు నడిపించింది. లేకపోతే అవార్డులు చూసుకుని మురిసే పరిస్థితిలో ఉండేవారేమో! (ఫోటోలు – బాపు తొలిసారి షూట్ చేసిన మీసాల కృష్ణుడి గుడిలో కబీర్‌దాస్, సారథి, శేషగిరిరావు, బాపు, రమణ, సురేష్ 2) సాక్షి పోస్టర్ 3) తొలిసారి మెగాఫోన్ పట్టిన బాపు, 4) కనకదుర్గ, రాజబాబు, సీతారాముడులకు దృశ్యం వివరిస్తున్న బాపు, 5) భక్తవత్సల)
– ఎమ్బీయస్ ప్రసాద్
మహనీయులు బాపురమణ గార్ల గురించి ఎంత చదివినా, యెంత విన్నా, మరింత తెల్సుకుని నేర్చుకోవలసినదీ (కష్టమేననుకోండి), అబ్బురపడవల్సినదీ (ఇది సులభం) యెంతో వుంటుంది.
The storyline borrowed but in making the film Bapu being an artist brought in rare aesthetics. They are in full bloom in his latter films particularly in “Mutyalamuggu” though it was striking in mythologicals in general and “Sita Kalyanam” in particular. One can understand ANR’s concern for the duo and apprehensions about “parallel” cinema. But in their outstanding ouvre they created a kind of cinema of Bapu-Ramana that is almost unparalleled.
i like the idea of sound recording in tape recorder.
vedhava indulo krishna vijayanirmala photo ediraa
excellent article
Thank you. Chadive koddee chadavaalanipisthundhi
They both are like eyes of Human, MBS gaaru you rocked again
Recently all your articles are related to current Politics which is nothing but shit.
This is what the real Writing. Amazing and great article!
Thank you very much MBS Garu
Power star Pavan Kalyan movies quiz: https://youtu.be/4Nm6OTKSNm4
Megastar Chiranjeevi movies quiz: https://youtu.be/crQfuH0Tywc
Mega power star Ramcharan movies quiz: https://youtu.be/QEsrbd6Fd1Y
Nata Simham Balakrishna movies quiz: https://youtu.be/9hMcgg-fAig
Mahesh babu movies quiz: https://youtu.be/ciiIRnisQdE
JrNTR movies quiz: https://youtu.be/nWNhnOQYo40
AlluArjun movies quiz: https://youtu.be/dBIx1lMS6hY
Prabhas movies quiz: https://youtu.be/KmHULtleqMg
చాలా మంచి ఆర్టికల్ .బాపు రమణుల
ఏకలవ్య శిష్యుడు sarma
Thank you for giving the background and the debut struggle of Bapu-Ramana.
The storyline is borrowed but in making of the film, Bapu being an artist, brought in rare aesthetics. They are in full bloom in his latter films particularly in “Mutyalamuggu” though it was more prominent in mythologicals in general and “Sitakakyanam” in particular. One can understand ANR’s concern for the duo and apprehensions about “parallel” cinema. But in their outstanding ouvre they created the Bapu-Ramana cinema which is almost unparalleled.
U want bold cal number in dp
Service estanu number in my dp
మీకు కావాల్సింది నా dp లొ వుంది
Sorry for the typo. It’s “Sitakalyanam.”
సినిమా అనేది కేవలం నమ్మకం తో నడిచే గ్యాంబ్లింగ్ లాంటిది అనేది అర్థం అవుతోంది.