'ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించగలరు..' (లవకుశ) పాట వినగానే కళ్లముందు విషణ్ణవదనంతో లక్ష్మణుడు కదలాడతాడు. దృశ్యంలో సీతాదేవికూడా వున్నా ఆవిడ హుషారుగానే వుంటుంది. భర్త వదిలేస్తున్నాడని తెలియదుగా! ఇటు లక్ష్మణుడు మాత్రం మనసులో బాధపడుతూ, అది బయటకు కనబడకుండా దాన్ని అణుచుకుంటూ వుంటాడు. అణుచుకుంటున్నాడన్న సంగతి ప్రేక్షకుడికి అర్థమయ్యి జాలి పడుతూంటాడు. ఆ పాత్రలో కాంతారావు జీవించారంటే అతిశయోక్తి కాదు. ఎన్టీరామారావు రాముడిగా, అంజలి సీతగా తెలుగువారి హృదయాల్లో ఎలా ముద్రవేసుకున్నారో, లక్ష్మణుడిగా కాంతారావూ అంతే! పక్కనున్న ''లవకుశ'' క్యాలండర్ చూడండి.
అయితే ''లవకుశ''లో ఆ పాట అభినయంలో కొంత క్రెడిట్ రథం సాగిన ఆ రోడ్డుకి కూడా యివ్వాలంటారు కాంతారావు. ఆ సీను తీసేందుకు వాళ్లు ఎంచుకున్న బాటనిండా గతుకులేట. దానిపై రథం వెళుతూంటే ఎగిరెగిరి పడడమేట. దానికి తోడు యీయన మెడలో, ఛాతీమీద, భుజాలమీద ఇత్తడి నగలు వేసుకున్నాడు. పైన కిరీటం సరేసరి. ఆ పైన సూర్యుడు ముందే వున్నాడు. రథం గుంటలో పడి ఎగిరినప్పుడల్లా ఈ నగలు శరీరానికి గుచ్చుకునేవి. అమ్మో అనడానికి వీల్లేదు. బాధ అణుచుకోవాలి. ఎంత అణుచుకున్నా మొహం మీద కాస్తంతైనా కనబడుతుంది కదా. అదృష్టవశాత్తూ అది ఆ దృశ్యానికి చక్కగా అమరింది.
ఈ శారీరకమైన బాధతో బాటు, కాంతారావుకి మనసులో మరొక బాధ కూడా వుంది ''లవకుశ'' విషయంలో. తనెంత కష్టపడి ఆ పాత్ర దక్కించుకున్నారో ఆయనకే తెలుసు. ''దేవాంతకుడు'' (1960) అనే సోషియో ఫాంటసీ సినిమాలో రామారావు సోషల్ హీరోగా, కాంతారావు విష్ణువుగా వేశారు. ఆ వేషంలో కాంతారావును చూసిన డైరక్టర్ సి.పుల్లయ్యగారు ముగ్ధుడైపోయి ''రామారావు తర్వాత పౌరాణిక పాత్రలకు వీడు అంతగానూ సరిపోతాడు. నా తర్వాత పౌరాణిక చిత్రంలో వీడికి మంచి వేషం యిస్తాను.'' అన్నారు. ఆ తర్వాతి చిత్రమే ''లవకుశ''. ఈయనే దర్శకుడు. అయితే నిర్మాత శంకరరెడ్డికి కాంతారావుకి లక్ష్మణుడి పాత్ర యివ్వడం యిష్టం లేదు. అందువల్ల కాంతారావును సినిమాలోకి తీసుకుంటూనే స్క్రిప్టు చేతిలో పెట్టినపుడు కాంతారావు ధరించే పాత్రను ప్రస్తావించలేదు. ఇది కాంతారావును బాధించింది.
కాంతారావు సినీసీమను వదిలేసి వెళ్లిపోదామనుకున్నపుడు ''జయసింహ'' (1955) సినిమాలో తన తమ్ముడి పాత్రకు బుక్ చేసి ఆయనను నిలబెట్టినది రామారావు గారే. ఇప్పుడుకూడా తన తెర అన్నగారి వద్దకు వెళ్లి కాంతారావు మొరపెట్టుకున్నారు. వెంటనే రామారావు అభయహస్తం యిచ్చి, శంకరరెడ్డికి స్వయంగా ఫోన్ చేసి ''కాంతారావుకి లక్ష్మణుడి పాత్ర యిస్తున్నారా? లేదా?'' అని అడిగారు. పైగా సోదరుడు త్రివిక్రమరావుచేత ''మీరు మాట తప్పినట్లయితే రామారావుగారు బాధపడతారు.'' అని చెప్పించారు. దాంతో నిర్మాత ''సరే, సరే'' అని వాళ్లకు చెప్పి కాంతారావుతో ''ఇంత చిన్న విషయానికి రామారావు వద్దకు పరిగెత్తితే ఎలాగయ్యా! ఇలాగైతే నీతో వేగడం కష్టమే'' అన్నాడు.
ఇంత హంగామా చేసిన నిర్మాత దగ్గర సినిమా మధ్యలోనే డబ్బు అయిపోయింది. సినిమా ఆగిపోయింది. డైరక్టర్ పుల్లయ్యగారు మరణించారు. 'పుల్లయ్యగారబ్బాయి సియస్ రావు గారిచేత పూర్తి చేయిస్తా' అంటూండేవాడు నిర్మాత. ఈ లోపున కాంతారావుకి యిస్నోఫీలియా వచ్చి దగ్గు, ఆయాసం మొదలయ్యాయి. క్రమేణా కృశించి, సన్నగా, పూచికపుల్లలా తయారయ్యారు. ఇదే అదననుకున్నాడు శంకరరెడ్డి. ''సినిమా మళ్లీ మొదలెడదామనుకుంటున్నాను. మీరు చూడబోతే యిలా తయారయ్యారు. రామారావుగారి పెర్శనాలిటీ పక్కన మీది ఆనదు. మీరు లక్ష్మణుడుగా పనికిరారు. కానీ మీకు వేషం యిస్తానని మాట యిచ్చాను కాబట్టి, శత్రుఘ్నుడి వేషం యిస్తాను. సరేనా?'' అని మడతపేచీ వేశాడు. ఈయన ఏమనగలడు? నోరు పెగల్చుకుని ''నాకో నెలరోజులు గడువివ్వండి.'' అని చెప్పేసి రిక్షాలో యింటికి బయలుదేరాడు.
నిజానికి కాంతారావుకి యింతకుముందు కూడా యిస్నోఫీలియా రావడం, ఓ డాక్టరుగారి పుణ్యాన అది తగ్గడమూ జరిగింది. అనుకోకుండా ఆ డాక్టరుగారు మద్రాసు వచ్చి, యీయన్ని పలకరించి పోదామనుకుని యిల్లు తెలియక రిక్షాలో తిరుగుతూ యీయన రిక్షాకు ఎదురవడం జరిగింది. ఆయన గతంలోలాగానే 'ఆర్శనిక్' యింజక్షన్ కోర్సు యిచ్చి, 'నెల్లాళ్లపాటు మద్రాసు వాతావరణానికి దూరంగా వుండండి. రోజూ మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకుని, బీరు తాగి, రెస్టు తీసుకోండి.' అని సలహా యిచ్చాడు. సరిగ్గా అదే సమయంలో ఒకాయన మైసూరులో ''భక్త చేత'' అనే కన్నడ సినిమా తీస్తూ కాంతారావును కృష్ణుడి వేషానికి బుక్ చేసుకున్నారు. ''నాకు పారితోషికం ఏమీ వద్దు కానీ, నెలరోజులపాటు, మంచి హోటల్‌లో వుంచి, తిండీ, తాగుడూ భరిస్తే చాలు'' అన్నాడీయన. ముప్పూటలా తిని, హాయిగా నిద్రపోయేసరికి నెల్లాళ్లలో యీయన కండబట్టి, నున్నగా తయారయ్యాడు. పక్కగదిలో బస చేసిన కన్నడ హీరో రాజ్ కుమార్ యీయనలో మార్పు చూసి తెల్లబోయాడు.
నెల్లాళ్ల షూటింగు పూర్తయింది. మంచం కింద గుట్టలుగా వున్న ఖాళీ బీరుసీసాలను బయటకు తీసి అమ్మిస్తే మద్రాసుకు రైలు టిక్కెట్టు వచ్చింది. ఇంటికి వచ్చి స్నానం చేసి ఆయన నేరుగా శంకరరెడ్డి ఆఫీసుకి వెళ్లి ''ఎలా వున్నాను సార్?'' అని పలకరిస్తే ఆయన కాస్సేపు గుర్తుపట్టలేక, గుర్తుపట్టాక ''అచ్చు రామారావుకి తమ్ముడిలా వున్నావ్. ఇక లక్ష్మణుడి పాత్ర నీదే!'' అనేశాడు. అంతేకాదు, తన తర్వాతి సినిమా ''రహస్యం'' (1967)లో కూడా కాంతారావుకి మంచి పాత్ర యిచ్చాడు. ఇదంతా కాంతారావు తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆ ఏడాది (1963) జాతీయ బహుమతుల్లో ''లవకుశ'' సినిమాలో లక్ష్మణుడి పాత్రకుగాను కాంతారావుకు డా. రాధాకృష్ణన్ చేతులమీదుగా ఉత్తమ సహాయనటుడి అవార్డు లభించింది. ఆ పాత్రకోసం ఆయన పడిన కష్టాలకు రివార్డు లభించింది. (సశేషం) (ఫోటో – కాంతారావు)
-ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)