అక్రమసంబంధాలు.. అనైతిక వ్యవహారాల గురించి చర్చలు చేపడుతూ.. అలాంటి వివాదాల పాలైన కుటుంబాలను సంస్కరించే పనిలో బిజీగా ఉన్నారు దక్షిణాది మాజీ హీరోయిన్లు. ఒక భాషలో కాదు ఇప్పుడు.. దక్షిణాది భాషలన్నింటిలోనూ మాజీ హీరోయిన్లు ఇలాంటి పంచాయితీలు పెట్టుకుంటున్నారు. గ్రామీణ పేద కుటుంబాల్లోని వివాదాలను టీవీలకు ఎక్కించి.. భార్యభర్తల మధ్య తగాదాలను పరిష్కరిస్తామంటూ వీళ్లు ఈ చేపట్టిన కార్యక్రమాలకు వీక్షకాదరణ బాగానే ఉన్నట్టుంది. సౌత్ లో చాలా చానళ్లలో ఇలాంటి కార్యక్రమాలు వస్తుండటమే దీనికి రుజువు.
మరి ఈ వివాదాలను పరిష్కరిస్తున్న.. పంచాయితీలు చేస్తున్న హీరోయిన్ల అర్హతలు ఏమిటి? అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయమే. ఫ్యామిలీ కౌన్సిలర్లుగా విజృంభిస్తున్న వీళ్ల వ్యక్తిగత వివాదాలను పరిశీలించి చూస్తే.. వీళ్లా తీర్పులిచ్చేది అనిపిస్తుంది! ఎందుకంటే.. తెలుగులో ఈ తరహా కార్యక్రమం నిర్వహిస్తున్న ఒక హీరోయిన్ ఒక కాలంలోనే భర్తకు విడాకులు ఇచ్చింది.. రెండో పెళ్లి చేసుకుని సెటిలైంది. మరి ఆమె ఆ అనుభవ సారంతో.. భార్యభర్తల తగదాలను, అనైతిక వ్యవహారాలను పరిష్కరిస్తున్నట్టుగా ఉంది.
ఇక ఒక మలయాళ భాషల్లో ఈ తరహా కార్యక్రమంలో ఆ భాష నటి ఊర్వశి కనిపిస్తోంది. అక్కడా ఇదే గొడవ. ఇలాంటి వివాదాలనే ఊర్వశి పరిష్కరిస్తోంది. మరి ఇప్పుడైతే తీర్పులిస్తోంది కానీ.. మొన్నటి వరకూ కోర్టుల చుట్టూ తిరిగింది ఊర్వశి. భర్తతో విడాకుల విషయంలో ఆమె కోర్టు చుట్టూ తిరిగింది. చివరకు వివాదం పరిష్కారమైంది.. విడాకులు తీసుకుని భర్త నుంచి వేరు పడింది ఊర్వశి. మరి తన వ్యక్తిగత వివాదం గురించి కోర్టుకు ఎక్కిన ఊర్వశి ఇప్పుడు ఇతరుల వ్యక్తిగత వివాదాల గురించి తీర్పులిస్తుండటం విశేషం కాదా మరి!