తను హీరోయిన్ అని.. ఆమె సన్నిహితులకే తెలీదట!

“సురభి''… ఎక్స్ ప్రెస్ రాజాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్న నటి. తమిళ సినిమా వీఐపీ డబ్బింగ్ తో తెలుగువారికి పరిచయం అయిన సురభికి 'బీరువా' వంటి స్ట్రైట్ సినిమా లో చేసే అవకాశం…

“సురభి''… ఎక్స్ ప్రెస్ రాజాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్న నటి. తమిళ సినిమా వీఐపీ డబ్బింగ్ తో తెలుగువారికి పరిచయం అయిన సురభికి 'బీరువా' వంటి స్ట్రైట్ సినిమా లో చేసే అవకాశం దక్కింది. కానీ.. ఆ సినిమా అంతగా ఆడలేదు. ప్లాఫుల జాబితాలో నిలిచిపోయింది. అయితే ఆ సినిమాలో సురభి ఆకట్టుకుంది. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఇలాంటి వాటిలో ఒకటి గా నిలిచిన ఎక్స్ ప్రెస్ రాజాతో సురభికి కలిసొచ్చే కాలం మొదలైంది.

అంతేగాక ఇప్పుడు సురభి నటించిన మరో సినిమా 'అటాక్' విడుదలకు సిద్ధం అయ్యింది. మరి అదెలాంటి ఫలితాన్నిస్తుందో కానీ.. ఇప్పుడు సురభి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతోంది. తను హీరోయిన్ అనే మాట తనవారెవరికీ తెలియదని సురభి చెబుతోంది. తన సన్నిహితులకు కూడా ఈ విషయం గురించి తెలియదని ఆమె చెబుతోంది. సురభిది ఢిల్లీ.. దేశ రాజధాని నుంచి దక్షిణాదికి హీరోయిన్ దిగుమతి అయ్యింది ఈ భామ. ఎంతైనా అక్కడ సౌతిండియన్ సినిమాలను పట్టించుకునే వాళ్లు తక్కువమందే ఉంటారు కదా!

దీంతో సురభికి తన సన్నిహితుల మధ్యనే పెద్దగా గుర్తింపు లేదట. తను నటించిన తమిళ సినిమా పోస్టర్లను ఆన్ లైన్లో చూపితే తన స్నేహితురాళ్లు ఆశ్చర్యపోయారని.. తను ఇక్కడ హీరోయిన్ అంటే వాళ్లు వింతగా చూశారని.. సురభి వివరించింది. ఇప్పడిప్పుడే తనకు తన వాళ్ల మధ్య గుర్తింపు వస్తోందని.. తనను హీరోయిన్ లా చూస్తున్నారని సురభి చెప్పుకొచ్చింది. మరి ఏకంగా తమిళ, తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నా… సురభికి సొంత వాళ్ల మధ్య గుర్తింపు లేకపోయింది పాపం!