తెలుగు సినిమా రంగంలో అనేక సినిమాలు నవలలనుండి తయారయ్యాయి. ఓ పుస్తకాన్ని అలాగే సినిమాగా తీసేయడానికి వీలులేదు. ఎందుకంటే పుస్తకాన్ని చదువుతాం. సినిమాను చూస్తాం. పుస్తకం వినోదప్రధానంగా వుండనక్కరలేదు, సినిమా మాత్రం వినోదప్రధానంగా చదువురానివాడిని సైతం మెప్పించేట్లు వుండాలి. సినిమా అయితే ప్రేక్షకుణ్ని వూహల్లో తేలించవచ్చు. హీరోని డబుల్‌రోల్స్‌లో చూపించవచ్చు. ఒకళ్ల స్థానంలోకి మరొకరు వెళ్లిపోయినట్టు చూపించవచ్చు. నిజజీవితంలో అలా జరగదు కాబట్టి పుస్తకాల్లో అలా రాస్తే నప్పదు. పుస్తకం వాస్తవానికి కాస్త దగ్గరగా వుంటుంది. అందువల్ల పుస్తకాన్ని సినిమాగా తీసినప్పుడు కొన్ని మార్పులు, చేర్పులు చేస్తూంటారు. యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన 'నల్లంచు తెల్లచీర' అనే పుస్తకం ఆధారంగా 'దొంగమొగుడు' సినిమా ఎలా తయారైందో చూద్దాం.
పుస్తకంలో కథానాయకుడు ఓ బట్టల వ్యాపారి. అతను ఒకప్పుడు అతి బీదవాడు. మేనమామతో బాటు వీధిలో తిరిగి నెత్తిమీద బట్టలమూట పెట్టుకుని తిరిగినవాడు. అయితే అతనికున్న యీస్తటిక్స్ కారణంగా, తెలివితేటల కారణంగా చాలా త్వరగా పైకి వచ్చాడు. ఊరంతా అతన్ని మెచ్చుకునేవారే. అయితే అతని భార్యకు మాత్రం అతనిపై చిన్నచూపు. అస్తమానూ సతాయిస్తూ వుంటుంది. అతనికి యింట్లో సుఖం లేదు. అలాటి ఫ్రస్ట్రేషన్‌లో వుండగా అతనిపై అతని ప్రత్యర్థులు ఓ వల విసురుతారు. ఆ వలలో అతను పడి చిక్కుల్లో పడతాడు. అతనిపై హత్యానేరం పడుతుంది. అతను బయటపడి హీరో ననిపించుకుంటాడు. ఈ కథను నవలలో ఒకలా చూపితే, సినిమాలో మరోలా చూపారు.
సినిమా ''రవితేజా టెక్స్‌టైల్స్'' అధిపతి చిరంజీవి అన్న దశలో ప్రారంభమవుతుంది. కానీ నవలలో అతను యీ దశకు ఎలా చేరాడో విపులంగా చెప్పడం జరిగింది. హీరో ఓ బట్టలషాపులో సేల్స్‌మన్ వుద్యోగాన్ని అన్యాయంగా పోగొట్టుకున్న తర్వాత సొంతంగా చీరలమీద ఆప్లిక్ వర్క్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడు శర్మ అనే పెద్ద టెక్స్‌టైల్స్ మిల్లు యజమాని యితన్ని భాగస్వామిగా చేర్చుకున్నాడు. శర్మకు గుఱ్ఱప్పందాల పిచ్చి. ఆ పిచ్చితో కంపెనీ సర్వనాశనం చేయబోతూవుంటే ఒక పథకం వేసి, అతనిచేత ఎగ్రిమెంటు రాయించుకుని అతనికి పగ్గాలు వేశాడు హీరో రవితేజ. దాంతో కంపెనీ పైకి వచ్చి అందరూ బాగుపడ్డారు.
సినిమాలో ఈ శర్మ కారెక్టరు తీసేశారు. రవితేజ కష్టపడి పైకి వచ్చేశాడు అన్నట్టు చూపించేశారు. రవితేజ పైకి వస్తూంటే అప్పటిదాకా టెక్స్‌టైల్ మార్కెట్‌లో వెలుగుతున్న చెంచురామయ్య (రావు గోపాలరావు) వ్యాపారం దెబ్బ తినసాగింది. అతను పగబట్టాడు. నవలలో అతను వేర్వేరు రకాలుగా దెబ్బ కొట్టడానికి చేసిన ప్రయత్నాలను వర్ణించారు. సినిమాలో అవేమీ చూపకుండా యాక్షన్ సీన్ పెట్టేశారు. ఓ టెండర్‌లో అతను సమయానికి చేరకుండా చేయడానికి చరణ్‌రాజ్ అనే గూండా ద్వారా మనుష్యులను ఏర్పాటు చేశాడు. గూండాలు చిరంజీవి కారును అడ్డగించారు. అయితే అతన్ని రెండో చిరంజీవి వచ్చి రక్షించాడు. ఇది నవలలో లేని పాత్ర. ఈ రెండో చిరంజీవి పేరు నాగరాజు. స్టంట్‌్‌మాస్టర్. పేదవాడు. చదువూ సంధ్యా లేనివాడు. అతనికో అక్క. జయంతి. చిన్న చిన్న మోసాలు చేసి డబ్బు సంపాదిస్తూ వుంటాడు. అతనికి ప్రత్యర్థిగా వుండి తర్వాత సన్నిహితమైన రాధిక అతనికి తోడుగా వుంటుంది. అతను అనుకోకుండా యిటువైపు వచ్చి కండబలం వున్నవాడు కాబట్టి ఫైట్ చేసి రక్షించాడు. ఫైట్ తర్వాత వాళ్లిద్దరూ మనం యిద్దరం ఒకేలా వున్నామే అని అనుకున్నారు. రవితేజకు వూరంతా పేరే కానీ భార్య ప్రేమ మాత్రం దక్కలేదు. ఆమెకు విపరీతమైన అహంభావం. తోడుగా పొగరుబోతు తల్లి, దగుల్బాజీ తమ్ముడు. ఆమెకు భర్తను చూస్తే తేలికభావం. అతను అభిమానంతో యిచ్చిన కానుకలు కూడా తిరస్కరిస్తూంటుంది. దాంతో అతను విసిగిపోతూ భార్య పట్ల విముఖత పెంచుకుంటాడు.
ఓ కార్పోరేట్ అధిపతికి యింట్లో గొడవలుంటే అవి అతని పతనానికి ఎలా దారి తీస్తాయో నవలలో చూపించారు. ఇలాటి పరిస్థితిలో రవితేజ తన కొత్త సెక్రటరీ వలలో పడ్డాడు. ఇంత గుణవంతుడు, తెలివైనవాడు అలా ఎలా పడ్డాడు అన్న అనుమానం వస్తుంది కదా. దానికి నవలలో చక్కటి భూమిక ఏర్పరచారు. హీరో తన భార్య అనుమానించే స్వభావంతో విసిగిపోయి వున్నాడు. ఆమె ఆఫీసుకి వచ్చి వుత్తి పుణ్యానికి అనుమానించి అతని పరువు తీస్తూ వుంటుంది. అంతేకాదు, చెంచురామయ్య తన బిజినెస్ దెబ్బ కొట్టడానికి చేసిన ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి కష్టపడుతూవుంటే సానుభూతి చూపదు సరికదా సూటిపోటి మాటల్తో నొప్పిస్తుంది. ఆ సమయంలో అతనికి ఓ అజ్ఞాత ప్రేయసి వుత్తరం రాస్తుంది. ఇతను 15 ఏళ్ల క్రితం రోడ్డుపై బట్టలు అమ్మే రోజుల్లో ఆమెకు చీర ఎలా కట్టుకోవాలో నేర్పాడు. తనను తాను అందంగా ఎలా ప్రెజంట్ చేసుకోవాలో చెప్పాడు. ఓ పావుగంట పరిచయమే. కానీ ఆమె ముగ్ధురాలై పోయింది. తన కంటె ఐదేళ్లు చిన్నవాడైన హీరోకి ఓ ముద్దిచ్చింది. ఆమెను హీరో మళ్లీ చూడలేదు కానీ, ఆమె మాత్రం హీరో ప్రగతిని గమనిస్తూనే వుంది. దైవవశాత్తూ ఆమె వేరెవరో కాదు. రవితేజ సీనియర్ పార్ట్‌నర్ శర్మ భార్యే. కానీ హీరోకు ఆమె గురించి ఐడియా లేదు. హీరోకి, అతని భార్యకు గొడవలు తారస్థాయిలో వున్నపుడు ఆమె తనెవరో చెబుతూ ఓ ప్రేమలేఖ రాసింది. ఓ హోటల్లో కలవమంది. తనకేం కావాలో తెలియని స్థితిలోనే మానసికమైన వూరట కోసం ఇతను వెళ్లాడు. కానీ ఆమె తెగించలేకపోయింది. ఇది ఏ ఎఫైర్‌కు దారి తీస్తుందోనన్న సందేహంతో ఆమె వెనుకంజ వేసింది. ఆ విషయం వుత్తరం ద్వారా తెలియజేసింది. ఆ ఆశాభంగం యితన్ని కృంగదీసింది.
సరిగ్గా అదే టైములో సుధాకర్ అనే ఒకడు అతని భార్యకు ప్లేటోనిక్ లవ్ అంటూ తగులుకున్నాడు. అతను సవ్యమైన వాడు కాడని యితను చెప్పినా ఆమె వినలేదు. అతని మాయలో పడింది. ఇటువంటి పరిస్థితిలో ప్రియంవద అని కొత్త సెక్రటరీ వచ్చి చేరింది. నిజానికి ఆమె అతని శత్రువులు పంపిన మనిషి. ఆమె అక్కడ వచ్చి చేరేందుకు అనువుగా పాత సెక్రటరీకి యాక్సిడెంటు చేయించినట్టు నవలలో రాశారు. నవలలో యిక్కడ వ్యాపారపరమైన కాంప్లికేషన్సు చాలా పెట్టారు.
సినిమాలో అదేం చూపలేదు. కొత్తామె వస్తూనే రొమాంటిక్ వేషాలు వేయసాగింది. సినిమాలో ఆ పాత్ర వేసినది భానుప్రియ. ఆమె చాలా చొరవ తీసుకుని రవితేజను ముగ్గులోకి దించింది. రవితేజకు మోహం కలిగింది. ఆమెతో రిలాక్స్ కావాలనిపించింది. సెక్రటరీ సై అంది. దాంతో యితనికి ఓ ఐడియా వచ్చింది. ఈమెను తీసుకుని బొంబాయి తీసుకెళ్లి ఓ హోటల్లో వుండి ఎంజాయ్ చేస్తే బాగుంటుందని. తన పోలికలతో వున్న నాగరాజు గుర్తుకు వచ్చాడు. 'ఓ యిరవై వేలిస్తాను, నా బదులు కోయంబత్తూర్‌లో కాన్ఫరెన్సుకి వెళ్లు. అక్కడ నేనెవరికీ తెలియదు కాబట్టి తేడా గుర్తుపట్టలేరు' అని అడిగాడు. నాగరాజు ఓయస్ అన్నాడు. అయితే ఆఖరి నిమిషంలో కోయంబత్తూర్ కాన్ఫరెన్సు కాన్సిలయింది. ఇక నాగరాజు చచ్చినట్టు ఆఫీసులోనూ, ఇంట్లోనూ రవితేజలా నటించవలసి వచ్చింది. ఇక్కడ బోల్డంత హాస్యం పెట్టారు. ఇదంతా నవలలో లేనిదే! ఆఫీసులో కంప్యూటరు మీద పనిచేస్తున్న క్లర్కును చూసి టీవీ చూస్తున్నావేం అంటాడు. ఇంటికి వెళ్లి అత్తగార్ని చూసి రవితేజ భార్య అనుకుంటాడు. బావమరిదిని ఓ రెండు పుచ్చుకుంటాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)