బాలయ్య ‘వెన్నుపోటు’.. టైటిలెలా వుంది.?

తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించబోతున్నానని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించి, పెద్ద కలకలమే సృష్టించారు. తెలుగు రాజకీయాల్లో 'వెన్నుపోటు'కి బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరంటే,…

తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించబోతున్నానని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించి, పెద్ద కలకలమే సృష్టించారు. తెలుగు రాజకీయాల్లో 'వెన్నుపోటు'కి బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరంటే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి పేరే చెబుతారు. వెన్నుపోటు రాజకీయాలతో, స్వర్గీయ ఎన్టీఆర్‌కి టీడీపీని దూరం చేసి, ఆ టీడీపీని తాను సొంతం చేసుకున్న ఘనుడు చంద్రబాబు. 

స్వ్గర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర అనగానే, అసలు ఆ చరిత్రలో స్వర్గీయ ఎన్టీఆర్‌ రాజకీయ పతనం సంగతేంటి.? అన్న ప్రశ్న ముందుగా ఉత్పన్నమవుతుంది. ఎన్టీఆర్‌ని మహోన్నతమైన వ్యక్తిగా చూపించాలంటే, ఆయన చివరి రోజుల్లో నెలకొన్న సంఘటనల్ని చూపించకూడదు. ఇది, ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి చెబుతున్నమాట. అదే సమయంలో, ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాలనుకున్నప్పుడు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటుని కూడా చూపిస్తేనే అది 'పరిపూర్ణం' అవుతుందన్నది ఆమె వాదన. 

కావాలనే కెలికారో, అనుకోకుండా మాట్లాడేశారోగానీ, బాలకృష్ణ సినిమాగా స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర.. అంటూ చేసిన ప్రకటన ఇప్పుడు చంద్రబాబు కోటరీలో ప్రకంపనలు సృష్టించేస్తోంది. పైగా, బాలకృష్ణ ఆషామాషీగా ఏమీ ఆ ప్రకటన చేసెయ్యలేదు, 'రీసెర్చ్‌ చేస్తున్నాం..' అని ప్రకటించారు. 'రీసెర్చ్‌' అంటే చిన్న విషయం కాదు కదా.. అన్ని తెరచాటు వ్యవహారాలూ వెలుగులోకి రావాల్సి వుంటుంది.! 

దేశ రాజకీయాల్లోనే అత్యంత దారుణమైన 'ముగింపు' ఎన్టీఆర్‌ జీవితంలో చోటు చేసుకుంది. తెలుగు నేల ఆయన సొంత కుటుంబం.. అలాంటిది, సొంత కుటుంబంలోనే ఆయనకు అంతా పరాయివారైపోయారు. ఆనాటి ఆ ఘటనలకు కారణమెవరో కాదు, స్వయానా ఆయన అల్లుడు చంద్రబాబే. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి, తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, ఎక్కడా అసలు ఎన్టీఆర్‌ పేరు విన్పించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పదవి కోల్పోయాక మాత్రం ఆయనకు ఎన్టీఆర్‌ గుర్తుకొచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ జపంలో మునిగి తేలుతున్నారు చంద్రబాబు. ఇవన్నీ, ఖచ్చితంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్రలో వుంచాల్సిందే. 

అన్నట్టు, చంద్రబాబుకి ఝలక్‌ ఇవ్వాలంటే బాలకృష్ణకి ఇదే రైట్‌ టైమ్‌. స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఒక్కటి చాలు.. రాజకీయంగా చంద్రబాబుని దెబ్బకొట్టడానికి. కానీ, అంత రిస్క్‌ బాలయ్య చేస్తారా.? ఛాన్సే లేదు. ఎందుకంటే, తన కుమార్తెను, చంద్రబాబుకి కోడల్ని చేసేశారు కదా.! కాబట్టి, స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితంలో 'అసలు కోణం' తప్ప, అన్నీ బాలకృష్ణ చూపించేయొచ్చు. కానీ, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. మామకి అల్లుడు వెన్నుపోటు పొడవగా లేనిది, బావకి బావమరిది 'వెన్నుపోటు' పొడవకూడదా.? ఆ ఆలోచన వస్తే మాత్రం, ఎన్టీయార్‌ జీవిత చరిత్రకి 'వెన్నుపోటు' పెర్‌ఫెక్ట్‌ టైటిల్‌.