షిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ సినిమాలు నిర్మించడం తమ భాగ్యమని నిర్మాత, ఎఎమ్ఆర్ గ్రూప్ అధినేత ఎ మహేష్ రెడ్డి అన్నారు. ఎన్ని వ్యాపారాలు, ఏ లెవెల్ లో చేసినా, ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించినా రాని పేరు, కేవలం రెండు భక్తిరస చిత్రాలు నిర్మించడంతో వచ్చిందని, ఇది భగవత్ కృప తప్ప వేరే కాదని ఆయన అన్నారు. స్వతహాగా బాబాకి పరమ భక్తుడైన మహేశ్ రెడ్డి తొలిసారి నిర్మాతగా మారి అక్కినేని నాగార్జున-దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో 'షిరిడిసాయి' చిత్రాన్ని నిర్మించారు. కొంత విరామం తర్వాత అక్కినేని నాగార్జున-కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ రిపీట్ చేస్తూ హాథీరాం బాబా జీవిత కథతో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కథాంశం…
గోవిందుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి మహాభక్తుడైన హాథీరామ్ బాబాజీ పుణ్య చరిత్రే ప్రధాన కథాంశం. వేంకటేశ్వర స్వామికి హాథీరామ్ బాబాజీకి మధ్య జరిగే రసవత్తర ఘట్టాలను ఈ సినిమాలో చూపించాం. దీనికి కృష్ణమ్మ చరిత్రను కూడా జోడించాం. తిరుపతి కొండపైన హాథీరాం బాబా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసారు? పూజలు, పునస్కారాలు, వెన్నతో దీపం వెలిగించడం, ఆ కాలంలో అక్కడ పాలనా వ్యవహారాలు ఎలా వుండేదనేది సినిమాలో క్లియర్గా చూపించాం.
ప్రాజెక్ట్ పట్టాలెక్కిందిలా…
ఈ కథని ఫస్ట్ జె.కె.భారవిగారు రాఘవేంద్రరావుగారికి చెప్పారు. ఆయనకి బాగా నచ్చడంతో సినిమా తీయాలనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే వెంటనే వెంటనే, తీస్తాను అని చెప్పాను. బాబా భక్తుడైన నేను నాగార్జున-రాఘవేంద్రరావుగారి కాంబినేషన్లో 'షిరిడిసాయి' చిత్రాన్ని నిర్మించాను. ఆ చిత్రంతో నేను, నాగార్జున బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. మా కుల దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సినిమా రూపొందించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నా కోరిక ఈ సినిమాతో తీరింది.
సినిమా ఎలా వచ్చింది?
రీ-రికార్డింగ్ లేకుండా నేను సినిమా చూశాను. చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా చూస్తుంటే నా కళ్లవెంట నీళ్లు వచ్చాయి. ఇలాంటి అద్భుతమైన చిత్రానికి నేను నిర్మాతనైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను.
టెక్నికల్ స్టాండర్డ్స్..
500 సంవత్సరాల క్రితం తిరుపతి ఎలా ఉండేదో అలా నేచురల్గా షూటింగ్ చేయడానికి టెక్నికల్గా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ముఖ్యంగా గోపాల్రెడ్డిగారు చిక్ మంగళూరులోని స్మాల్ విలేజెస్లో లొకేషన్స్ ఫైనల్ చేశారు. ఆ గోవిందుడు మా యందు ఉండి షూటింగ్ అంతా చక్కగా జరిపించుకున్నాడు. వాటర్ ఫాల్స్, చిన్న చిన్న సీన్స్లో సి.జి. వర్క్ వుంటుంది తప్ప ఎక్కువగా గ్రాఫిక్స్ వుండవు. అంత నేచురల్గా సినిమా వుంటుంది.
వెంకటేశ్వరునిగా సౌరభ్ జైన్..
చాలామందిని అనుకున్న తర్వాత గోపాల్రెడ్డిగారు సౌరభ్ జైన్ని తీసుకొచ్చాడు. అతను ముందు చెయ్యను అన్నారు. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు చేస్తూ, డివోషనల్ చేయాలా అని సందేహించాడు. అప్పుడు నాగార్జునగారు మూడు కమర్షియల్ హిట్స్ తర్వాత నేను ఈ సినిమా చేస్తున్నాను. నీకు మంచి పేరు వస్తుంది. ఆ తర్వాత కమర్షియల్ సినిమాలు చేయొచ్చు అని చెప్పగానే ఇమ్మీడియెట్గా చేస్తాను అని ఒప్పుకున్నాడు సౌరభ్. వేంకటేశ్వర స్వామిగా చాలా యంగ్గా అందంగా నటించాడు.
ఆడియో రెస్పాన్స్…
నాగార్జున-రాఘవేంద్రరావు, కీరవాణిలది మ్యూజికల్ హిట్ కాంబినేషన్. వారి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు అన్నీ మ్యూజికల్గా పెద్ద హిట్ అయ్యాయి. ఒక ప్రక్క 'బాహుబలి-2'కి వర్క్ చేస్తూ కూడా ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ని కంపోజ్ చేశారు. రీ-రికార్డింగ్ మహాద్భుతంగా చేశారు. ఆడియో విన్నాక కీరవాణిగారికి లైఫ్లాంగ్ రుణపడి వుంటాను సార్ అని చెప్పాను. ఒక భక్తి భావంతో ఆయన పాటల్ని కంపోజ్ చేశారు.