ఎచ్-1 బి వీసాల గురించి పెట్టబోయే బిల్లు ప్రతిపాదన బయటకు వచ్చినప్పణ్నుంచి మనవాళ్లు ట్రంప్‌ను నానారకాలుగా తిట్టిపోస్తున్నారు. అప్పులు చేసి పిల్లల్ని అమెరికా పంపినవారైతే మరీ దుమ్మెత్తి పోస్తున్నారు. మరీ అన్ని శాపనార్థాలు అవసరమా? అని నాకు సందేహం కలుగుతోంది. కాస్త నిదానంగా ఆలోచించండి – అది ప్రతిపాదన మాత్రమే. బిల్లుగా కావచ్చు, కాకపోవచ్చు, అంకెల్లో, టైము ఫ్రేములో కొన్ని మార్పులు జరగవచ్చు. ఈ లోపునే అంత గగ్గోలు అవసరమా? అంటే ట్రంప్ ధోరణి చూస్తే అవసరమే అని కొందరంటారు.
ఏడు ముస్లిము దేశాలవారిపై విధించిన నియంత్రణలు, శరణార్థుల పట్ల అతని ధోరణి చూడండి అంటున్నారు. ఇవన్నీ వేర్వేరు విషయాలు. ముస్లిము దేశాల వారిపై పెట్టిన నియంత్రణలు – కోర్టులు కొట్టేశాయి, మరీ పట్టుబడితే కొన్ని మార్పులతో అనుమతించవచ్చు, ఏదైనా జరగవచ్చు – ఉగ్రవాదం నుంచి తన దేశాన్ని కాపాడుకునే ప్రయత్నంగా చూడాలి. దానిలో అతిపోకడలు వుండవచ్చు, అంత కటువుగా, కర్కశంగా వుండనక్కరలేక పోవచ్చు. కానీ దానిపై తను సీరియస్ అని తెలపడానికి ఆ సంకేతం పనికి వచ్చింది. అసలు ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదే అమెరికా. వారి పుణ్యానే ఐసిస్ యీ స్థితికి వచ్చింది. ఇప్పుడు హఠాత్తుగా మా దగ్గరకు మాత్రం రావద్దు, బయట ఎంత మందినైనా కాల్చుకు తినండి అనడం ధర్మమా అని ప్రశ్న.
ఉగ్రవాదాన్ని పోషించినది, వారిని వ్యతిరేకించే శక్తులను బలహీనపరచినది అమెరికాయే, అందులో సందేహం లేదు. అమెరికా అంటే అమెరికా పౌరులు కారు, పాలకులు – రిపబ్లికన్, డెమోక్రాట్ యిద్దరూనూ! వారి వారసత్వం ట్రంప్‌కు వచ్చింది కాబట్టి దాన్ని కొనసాగించాలనడం న్యాయం కాదు. ఎప్పటికైనా కొత్త పుంత తొక్కాల్సిందే! ఉగ్రవాదాన్ని పోషించడంలో యూరోప్ అమెరికాకు తోకగా వ్యవహరించింది. ఇప్పుడు అనుభవిస్తోంది. యూరోప్ యిప్పుడు ఉగ్రవాద బాధిత ఖండంగా మారిపోయింది. ఎక్కడ చూసినా టెర్రరిస్టు దాడులే. అది చూసి ట్రంప్ మేలుకొంటున్నాడు. తన దేశం చుట్టూ దడి కట్టుకుంటున్నాడు. అనుమానితులపై నిఘా పెంచుతున్నాడు. అలా చేయవద్దని మనం అనలేం. ఆట్టే మాట్లాడితే మనమూ అదే పద్ధతి అనుసరించాలి. అయితే ట్రంప్ యిక్కడితో ఆగకుండా యితర దేశాల్లో తాము ఉగ్రవాదానికి యిస్తున్న మద్దతు ఆపేయాలి. అప్పుడే ట్రంప్ చిత్తశుద్ధిని నమ్మగలుగుతాం. ఆ మద్దతు కొనసాగిస్తూ, తను మాత్రం జాగ్రత్త పడదామని చూస్తే, ఎవరో అక్కరలేదు యిప్పటిదాకా అండగా వున్న యూరోప్ దేశాలే తాట తీస్తాయి.
శరణార్థుల విషయంలో కూడా అమెరికా యిప్పటిదాకా ప్రపంచ శరణార్థులందరికీ స్వర్గధామంగా వుంటూ వచ్చింది. భోగభాగ్యాలతో తులతూగినంత కాలం అది నడిచింది. అవసరం వున్నా లేకపోయినా ప్రతీవాడు తాను శరణార్థినంటూ అమెరికాకు వచ్చిపడ్డాడు. ఇప్పుడు అమెరికా పరిస్థితి తారుమారైంది. స్థానికులకే దిక్కూదివాణం లేకుండా వుంది. తాను దూర కంత లేదు, మెడకో డోలు అన్నట్లు, తమ తిండికే ప్రభుత్వంపై ఆధారపడుతూ వుంటే శరణార్థులను ఎందుకు పోషించాలి అనే ఫీలింగు అమెరికన్లకు రావడంలో ఆశ్చర్యమేముంది? వారి ఆలోచనలు చదివిన ట్రంప్ యికపై అడ్డుకుంటానంటున్నాడు.
'అలా కుదరదు, నీ పూర్వీకులు రానిచ్చారు కాబట్టి నువ్వూ రానివ్వాలి' అని మనం ట్రంప్‌ను అదలించగలమా? ఇప్పటి పరిస్థితుల బట్టి నేను నడుచుకుంటాను అంటే కాదనగలమా? ఓ సినిమాలో ఒక జమీందారు దర్జాలకు పోతూంటాడు. ఓ రోజు ఒక అపరిచితుడికి భోజనం పెడుతూ 'మీది ఫలానా వూరా? ఆ వూరిలో ఫలానా రాజుగారు చేతికి ఎముక లేకుండా దానాలు చేసేవాట్టగా, మహానుభావుడు' అని మెచ్చుకుంటాడు. అప్పుడా అపరిచితుడు 'ఆ రాజును నేనే! నీలాగే గొప్పలకు పోయి, యిప్పుడు భోజనం కోసం వూరూరూ తిరిగే స్థితికి వచ్చాను' అంటాడు. అమెరికా కూడా ఆ స్థితికి రావాలని మనం అనలేం కదా! 1971లో బంగ్లాదేశ్ శరణార్థుల కోసం అదనంగా పది పైసల స్టాంపు అంటించమంటేనే మనం విసుక్కున్నాం. బంగ్లాదేశ్, బర్మా నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోకి శరణార్థులు వచ్చిపడుతూ వుంటే కుదరదంటున్నాం. అలాటిది యింకో దేశాన్ని మాత్రం మీరు వారి భారం భరించండి అనే చెప్పగలమా?
ఇప్పుడీ వీసాల విషయానికి వస్తే – ఇది ఆ సమస్యల్లాటిది కాదు. అమెరికాకు సాంకేతిక నిపుణుల అవసరం వుంది. వాళ్లు వచ్చి తమ వద్ద ఉత్పాదక శక్తి, మాన్యుఫాక్చరింగ్, పరిశ్రమలు పెంచాలని కోరుకుంటోంది. నైపుణ్యం వున్న విదేశీయులు అమెరికాకు వెళదామని ఉబలాట పడుతున్నారు. ఉన్నత విద్యలు అభ్యసించినవారికి తక్కిన చోట కంటె అక్కడ సౌకర్యాలు ఎక్కువ, ఆదాయం ఎక్కువ. ఏ దేశం నుంచి వచ్చినా సరే, మతం, జాతీయత ఏదైనా సరే చదువుకున్నవాడైతే చాలు అమెరికాలో పెద్దపీట వేశారు. సరస్వతిని ఆరాధించారు కాబట్టి లక్ష్మి కూడా తాండవించింది. కానీ పోనుపోను దీనిలో ఒక యిబ్బంది వచ్చిపడింది. బయట నుంచి వస్తువులు, సేవలు వచ్చిపడుతున్నాయి కాబట్టి స్థానికులు కాళ్లు చాచుకుని కూర్చోవడం మొదలుపెట్టారు. అందువలన వాటిని కట్టడి చేయవలసి వచ్చింది. గాంధీగారు విదేశీ వస్తుబహిష్కారం చేయండన్నారు, ప్రతి యింట్లో ఖద్దరు వడకమన్నారు. ఆ విధంగా స్వయంసమృద్ధి సాధించమన్నాడు. స్వదేశీ నినాదమే మనల్ని నిలబెట్టింది. గ్లోబలైజేషన్ వచ్చిపడ్డాక మనం కూడా వస్తువులు ఉత్పత్తి చేయడం మానేసి దిగుమతులపై ఆధారపడి మన పరిశ్రమలను మనమే కూల్చుకున్నాం. అమెరికా వాళ్లు మరీ కూల్చుకున్నారు. అక్కడ మార్కెట్లలో దొరికేదంతా విదేశీ సరుకే.
వస్తువులతో బాటు సేవలు కూడా తోడయ్యాయి వారికి. మంచి ఉద్యోగాలన్నీ విదేశీయులు తన్నుకుపోతున్నారు. తాము ప్రభుత్వం యిచ్చే నిరుద్యోగ భృతిపై ఆధారపడి వలసి వస్తోంది. విదేశీయుల్లో కొంతమంది నిజంగా ప్రతిభావంతులున్నారు. వారితో పోటీ పడాలంటే మంచి చదువులు చదువుకోవాలి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన విద్యావ్యవస్థ బాగా భ్రష్టు పట్టింది. విద్యాఋణాలు భరించలేని స్థాయికి వచ్చాయి. విదేశీయులకు కుటుంబాల దన్ను వుంటుంది. అమెరికన్ సామాజిక వ్యవస్థలో ఆ సౌకర్యం లేదు. ఇప్పటికిప్పుడు రావాలంటే రాగల మార్పు కాదది. అన్నదమ్ములు కలిసుండే ఉమ్మడి కుటుంబవ్యవస్థకు మనం మళ్లీ తెచ్చుకోగలమా? ఇక ఉద్యోగాలలో కూడా విదేశీయులు చేసేవన్నీ వాళ్లు మాత్రమే చేయగల ఉద్యోగాలు కాదు. కొన్ని స్థానికులు కూడా చేయగల ఉద్యోగాలే. అయితే విదేశీయులు చౌకజీతాలకు దొరుకుతున్నారు కాబట్టి ఉద్యోగాల్లోంచి అమెరికన్లకు పీకేసి, విదేశీయులకు అప్పగిస్తున్నారు. ఇది వాళ్లను బాధిస్తోంది.
ఈ చౌకజీతాల కాన్సెప్టు వలన రావలసినంత జీతం రాక విదేశీ ఉద్యోగులు నష్టపోతున్నారు. ఆ ఉద్యోగమూ నిలుపుకోలేక స్థానికులూ నష్టపోతున్నారు. బాగుపడుతున్న దెవరయ్యా అంటే చౌకజీతాలకు విదేశీ ఉద్యోగులను సప్లయి చేస్తున్న విదేశీ కంపెనీలు, ఆ కంపెనీల సేవలను ఔట్‌సోర్సు చేసుకుంటున్న అమెరికన్ కంపెనీలు. ప్రతి వ్యాపారీ లాభం కోసమే వ్యాపారం చేస్తాడు. ఖర్చులన్నీ పోను లాభాల్లో 15-20% మార్జిన్ వుంటే వ్యాపారపు రిస్కుకై అతనికి వచ్చిన ప్రయోజనం అనుకోవచ్చు. అంతకు మించి కంపెనీలు ఆర్జిస్తున్నాయంటే అవి పరిస్థితులను ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటున్నాయనే అర్థం. వాటికి ముకుతాడు పడవలసిన అవసరం వుందని మనం ఒప్పుకోవాలి. ఆ కంపెనీలు అమెరికన్వా, ఇండియన్‌వా, లాభాలు తగ్గడంతో అవి ఉద్యోగాలు తీసేస్తే మన మేనల్లుడి ఉద్యోగం వూడుతుందా? అనేవి పరిగణించదగిన అంశాలు కావు.
అమెరికన్ సమాజం రెండుగా చీలిపోతోంది. కొన్ని వర్గాల వారు – ఇండియన్స్ కావచ్చు, చైనీయులు కావచ్చు, మరొకరు కావచ్చు – విపరీతంగా పుంజుకుంటున్నారు. ఎచ్1 బి వీసాల జీవిత భాగస్వాములకు సైతం వర్క్ పర్మిట్లు యిస్తానన్న ఒబామా విధానం వలన ఆ కుటుంబాల వారు మరింత ధనికులవుతారు. (ఇప్పుడీ బిల్లు దానికి సమ్మతించనంటోంది) మరో వర్గం వారు – అవకాశాలు, ఉద్యోగాలు, చదువులు పోగొట్టుకుని నిరాశానిస్పృహల్లో మునిగి, విదేశీయుల పట్ల అసూయాగ్రస్తులై వారి పట్ల కసి పెంచుకుని దౌర్జన్యాలకు దిగడానికి సంకోచించటం లేదు. పోనుపోను ఈ వర్గాలు ఘర్షించక తప్పదు. ఆ ఘర్షణను నివారించాలంటే ముందుగానే మేల్కొని సర్దుబాటు చర్యలు చేపట్టాలి. ఇక్కడి వరకు అంగీకరిస్తే యిక బిల్లులోని అంశాల గురించి కాస్త విపులంగా మాట్లాడవచ్చు.
ముఖ్యంగా అందరూ మాట్లాడుతున్నది బిల్లులో ప్రతిపాదించిన ఏడాదికి 1.30 లక్షల జీతం గురించి. అది చాల ఎక్కువ అనేస్తున్నారు. 1989లో 65 వేల లిమిటు వుండేది. అప్పణ్నుంచి యిప్పటికి, అంటే 28 ఏళ్లల్లో ధరలు రెట్టింపు కాలేదా? 1989 నాటి రేట్లే వుంచాలని వాదించడం ఎంత అర్థరహితం! బిల్లు మీద హాట్హూట్ అంటున్న టెక్కీ కంపెనీల సిఇఓలు 28 ఏళ్ల నాటి జీతాలకే పనిచేస్తున్నారా? బిల్లు చర్చకు వచ్చినపుడు ట్రంప్ మొదట్లో అన్న ఏ లక్ష దగ్గరో ఆగవచ్చు. నిర్మొహమాటంగా చెప్పాలంటే అదీ తక్కువే! అది కూడా యివ్వం అని కంపెనీలు మొండికేయడం అన్యాయం. తక్కువ జీతాలకు పని చేయించుకోవడం బాగా మరిగారన్నమాట. నిజానికి జీతాలు పెంచాలన్న లాజిక్ చాలా కరక్టు. ఎందుకంటే అమెరికన్ ఐటీ కంపెనీలు ఏం చెప్తున్నాయి? మేం ఔట్‌సోర్సు చేసుకుంటున్న సేవలందిస్తున్నవారు మొనగాళ్లు. స్టెమ్ ఫీల్డులో సాటిలేని మేటి ఉద్యోగులు. ఆ పాటి వారు మన దగ్గర ఎవరూ లేకపోవడం చేతనే వాళ్లను తెచ్చుకోవలసి వస్తోంది అంటున్నారు. మరి అంత మేటి ఉద్యోగులకు 1989 నాటి జీతం యివ్వడమేమిటి? నాన్సెన్స్! లక్షకు పైగా జీతం యివ్వవద్దా? అంత జీతం యివ్వమనేసరికి అబ్బే వాళ్ల కంత సీను లేదనడం ఆశ్చర్యం కదా! అంటే జరుగుతున్నదేమిటన్న మాట, బొటాబొటీ చదువు, మిడిమిడి అనుభవం, మామూలు తెలివితేటలున్న వాళ్లకే మేధావుల వేషం వేసి కంపెనీలు ఎచ్-1 బి వీసాలు సంపాదిస్తున్నాయన్నమాట. అమెరికాలో మొత్తం భారతీయ ఐటీ ఉద్యోగులు 3.50 లక్షల మంది వున్నారట. వారిలో తెలుగు రాష్ట్రాల వారు 1.06 లక్షలు. భారతీయుల్లో 47% మంది తెలుగువారిలో 43% మందికి జీతం 75 వేలు లోపేట. తెలుగువారిలో 17% మందికి మాత్రం 1.30 లక్షలకు పైన! తక్కిన 40% మంది 75 వేల నుంచి 1.30 లక్షల మధ్య జీతం తెచ్చుకుంటున్నారు. లక్ష లోపు తెచ్చుకునేవారు 62%! ఈ బిల్లు ప్రతిపాదన వలన వాళ్లంతా బాగుపడతారు – వారిలో అమెరికాకు కావలసిన ప్రతిభ వుంటే! లేకపోతే 80 వేల మంది స్వదేశానికి తిరిగి వచ్చి తమకున్న ప్రతిభను స్వదేశానికే ఉపయోగిస్తారు.
జీతాలు పెరిగితే మనవాళ్లకే లాభం కదా! మరి భయం దేనికి? ఎచ్-1 బి వీసాలకు లాటరీ సిస్టమ్ తీసిపారేసి, మార్కెట్ నీడ్స్ ప్రకారం యిస్తామంటున్నారు. అంటే మంచి యూనివర్శిటీల్లో బాగా చదివినవారికి లాటరీ గోల లేకుండా వస్తుంది. అమెరికా యూనివర్సిటీల్లో పోస్టు గ్రాజువేషన్ చేసిన సమర్థులకు ఉద్యోగాలు యిస్తామనే బిల్లు అంటోంది. అమెరికాలోని విదేశీ విద్యార్థులలో భారతీయులు ద్వితీయస్థానంలో వున్నారు. అందువలన తక్కిన విదేశీయుల కంటె మనకే ఎక్కువ ఛాన్సు. 30 ఏళ్లు వచ్చినా పిల్లల్ని చదివించే కుటుంబ వ్యవస్థ మనకుంది. అందుకే 2016లో 1.65 లక్షల మంది భారతీయ విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లగలిగారు. అలాటి బ్యాకింగ్ లేకపోవడం చేత మాస్టర్స్ చదవని తక్కినవాళ్లు బాధ పడాలి కానీ మనకెందుకు భయం? మాస్టర్స్ అంటూ ఏదో చదివాం కానీ, అంత అర్హత లేదని భయమా? అర్హత లేకపోతే అక్కడ అఘోరించడం దేనికి? మన దేశం వచ్చేయచ్చుగా! ఆ చదువేదో ఇక్కడే చదువుకోవచ్చు.
బొటాబొటీ చదువులు చదివి ఒపిటికై (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) కై యిచ్చిన మూడేళ్లలో ఏదో ఉద్యోగం చేసి నాలుగు డబ్బులు వెనకేసుకుందామనే వాళ్లకే వస్తుంది అసలు చిక్కు. ఈ బిల్లు ఆ సమయాన్ని ఏడాదికి తగ్గించాలంటోంది. ప్రస్తుతం ఒపిటిలో వున్నవారు 1.70 లక్షల మంది విద్యార్థులట. మిడిమిడి ఎమ్మెస్ చదవడానికి అప్పులు చేయడమెందుకు? ఆ అప్పులు తీర్చడానికి చిన్నా చితకా ఉద్యోగం చేయడమెందుకు? నిజంగా సత్తా వున్నవాళ్లే అక్కడకు వెళ్లి చదువుతారు. సాధారణ తెలివితేటలున్నవారు యిక్కడే వుంటారు. తలిదండ్రులకు అప్పుల బాధయినా తప్పుతుంది. ప్రస్తుతం ఎచ్1 బి వీసాల విషయంలో 50 కంటె తక్కువ మంది ఉద్యోగులున్న స్టార్టప్ కంపెనీలకు 20% రిజర్వ్ చేయడం కూడా హర్షదాయకం. పెద్ద కంపెనీలు, కన్సల్టెంటు కంపెనీలు వీసా విషయంలో ఉద్యోగం మారతానన్న తమ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్నాయని వింటున్నాం. ఇప్పుడా భయం లేకుండా స్టార్టప్ కంపెనీలకు వెళ్లవచ్చు.
గ్రీన్ కార్డుల విషయంలో దేశాల వారీ కోటా తీసేస్తామన్న ప్రతిపాదన కూడా మంచిదే కదా! మనదేశం నుంచి ప్రతిభావంతులు ఎక్కువ వుండి యీ 7% సీలింగు వలన నష్టపోతూ వుంటే యిప్పుడా లోటు తీరుతుంది కదా. ఇవన్నీ పరిగణిస్తే యీ బిల్లు సరుకు వున్నవాళ్లనీ, లేనివాళ్లనీ చక్కగా ఫిల్టరు చేస్తుందని నాకనిపిస్తోంది. సరుకు వున్నవాళ్లు విదేశాల్లో తెలుగు పతాకాన్ని ఎగరవేసి, మనకు ప్రతిష్ఠ తెస్తారు. లేనివాళ్లు, ఉన్నా వాళ్లకు చాలనివాళ్లు తిరిగి వచ్చేసి ఇండియాలోనే ఉద్యోగాలు వెతుక్కుంటారు. 'జాన్ బచీ లాఖోం పాయీ, ఘర్ కా బుద్దూ ఘర్ వాపస్ ఆయా' అనే సామెత ఓ సారి గుర్తు చేసుకుంటారు.
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2017)