భాజాపా ఓట‌మిని భార‌త్ ఓట‌మితో పోల్చేయ‌త్నం…

బీహార్ ఎన్నిక‌ల్లో ప‌రిస్థితులు అంత ఆశాజ‌న‌కంగా లేవ‌ని తేలుతున్న కొద్దీ…  భాజాపా నేత‌లు స్థిమితం కోల్పోతున్నారు. సాక్షాత్తూ  ప్ర‌ధాన మంత్రి సైతం విమ‌ర్శల్లో హ‌ద్దులు దాటేస్తున్నారు. త్రీ ఇడియ‌ట్స్ అంటున్నారు, తాంత్రికుడితో లాలూచీ ప‌డ్డారంటున్నారు.…

బీహార్ ఎన్నిక‌ల్లో ప‌రిస్థితులు అంత ఆశాజ‌న‌కంగా లేవ‌ని తేలుతున్న కొద్దీ…  భాజాపా నేత‌లు స్థిమితం కోల్పోతున్నారు. సాక్షాత్తూ  ప్ర‌ధాన మంత్రి సైతం విమ‌ర్శల్లో హ‌ద్దులు దాటేస్తున్నారు. త్రీ ఇడియ‌ట్స్ అంటున్నారు, తాంత్రికుడితో లాలూచీ ప‌డ్డారంటున్నారు. లాలూ లాంటి నేత‌ల్ని వైర‌స్‌తో పోలుస్తున్నారు. ఇదే క్రమంలో… మోడీ నుంచి స్ఫూర్తి పొందాడేమో… భాజాపా అధ్యక్షుడు అమిత్ షా మ‌రింత ముందుకెళ్లాడు. భార‌తీయ  జ‌న‌తా పార్టీ బీహార్ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం అంటే భార‌త‌దేశం ఓడిపోవ‌డ‌మే అన్నట్టు మాట్లాడాడు. 

ఢిల్లీలో జ‌రిగిన ఓ ర్యాలీలో గురువారం పాల్గొన్న ఆయ‌న బీహార్ ఎన్నిక‌ల్లో బిజెపి త‌ప్పకుండా గెలుస్తుంద‌న్నాడు. అయితే ఒకవేళ ఖర్మకాలి ఓడిపోతే అది దేశానికి మంచిది కాద‌న్నాడు. ఈ ఎన్నిక‌ల్లో గ‌నుక భాజాపా ఓడిపోతే… అది శ‌తృదేశాల‌కు సంబ‌ర‌ప‌డే విష‌యంగా మారుతుంద‌ని అన్నాడు. భాజాపా ఓడిపోతే పాకిస్థాన్ వంటి దేశాల్లో బాణాసంచా కాలుస్తార‌న్నాడు. అంతేకాదు, అది మీరు కోరుకుంటున్నారా? అంటూ ఆయ‌న స‌భికుల్ని ప్రశ్నించి లేదు లేదు అనే స‌మాధానాన్ని రాబ‌ట్టాడు. 

దీంతో…  అభివృధ్ధి మంత్రంతో, ప్యాకేజీ తంత్రంతో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన భాజాపా…  చివ‌రికి పాకిస్థాన్ బూచిని అడ్డం పెట్టుకుని నెగ్గాల‌నే స్థాయికి దిగ‌జారింద‌ని ప్రత్యర్ధులు విమ‌ర్శిస్తున్నారు. అమిత్‌షా మాట‌ల్ని ఆషామాషీగా తీసుకోబోమ‌ని, ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేస్తామ‌ని బీహార్లోని అధికార జ‌న‌తాద‌ళ్ పార్టీ  నేత త్యాగి స్పష్టం చేశాడు. 

మ‌రో రెండు ద‌శ‌ల పోలింగ్ బ్యాలెన్స్ ఉన్న బీహార్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం భాజాపాకు అత్య‌వ‌స‌రం. అటు రాజ్యస‌భ‌,  లోక్ స‌భ‌లో ప్రాతినిధ్యం పెంచుకోవ‌డం ద్వారా కీల‌క బిల్లుల ఆమోదానికైనా, రానున్న త‌మిళ‌నాడు, ఉత్తర‌ప్రదేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్ వంటి రాష్ట్రాల ఎన్నిక‌ల్లో పార్టీకి ఊపు ఇవ్వాల‌న్నా… బీహార్ ఎన్నిక‌ల గోదాలో విజ‌యం సాధించ‌క త‌ప్పదు. ఈ అత్యవ‌స‌ర ప‌రిస్థితే భాజాపా  నేత‌ల నోటి వెంట మాట‌లు అదుపు త‌ప్పేలా చేస్తోంది.