గానమైనా, ప్రాణమైనా శ్వాసేకదా! ప్రతి క్షణం ఒక పాటే. కలల్లో ఇష్టాయిష్టాలుండవు. నిద్ర ఏది ప్రసాదిస్తే అది. భయమే పీడకల. సంతోషమే స్వీట్ డ్రీమ్.
ఎన్నడూ చూడని స్థలాలు, మనుషులు కలలో కనిపిస్తారు. రాత్రి ఒక గత జన్మ, టైమ్ మిషన్. ఆత్మ చేసే సుదీర్ఘ ప్రయాణమే నిద్ర. వదిలి వెళ్లిపోయిన వాళ్లంతా మళ్లీ కనిపిస్తారు. ఉన్నారని ఆశ పడే లోగా ఎవరో తట్టి లేపుతారు. మెలకువ ఒక శాపం.
ప్రాణులకి వర్తమానం తప్ప గతం, భవిష్యత్ వుండవు. అందుకే వాటికి కలలుండవు. బుద్ధి జీవితమే మనిషికి విషాదం.
మృత్యువు నుంచి వేదాంతం పుట్టదు. అదే నిజమైతే కాటికాపర్లంతా ప్రపంచ వేదాంతులు అయ్యేవాళ్లు. ఫిలాసఫీ కడుపు నిండిన వాళ్ల వ్యాపకం. ఆకలి అన్ని శాస్త్రాల కంటే గొప్పది.
నువ్వు ఎన్ని యుద్ధాలు చేసినా నిన్ను నువ్వు గెలవలేవ్. లోపలున్న శత్రువు ప్రతిరోజూ ఒక కొత్త రూపంతో వుంటాడు. ఆయుధాన్ని నువ్వే అందించి , నువ్వే గాయపడతావు.
మట్టిని, బూడిదను ప్రేమించు, అదే నీ ఆఖరి రూపం. లేపనాలు అవసరం లేని క్షణాలు.
ఒక పక్షికి రెక్కలొచ్చాయంటే అర్థం, అమ్మానాన్నల్ని వదిలి వెళుతుందని. వలస వెళ్లిన పక్షి ఒక రోజు తిరిగి వస్తుంది. దిగులు పడిన గూడుకి కొత్త కళ. ప్రపంచంలోని విద్యుత్ వెలుగులన్నీ తల్లి కళ్లలోనే.
తనలో తాను స్నానం చేసే సెలయేరుకి ఒక కూనిరాగం వుంటుంది. చిన్న చేప పిల్ల ఆ పాటతో ఆడుకుంటుంది. వానని ఆస్వాదించు. ఆకాశం కురిపించే ఆశీర్వాదం. రాజసౌధం మీద, పేద గుడిసెపైన కురిసే వాన ఒకటే. ప్రకృతిని గౌరవించు. అహంకారాన్ని ఆర్పే ఫైర్ ఇంజన్.
చలి మంట దగ్గర కూర్చో. నీ పూర్వీకుల కథలు గుర్తుకొస్తాయి. నల్లమల పులులతో సావాసం చేసిన వాళ్లు గురి తప్పని విలుకాళ్లు. బతుకుతో యుద్ధం చేసిన యోధులు.
బంగారంతో ఎవడూ ఆయుధం చేయలేడు. ఇనుమే మనిషి ప్రాణాన్ని కాపాడింది. పరుసవేది అన్వేషణ ఒక భ్రాంతి మాత్రమే.
ఎలా బతకాలో ఎవడైనా చెప్తాడు. ఎలా బతక్కూడదో ఎవడూ చెప్పడు. ఈర్ష్యని జయించలేని వాడు కూడా ఈశావాస్యోపనిషత్తు ప్రవచించే కాలం.
గడియారం కరిగి ప్రవహిస్తుంది. సెకన్ల ముల్లు పాములా కదులుతూ వుంది. అన్నిటికీ ఆశ్చర్యపోయే బాల్యం దాటిపోయి దేనికీ ఆశ్చర్యపోని వయసు ఒకటి వస్తుంది. లోపల మార్పులు నీకు మాత్రమే తెలుస్తాయి. ముఖం మీది ముడతలు అందరికీ తెలుస్తాయి.
కాలాన్ని వెనక్కి తిప్పితే, వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగొస్తారు. నిన్ను పెంచిన వాళ్లు వస్తే, నువ్వు పెంచిన వాళ్లుండరు. వెళ్లే వాళ్లు దారి ఇస్తేనే వచ్చేవాళ్లుంటారు. కాలం కర్కశనియంత. ప్రతి మనిషికీ ఒక జైలుని నిర్మిస్తుంది. నువ్వే జైలర్, నువ్వే ఖైది.
అర్ధరాత్రి ఆకాశం చుక్కల ముగ్గులు వేస్తూ వుంది. లెక్క సరిపోక కొన్ని రాలిపోతున్నాయి. అవ్వతో , కుందేలుతో చందమామ కథలు చెప్పుకుంటున్నాడు. వెన్నెలలో ఆడుకుంటున్నప్పుడు అమావాస్యకు కూడా సిద్ధంగా వుండాలి. సీతాకోక చిలుకకి కూడా రెక్కలు రాలిపోతాయి. అయినా రంగుల కల ఒక్క క్షణం చాలు కదా!
పసిబిడ్డల నవ్వుకి మించిన అందం ప్రపంచంలో వుందా!
జీఆర్ మహర్షి
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు