ఓవ‌రాక్ష‌న్ చేయ‌కు… అంద‌రిదీ నాట‌క‌మే!

భూమి వాన నీటితో త‌డిస్తే ప‌చ్చ‌ద‌నం. క‌న్నీళ్ల‌తో త‌డిస్తే ఉప్పుద‌నం. ఉప్పు క‌య్య‌ల్లో ప‌సి మొగ్గ‌లు బ‌త‌క‌వు.

యాత్రీకుడా, నడ‌క ఆప‌కు. నీ యాత్ర‌లో మిగిలే పాద‌ముద్ర‌ల కోసం ప‌సిపిల్ల‌లు వెతుక్కుంటారు. ప్ర‌యాణాల స‌మూహ‌మే జీవితం. పారే నీళ్ల‌కే ప్ర‌పంచం తెలుస్తుంది. లోప‌ల కొలిమి వెలిగితేనే నువ్వొక ఆయుధం.

ఎలుగుబంటికి హెయిర్ డై అమ్మ‌డ‌మే మార్కెటింగ్ క‌ళ‌. డ‌బ్బుకి మించిన జీవ‌క‌ళ లేదు. అన్ని రంగాల్ని శాసించే చ‌తురంగ బ‌లం.

రైలు వ‌స్తుంది. ఆలింగ‌నం, వీడ్కోలు , క‌న్నీళ్లు. రైలు వెళుతుంది. కొండ చిలువ‌లా ప‌ట్టాల మీద పాకుతూ , చుక్క‌లా మాయ‌మ‌వుతుంది. దిగులుగా ప్లాట్‌ఫాం. ఒంట‌రిగా స‌మోసా కుర్రాడు. చిల్ల‌ర‌లో ఆక‌లిని లెక్క‌పెడుతూ. ఇంకో రైలు కోసం ఎదురు చూస్తూ.

ప‌సివాడికి ప్ర‌తిదీ అద్భుత‌మే. పెద్ద‌రికం మాన‌సిక పేద‌రికం. స్కూల్‌కి ప‌రుగులు తీసే పిల్ల‌వాడా, కొంచెం ఆగు. ఈ ప‌రుగు ఒక రోజుతో ఆగ‌దు. జీవిత‌మే ర‌న్నింగ్ రేస్. ఆగితే ఈ ప్ర‌పంచం ఒప్పుకోదు. అమ్మానాన్న అస్స‌లు ఒప్పుకోరు. నువ్వు డ‌బ్బులు, జ‌బ్బులు సంపాదించుకుంటేనే వాళ్ల‌కి మ‌న‌శ్శాంతి. స‌క్సెస్ అంటే సంతోషం, హాయిగా న‌వ్వ‌డం. లోప‌ల చెద‌లు తినేసినా , బ‌య‌టికి ఆకుప‌చ్చ‌గా క‌నిపించ‌డం కొత్త జీవ‌న క‌ళ‌. గుర్రాన్నే చూడ‌ని వాన్ని హార్స్ రైడింగ్ విజేత‌గా ప్ర‌క‌టించ‌డం మాడ్ర‌న్ ఆర్ట్‌.

ఓవ‌రాక్ష‌న్ చేయ‌కు. అంద‌రు ఆడుతున్న‌ది నాట‌క‌మే. పొగుడు, పొగిడించుకో. ఒక‌టే పొగ‌, సెగ‌. రోజువారీ డ్రామాలో ఒక్క డైలాగ్ కూడా మ‌రిచిపోం. స్క్రిప్ట్‌ని ఇంప్రూవ్ చేస్తాం కూడా.

అడ‌విలో జీవించేవాడు మృగాల‌కి భ‌య‌ప‌డ‌డు. ఏం పోగొట్టుకున్నావో తెలియ‌దు. దేన్ని వెతుకుతున్నావో కూడా తెలియ‌దు. ఏమీ లేకుండా వ‌చ్చి, అన్నింటికి ఆశ‌ప‌డి, ఏమీ లేకుండా వెళ్లిపోతావ్‌. మంచు గ‌డ్డ‌ల మీద విశ్ర‌మించి, అగ్ని కీల‌ల్ని ఆలింగ‌నం చేసుకుంటావ్‌.

జీవితంలో పాఠాలు, గుణ‌పాఠాలుండ‌వు. ఇదో ప‌రీక్ష‌. ప్ర‌తిరోజూ ఒక ఎగ్జామ్ పేప‌ర్‌. నీకు తెలియ‌ని సబ్జెక్టుల్లో ప్ర‌శ్న‌లుంటాయి.

ప్ర‌పంచం చాలా అంద‌మైంది. నీకెంత కావాలో తెలిస్తే, ఆ సౌంద‌ర్యం క‌నిపిస్తుంది. భూమ్మీద వ‌స్తువుల్ని వెతికేవాడు, ఆకాశంలో ఇంద్ర‌ద‌న‌సుల్ని చూడ‌లేడు.

సృష్టిక‌ర్త‌కి ఇమిటేష‌న్ న‌చ్చ‌దు. ఒక పువ్వు, ఆకు, పండు ఏదీ ఇంకోదానిలా వుండ‌దు. మ‌నుషులే ఇత‌రుల‌తో పోల్చుకుని, పోటీలు ప‌డుతూ అనుక‌ర‌ణే అలంక‌ర‌ణ అనుకుంటున్నారు.

ప్ర‌తి మ‌నిషికీ ఒక పాట వుంటుంది. ఎపుడూ విన‌క‌పోవ‌చ్చు, పాడ‌డం రాక‌పోవ‌చ్చు. శంఖంలో వినిపించే హోరులా, నీలో వినిపిస్తూ వుంటుంది. నువ్వేమిటో చెబుతూ వుంటుంది.

ప‌క్షులు కూడా పాటలు పాడుతున్న‌పుడు, మ‌నుషులకేమైంది? సంగీత శూన్య‌త‌ని ఆవ‌హిస్తున్నారు?

మంచీచెడ్డ లేనేలేవు. స‌మ‌యం, సంద‌ర్భ‌మే అన్నీ నిర్ణ‌యిస్తాయి.

ఒక‌రి నుంచి దోచుకోవ‌డం మ‌నిషి అంత‌రంగ స్వ‌భావం. దాని విశ్వ‌రూపమే యుద్ధం. ఒక నాయ‌కుడి అహంభావం, ల‌క్ష‌లాది ప‌సిపిల్ల‌ల దుక్కం.

భూమి వాన నీటితో త‌డిస్తే ప‌చ్చ‌ద‌నం. క‌న్నీళ్ల‌తో త‌డిస్తే ఉప్పుద‌నం. ఉప్పు క‌య్య‌ల్లో ప‌సి మొగ్గ‌లు బ‌త‌క‌వు.

నువ్వు ఎక్కుతున్న మెట్లు, మాన‌వ కంక‌ళాలు.

రోడ్డు మీద బొమ్మ‌లు అమ్ముతున్న త‌ల్లికి, త‌న బిడ్డ‌ల ఆట‌లు తెలియ‌దు. ఆక‌లి మాత్ర‌మే తెలుసు.

గూడు జాగ్ర‌త్త‌. గుడ్లు తినే పాములు తిరుగుతున్నాయి.

పిల్ల‌ల్ని పోగొట్టుకున్న రామ‌చిలుక, మాట‌ల్ని కూడా పోగొట్టుకుంది.

-జీఆర్ మ‌హ‌ర్షి

8 Replies to “ఓవ‌రాక్ష‌న్ చేయ‌కు… అంద‌రిదీ నాట‌క‌మే!”

  1. ఆద్భుతం !! మహాద్భుతం !!

    అర్ధం పర్ధం లేని పరమాద్భుతం !!

    మొదటి వాక్యం చదవగానే వాసిందెవరో అర్ధమైపోయేంత అనితర సాధ్యమైన శైలి !!

Comments are closed.