ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ ఎబోలా. ఈ మహమ్మారి దెబ్బకి ప్రపంచం గజగజా వణుకుతోంది. ఇప్పటిదాకా ఈ ఎబోలా వైరస్ బారిన పడి కొన్ని దేశాల్లో సామాన్యులు మృత్యువాత పడ్తోంటే, వారికి వైద్య చికిత్స చేసిన వైద్యులూ వైరస్ సోకడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎబోలా అంటే ప్రపంచం వణుకుతోన్న పరిస్థితి.
ప్రపంచం చాలా చిన్నదైపోయిందిప్పుడు. ఎక్కడ ఎలాంటి కొత్త టెక్నాలజీ రూపొందినా, క్షణాల్లో ప్రపంచ వ్యాపితమవుతోంది. వైరస్‌లు కూడా అంతే. అందుకే ఎబోలా విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ప్రపంచదేశాలన్నిటికీ. ఇక మన దేశంలో ఎబోలా ఆచూకీ ఇప్పటిదాకా లేదనే చెప్పాలి. ఆ మధ్య ముంబైలో విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా వుందంటూ వార్తలొచ్చాయి. తాజాగా హైద్రాబాద్‌లో ఓ వ్యక్తి ఎబోలాతో బాధపడ్తున్నాడంటూ మీడియాలో కథనాలు షురూ అయ్యాయి.
ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి రాజయ్య స్పందించారు. ఇప్పటిదాకా తెలంగాణలోనే కాదు, దేశంలోనే ఎక్కడా ఎబోలా కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారాయన. అయితే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వ్యక్తి, రోగం నయం కాకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో చేరాడనీ, అతనికి ఎబోలాసోకిందనీ ప్రచారం జరుగుతోందిప్పుడు.
దాంతో గాంధీ వైద్యులు, మీడియా ముందుకు రాక తప్పలేదు. గాంధీ ఆసుపత్రిలో తీవ్ర జ్వరం, జలుబుతో ఓ వ్యక్తి చేరిన విషయం నిజమేననీ, అయితే ఎబోలా లక్షణాలేవీ ఆయనలో లేవనీ, ఆయన నైజీరియా నుంచి వచ్చినా నైజీరియా ఎబోలా ఫ్రీ కంట్రీగా ఇటీవలే ప్రకటితమైనందున ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని ‘గాంధీ’ వైద్యులు భరోసా ఇస్తున్నారు.
ప్రస్తుతం ఎబోలా అనుమానితుడిగా భావిస్తోన్న వ్యక్తి బ్లడ్ శాంపిల్స్‌ని ఢల్లీకి పంపించారు. రిపోర్ట్స్ వచ్చాక మరోమారు మీడియా సమావేశంలో అన్ని వివరాలూ వెల్లడిస్తామనీ, ఆ వ్యక్తి వివరాలు మీడియాకి వెల్లడొంచడం మంచిది కాదని వైద్యులు చెప్పుకొచ్చారు.
మొత్తమ్మీద గతంలో స్వైన్‌ఫ్లూ విషయంలో ఇంతే హంగామా జరిగింది.. అప్పట్లో స్వైన్‌ఫ్లూ మనదేశాన్నీ వణికించింది.. ఇప్పుడది సద్దుమణిగింది. అవునా? కాదా? అన్నది వైద్యులు తేల్చకముందే మీడియా హంగామా కారణంగా సామాన్యుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. తుమ్మితే, దగ్గితే స్వైన్‌ఫ్లూ, ఎబోలా అన్న అనుమానాలకు గురవుతుండడంతో డాక్టర్లకు పెద్ద తలనొప్పిగా తయారయ్యిందనే విమర్శలూ లేకపోలేదు.