జనసేన..పవన్ కళ్యాణ్ కు, ఆయన సిద్దాంతాలను నమ్మినవారికి ప్రియమైన పేరు. పుట్టిన సంస్థ లేదా, పార్టీ అలాగే వుండిపోతే ఇక చెప్పేదేముంటుంది? ఇప్పుడు జనసేన పరిస్థితి అలాగే వుంది.
పార్టీ పుట్టింది. ఎన్నికలకు వెళ్తామంది. తూచ్..ఇప్పుడు కాదు, వచ్చే ఎన్నికల వేళకు గోదాలో దిగుతామంది. అందుకోసం మెరికల్లాంటి వారిని పార్టీలోకి తెచే కార్యక్రమం జరుగుతోందన్నారు.
ఇంతలో ఆ మధ్య పార్టీ రిజిస్ట్రేషన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇదుగో రిజిస్ట్రేషన్ అన్నారు. అది ఇప్పుడేమయిందో అతీ గతీ లేదు. రిజిస్ట్రేషన్ అయినట్లో తెలియదు, దరఖాస్తు తిరస్కరించారో తెలియదు.
ఇక పార్టీలోకి సభ్యత్వ నమోదు అన్నారు. అప్పట్లో విశాఖలో ప్రారంభించారు. అదే దశలో వుందో తెలియదు. అసలు ఎంత మంది సభ్యులున్నారో తెలియదు. ఒకపక్క ఇన్ని ఆఫర్లు పెడితే కానీ, తెలుగుదేశం పార్టీకి ఇంకా ఇరవైలక్షల మంది సభ్యులు రావడం కష్టమైంది. మరొపక్క భాజపా సభ్యత్వ నమోదు చేస్తోంది. మరి జనసేన వ్యవహారం ఎప్పుడు?
మెరికల్లాంటి వారిని ఎంచి పార్టీలోకి నాయకులుగా తీసుకుంటాం అన్నారు. ఇంతవరకు అలా ఎవర్నీ తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పైగా ప్రారంభంలో మూడు కొట్ల వరకు పార్టీ సమావేశాల హడావుడికి ఖర్చు చేసిన పివిపి ఇప్పుడు పవన్ కు దూరంగా వున్నారు. పవన్ తో సినిమా ప్రతిపాదన కూడా విరమించుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా పార్టీగా మారక, సభ్యత్వాలు నమోదుచేయక, నాయకులను చేర్చుకోక, కనీసం జనజీవనంలో కనిపించక, ఏం చేద్దామన్నది పవన్ కళ్యాణ్ ఐడియా అనుకోవాలి. అయినా ఎన్నికలు సుదూరంలో వున్నాయి కనుక ఇప్పుడు అవన్నీ అనవసరం అని భావిస్తున్నారా?
ఎప్పుడో మళ్లీ నోవాటెల్ లోనో, హైటెక్స్ లోనో, ఎవరైనా మీటింగ్ స్పాన్సర్ చేస్తే ఆయనే చెప్పాలి.