కెవి: రూటు మార్చగలమా?

వాణిజ్యం, వ్యాపారం అనగానే యితరులను దోపిడీ చేయడం అనే అభిప్రాయం చాలామందిలో వుంది. సమాజశ్రేయస్సు లక్ష్యంగా పెట్టుకున్నదే మంచి వ్యాపారమని నా అభిప్రాయం

‘ఫలానా వాడు చదివిన చదువుకి, చేస్తున్న ఉద్యోగానికి లేదా వ్యాపారానికి సంబంధం లేదు చూడండి’ అని కొందరు వెక్కిరిస్తూ ఉంటారు. ‘ఐఐటీ, ఐఐఎమ్‌లు చదివి దోసలు యింటికి సప్లయి చేసే వ్యాపారం పెట్టడమేమిటి?’ అంటూ యీసడిస్తారు. ఫలానా చదువు చదివితే ఫలానా ఉద్యోగమే చేయాలి అనే భావాలు గతంలో గాఢంగా నాటుకుని ఉండడం వలన యిలా జరుగుతోంది. ‘ఏ చదువు చదివినా చివరకు కంప్యూటరులో తేలుతున్నారు. ఆ కాడికి అదేదో చదవడం దేనికి? కంప్యూటరే చదివితే సరిపోతుందిగా’ అని విమర్శించే వాళ్లు అర్థం చేసుకోవలసినది – కంప్యూటర్ అనేది ఒక సాధనం మాత్రమే. గతంలో కాగితాలపై చేసిన పని, యిప్పుడు కంప్యూటరుపై జరుగుతోంది. కంప్యూటరు వాడకం వలన అప్లికేషన్లు పెరుగుతున్నాయి తప్ప మౌలికమైన విద్య యొక్క అవసరాన్ని అది తొలగించటం లేదు.

పైగా ఒక డిసిప్లిన్‌లో నేర్చిన విద్య అనేది చివరి మైలు రాయి కాదు, యితర విద్యలు నేర్చుకోవడానికి అది ఒక సాధనం మాత్రమే. ఇటీజ్ ఏ మీన్స్ టు లెర్న్ అదర్ బ్రాంచెస్, నాట్ ఏన్ ఎండ్ బై యిట్‌సెల్ఫ్. అందువలన విద్య నేర్వడం అనేది నిరంతరం సాగుతూనే ఉండాలి. డిగ్రీ చేతికి వచ్చేసింది కదాని, ఆ పై చదవడం మానేస్తే, కొత్తవి నేర్చుకోవడం మానేస్తే, అక్కడితో మన కథ ముగిసినట్లే. ఒక డిసిప్లిన్‌లో మనం సాధించిన ప్రావీణ్యం, యితర డిసిప్లిన్స్‌ను సులభంగా నేర్చుకునేందుకు దోహద పడుతుంది, అంతేకాదు, ఆచరణలో వచ్చే సమస్యలను పరిష్కరించే నేర్పు అలవరుస్తుంది. ‘ఇంజనీరింగు చదివి, ఆ డిగ్రీకి తగిన ఉద్యోగం రాక, ఓ హాస్పటల్‌లో రిసెప్షనిస్టుగా పని చేస్తున్నాడు మా వాడు. చదువంతా వేస్టయింది.’ అని వాపోయే తండ్రి కాస్త నిదానంగా ఆలోచించాలి.

చదువయ్యాక ఇంజనీరు ఉద్యోగం రాదని అతను ఊహించలేదు కదా. ఇంజనీరింగులో చేరాక అతనికి సబ్జక్టులో ఆసక్తి తగ్గి, మంచి మార్కులు తెచ్చుకోలేదేమో! బయటకు వచ్చాక అవకాశాలు ఎలా ఉంటాయో నాలుగేళ్ల క్రితమే ఎవరూ ఊహించ లేరు కదా. ఏవో లెక్కలు వేసుకుని కోర్సులో జాయినై ఉంటాడు. అవి తప్పి యీరోజు రిసెప్షనిస్టు అయ్యాడు. ఇక్కడే జీవితాన్ని చాలించడుగా! మరో లైనులోకి వెళతాడేమో! ఇదే లైనులో, అదే హాస్పటల్లో పైకి ఎగబాకి ఏ ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరో, మరి కొన్నాళ్లకు వైస్ ప్రెసిడెంటో అవుతాడేమో! అతను నాలుగేళ్లూ చదివిన విద్య అతనా విధంగా ఎదగడానికి ఉపయోగ పడవచ్చేమో! ఇలా ఆలోచించకుండా, యిక జీవితంలో పట్టుబడి పోయాడు, ఊబిలో కూరుకుపోయాడు, చదివిన చదువంతా వ్యర్థమైంది అని ఆలోచించడం సరి కాదు.

నేను చదివినది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. డిఫెన్స్ లాబ్స్‌లో రాడార్ సైంటిస్టుగా ఆరేళ్లు పని చేశాను. శాంతా బయోటెక్నిక్స్ స్థాపించాక చాలామంది నేను బయోటెక్నాలజీలో సైంటిస్టునని పొరబడ్డారు. కాదని చెపితే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు నుంచి జెనటిక్ ఇంజనీరింగుకి ఎలా మారారు? అలా ఎవరైనా మారారా? అసలు మారగలమా? అని ప్రశ్నలు సంధించారు. బయటి వాళ్లే కాదు, ఇంజనీరింగులో నా క్లాస్‌మేట్స్ కూడా! చాలా ఏళ్ల తర్వాత నేను చదివిన కాకినాడ ఇంజనీరింగు కాలేజీ (దరిమిలా జెఎన్‌టియు అయింది) 2012 మార్చిలో సువెనీరు వేస్తున్నపుడు దాని సంపాదకులు యీ విషయమై వ్యాసం రాసి పంపమన్నారు. అది యిలా సాగింది –

‘ఈ సువెనీర్లో కనబడే తక్కినవాళ్ల విజయగాథలకూ, నా కథకూ తేడా వుంటుంది. వాళ్లంతా చదువుకున్న రంగంలో నిష్ణాతులై ఉన్నత శిఖరాల నధిరోహించినవారు. నా విషయంలో నాకు వచ్చిన అధికాంశం జాతీయ, అంతర్జాతీయ అవార్డులు నా ఇంజనీరింగు ప్రజ్ఞతో సంబంధం లేనివి…

..ఇక్కడ కాస్త నిదానించాలేమో. నిజంగా సంబంధం లేనివేనా? అసలు ఇంజనీరింగ్‌ అంటే ఏమిటి? పరిస్థితుల, పరిమితుల అవగాహన, నూతన విధానాల కల్పన, సరళతరం చేయగల నేర్పు.. యివేగా!

నేను అభ్యసించిన ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగులో నేను వ్యవహరించినది ప్రోటాన్స్‌తో అయితే ఇప్పుడు జెనటిక్‌ ఇంజనీరింగ్‌లో వ్యవహరించేది ప్రోటీన్స్‌తో! రెండూ కంటికి కనబడనివే, ఆది నుండీ సృష్టిలో వున్నవే. అంతేకాదు కమ్యూనికేషన్‌ టెక్నిక్‌ అక్కడా ఇక్కడా ఒక్కటే. ఒక ఎలిమెంటుకు మరొక ఎలిమెంటుకు మధ్య వుండే కమ్యూనికేషన్‌ గురించి నేను మీకు వేరే చెప్పనక్కరలేదు. హెల్త్‌కేర్‌ రంగంలో ఈ కమ్యూనికేషన్‌ మూలంగానే ఆరోగ్యం గానీ అనారోగ్యం గానీ సోకుతాయి. ఒక జీవకణం పక్కనున్న జీవకణంతో సంభాషించి తన రుగ్మతను సంక్రమింపజేస్తుంది. ట్రాన్సిస్టర్‌ ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు. ఒక ప్యూర్‌ మెటల్‌లో ఇమ్‌ప్యూరిటీని ‘డోప్‌’ చేస్తే, ఎలక్ట్రాన్‌ భ్రమిస్తుంది. తద్వారా విద్యుత్‌ ప్రవహిస్తుంది. అదే విధంగా జెనటిక్‌ ఇంజనీరింగులో ఆర్గానిజంను హోస్ట్‌ సెల్‌లో ఇమడ్చడం ద్వారా అనుకూల రీతిలో జీన్‌ను మార్చుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రాన్‌ కానీయండి, జీన్‌ కానీయండి – వాటిని, వాటి చలనాన్ని మానవాళికి అనువుగా మలచుకోవడంలోనే ఉంది మన ప్రజ్ఞ, ఉపజ్ఞ. అది నాకు నేర్పినది ఈ కాలేజీయే!

కాలేజీ చదువు అయిపోయాక నేను డిఫెన్సు లాబ్స్‌లో సైంటిస్టుగా చేరాను. తర్వాత వేర్వేరు ఉద్యోగాలు చేశాను. క్రమేపీ, మేనేజిరియల్‌ హోదాకు వచ్చేసరికి, చేయడం కంటె చేయించడమే కష్టమని తెలిసివచ్చింది. ఆ మార్గాన్ని సుగమం చేయడం నాకు మేనేజ్‌మెంట్‌ పాఠాలు నేర్పాయి. 1977లో డిఎల్ఆర్ఎల్ ఉద్యోగం వదిలిపెట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధీనసంస్థ ఐన ఎపిఐడిసిలో చేరాను. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల యిబ్బందులను అర్థం చేసుకుని, వారికి తగు విధంగా సహాయం చేయగల అవకాశం ఆ విధంగా లభించింది. ఏ మేరకు ఋణం యివ్వాలనే విషయంలో బోర్డులో ఉన్న బ్యాంకు అధికారుల వాదనలు బోధ పడాలంటే కంపెనీల ఆర్థిక వ్యవహారాలను అర్థం చేసుకోవాలి, బాలన్స్ షీట్స్‌ను స్టడీ చేయగలగాలి.

అది ఇంజనీరింగుకి సంబంధం లేని విద్య. కానీ ఇంజనీరింగు చదువు ఉస్మానియా యూనివర్శిటీ ఈవెనింగు కాలేజీలో 1980లో ఎంబిఏ కోర్సులో చేరడానికి ధైర్యాన్నిచ్చింది. హైదరాబాదు మేనేజ్‌మెంట్ అసోసియేషన్ 1980లో ‘బెస్ట్ మేనేజర్ ఎవార్డు’ నిచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగు పట్టా యిస్తే ఉస్మానియా నన్ను ఎంబీఏ పట్టభద్రుణ్ని చేసింది. 1985లో నా 37వ ఏట ఉద్యోగం వదిలిపెట్టి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా మారినపుడు యీ చదువు నాకు ఉపకరించింది. ఒక టెక్నోక్రాట్‌కు ఆర్థిక వ్యవహారాలపై కూడా పట్టు ఉండడం అత్యవసరం. లేకపోతే తను పడిన శ్రమ ఎటు పోతోందో తెలియక గందరగోళ పడతాడు.

నిజం చెప్పాలంటే కాలేజీల కంటె వ్యక్తులే నాకు ఎక్కువ నేర్పారు. ప్రభుత్వంలో అందరి పని తీరు ఒకటి కాదు, ప్రైవేటు రంగంలోనూ కాదు, విదేశీయుల చేత కూడా పని చేయించుకునే అవసరం పడుతోంది నాకిప్పుడు. వీరందరితోనూ ఎలా మసలాలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా నేర్చినది ఈ కాలేజీలోనే! నన్ను చాలామంది అడుగుతూంటారు – ఒక ఇంజనీరు టెక్నోక్రాట్‌గా మారడం నూటికి పదిశాతం కేసుల్లో చూస్తూ వుంటాం. వారిలో సక్సెస్‌ 2-3 శాతం మందినే వరిస్తుంది. కానీ నువ్వు ఇంజనీరింగు నుండి లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి ఎలా మారగలిగావు? ఎలా ధైర్యం చేసావ్‌?’ అని.

నా ఉద్దేశంలో ఇంజనీరింగు చదువు ఇంజనీరింగు మాత్రమే నేర్పదు. పదార్థ విజ్ఞానంతో బాటు, ప్రాణుల గురించి విజ్ఞానమూ నేర్పుతుంది, పరిపాలనా దక్షతా నేర్పుతుంది. అందుకే నేను ఇనార్గానిక్‌ మెటీరియల్‌ వ్యవహారాలనుండి, ఆర్గానిక్‌ మెటీరియల్‌ వ్యవహారాలకు సునాయాసంగా మరల గలిగాను. కొత్తల్లో కంగారు పడిన మాట వాస్తవమే. మీలో కొందరు ఐటీ వైపు వెళ్లవచ్చు, నాలా బీటీ వైపు వెళ్లవచ్చు, ఇవాళ పేరు కూడా ఊహించలేని రంగం కేసి మరి కొందరు వెళ్లవచ్చు. ఏ రంగం వైపు వెళ్లినా శ్రద్ధ, శ్రమ మాత్రమే మిమ్మల్ని గమ్యానికి చేర్చగలవు. క్లాసురూములో నేర్చుకున్న దానికంటె ఎక్కువగా ఆస్మాసిస్‌ ప్రక్రియ ద్వారా మీరు ఎంతో నేర్చుకుంటున్నారు. అనువైన పరిస్థితుల్లో, అవసరపడిన సందర్భాల్లో అది వెలికి వచ్చి చేదోడవుతుంది, చేయి పట్టుకుని నూతన లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది.

మీ ఇంజనీరింగు చదువు మీ మానసిక పరిధిని పెంచి దేనినైనా అవలీలగా చేయగలిగే సులువు నేర్పుతుంది కాబట్టి మీరు ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నా దానిలో విజయం సాధించే అవకాశాలు మెండుగా వున్నాయి. అన్నిటికంటె ముఖ్యంగా కావలసినది కామన్‌సెన్స్‌. అయితే దానికి ముందుగా చేయవలసినది, చదివిన చదువు దైనందిన జీవితంలో ఎలా వుపయోగపడుతుందో ఆలోచించి చూడాలి. ‘టోలరెన్సు లిమిట్‌’, ‘వరస్ట్‌ కేస్‌’ డిజైన్‌ – వీటికి సాంకేతికపరమైన అర్థాలు వుండవచ్చు. కానీ వాటిని మామూలు జీవితంలో కూడా అన్వయించి చూసుకుంటేనే ఆ అంశం గట్టిగా నాటుకుంటుంది. ఆ అన్వయింపుకు కావలసినది కించిత్తు భావుకత, స్వేచ్ఛగా, నూతనంగా ఆలోచించగలిగే అలవాటు. అవి మీరు అలవరచుకుంటే చాలు, మీరు ఇంజనీరుగానే కాదు, డాక్టరుగా నైనా రాణిస్తారు. ఎంటర్‌ప్రెనార్‌గా మారినప్పుడు తెలియని రంగంలోనైనా రాణించ గలిగే అవకాశా లున్నాయని నా కథే చెప్తోంది.’

ఇదీ ఆనాటి నా వ్యాసం. ఇది నా యింజనీరింగు సహచరులను, విద్యార్థులను ఉద్దేశించి రాసినప్పటికీ అందరికీ అన్వయిస్తుంది. ‘మీకేదో అదృష్టం కలిసి వచ్చి, అవకాశం వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి యీ కబుర్లు చెపుతున్నారు’ అని అనవద్దు. అవకాశాలు నన్ను వెతుక్కుంటూ రాలేదు, నేనే వెతుక్కుంటూ వెళ్లాను. చాలామంది అలా వెళ్లకపోవడానికి కారణం, వాళ్లు తమ ఆలోచనలు సంకెలలు బిగించి, పరిమితమైన పరిధిలోనే తచ్చాడడం! చదువనేది డిగ్రీ చదివిన నాలుగేళ్ల పాటే ఉండదు. నిరంతరం అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. దీని ఆధారంగా కొత్తది నేర్చుకోవాలి. దానికి దీన్ని ఎడాప్ట్ చేసుకోవాలి. కానీ చాలామంది యిది గ్రహించక, డిగ్రీ చదువు, అది తెచ్చి పెట్టగల ఉద్యోగం కోసం వెతకడం, దొరక్కపోతే నిరాశ, దొరికాక ఓ శుక్రవారం సాయంత్రం ఊడిపోతే దుఃఖం, తాము నేర్చిన విద్య, తమ అనుభవం ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, అసలా దిశగా ఆలోచించక, టెన్షన్, డిప్రెషన్.. వగైరా. ఈ చట్రం లోంచి బయటకు రాలేమా? మన శక్తియుక్తులు ఎలా, ఎన్ని రకాలుగా, ఏ యే రంగాలలో ఉపయోగ పడతాయో ఊహించి చూడలేమా?

శ్రీ విద్యానికేతన్‌ యూనివర్శిటీ 2010 కాన్వోకేషన్‌లో మాట్లాడుతూ అక్కడి విద్యార్థులను యివే ప్రశ్నలడిగాను – ‘కావటానికి మనం స్వతంత్ర భారత పౌరులం. కానీ నిజంగా స్వతంత్రమైన ఆలోచనలు మనకు వస్తున్నాయా? మనం అమెరికాకు భావదాస్యం చేయడం లేదా? వాళ్ల తిండి అలవాట్లను, ఫ్యాషన్లనే కాదు, వాళ్ల బిజినెస్ మాడ్యూళ్లను, టెక్నిక్కులను సైతం మనం అనుకరించడం లేదా? ఆ ఉత్పాదనలను కొని అక్కడి పరిశ్రమలను వృద్ధికి దోహదం చేస్తున్నాం. దానివల్ల మన పరిశ్రమలు మూతబడతాయి. మనం ఎంతకాలం అండర్‌ డెవలప్‌డ్‌, లేదా డెవలపింగ్‌ కంట్రీగా వుండిపోతాం? డెవలప్‌డ్‌ కంట్రీగా కావడమే మన లక్ష్యం. మనకున్న పెట్టుబడి మన వనరులు. మన మేధస్సు. తరతరాల మన విజ్ఞాన వారసత్వం. మనం నూతనంగా ఆలోచించాలి. మన ఊహలకు రెక్కలు తొడగాలి. దానికి బదులు మనం అమెరికన్లకు సేవలు అందించి, దానితో తృప్తి పడుతున్నాం. పెరట్లో బావి పెట్టుకుని గుక్కెడు నీటికోసం అడుక్కోవడం జరుగుతోంది.

వాణిజ్యపరంగా చూసినా, ఇండియా పెద్ద మార్కెట్‌ ప్లేస్‌. దాదాపు యూరోపంత మార్కెట్‌. ఈ మార్కెట్‌ కోసమే పాశ్చాత్య దేశాలు మనపై ప్రకటనలు కురిపిస్తున్నాయి. మన మార్కెట్‌ పొటెన్షియల్‌ను మనమే ఎక్స్‌ప్లాయిట్‌ చేసుకుందామని మనకో తోచాలి కద! మన మార్కెట్‌ను వాళ్ల కప్పగించి వాళ్ల దగ్గర ఊడిగం చేయవలసిన ఖర్మ మనకెందుకు? ఇక్కడి ప్రజల డబ్బుతో చదివిన చదువుల సారాన్ని వాళ్లకు పోస్తున్నాం. త్యాగధనులు పెద్దలెందరో పోరాడి మనల్ని బానిసత్వం నుండి విడుదల చేస్తే, మనం మనంతట మనమే వెళ్లి వాళ్లకు బానిసలవుతున్నాం – మానసికంగా కూడా! దానితో మనం వాళ్లకు చులకన అయ్యాం.

ఉదాహరణకి ఓ విషయం చెప్తాను – హెపటైటిస్‌-బి వ్యాక్సిన్‌ ప్రాసెస్‌ కొందామని నేను ఒక అమెరికన్‌ కంపెనీ వద్దకు వెళితే బోల్డంత ధర చెప్పడంతో బాటు, ‘కొన్నా మీరు దాన్నేం చేసుకోలేరు. అది మీకు అర్థం కావడానికే దశాబ్దాలు పడతాయి’ అన్నాడు. పంతం కొద్దీ మా టీము స్వదేశీ పరిజ్ఞానంతో నాలుగేళ్లలో తయారు చేసి చూపించాం. దరిమిలా వాళ్ల ఉత్పాదన కంటే మన ఉత్పాదన ఉత్కృష్టమైందని తేలింది. దాంతో ఒకప్పుడు మమ్మల్ని తీసి పారేసిన స్మిత్‌ క్లయిన్‌ బీచెమ్‌ కంపెనీ వాళ్లు తర్వాతి రోజుల్లో మా వద్దకు వచ్చి మాతో వ్యాపార లావాదేవీలు చేశారు. ఈ టెక్నాలజీ మనకు కొత్త అని వదిలేసి ఉంటే? మనకు అప్పటిదాకా వచ్చిన దాన్ని ఆ అత్యాధునిక ఆర్-డిఎన్ఏ టెక్నాలజీకి ఎక్స్‌టెండ్ చేసుకుని, ఎడాప్ట్ చేసుకుని భేష్ అనిపించుకున్నాం కదా!

దీనివల్ల తేలేదేమిటి? మన వ్యక్తిత్వం మనం కాపాడుకుంటేనే, మన మేధస్సుకు పదును పెట్టి అద్భుతాలు చేసి చూపిస్తేనే మనకు గౌరవం దక్కుతుంది. ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీని క్రియేట్‌ చేస్తేనే విలువ వుంటుంది, సబీర్‌ భాటియా హాట్‌ మెయిల్‌ను తయారుచేస్తే అడిగినంత యిచ్చి కొనుక్కున్నారు. బిపిఓ వుద్యోగాలనే నమ్ముకుంటే లాభం లేదని తేలిపోయింది కదా! మనం చీప్‌ లేబర్‌గా వున్నంత కాలమే ఐటీలో వుద్యోగాలు. వాటిని చూసి మురిసిపోతే మనకంటె అవివేకులు వుండరు. భారతీయ మేధను నమ్ముకుని, ఐపీఆర్‌ సృష్టించాలంటే సైన్సుపై విద్యార్థులకు ఆసక్తి పెరగాలి. పరిశోధనలు పెరగాలి. సైన్సు వృద్ధి చెందాలంటే సమాజంలో సైంటిఫిక్‌ టెంపర్‌మెంట్‌ వుండాలి. మతమౌఢ్యం, కులతత్వం, మూఢ నమ్మకాలు సైన్సు పురోగతికి అవరోధాలు.

వాణిజ్యం, వ్యాపారం అనగానే యితరులను దోపిడీ చేయడం అనే అభిప్రాయం చాలామందిలో వుంది. సమాజశ్రేయస్సు లక్ష్యంగా పెట్టుకున్నదే మంచి వ్యాపారమని నా అభిప్రాయం. మా శాంతా బయోటెక్నిక్స్‌ మనుగడకు, గుర్తింపుకు, ఎదుగుదలకు కేంద్రబిందువు, చోదకశక్తి సమాజహితమే!

దేవుణ్ని నమ్ముతారో, లేదో అది మీ యిష్టం. కానీ మనుషుల్లో కనబడే దైవత్వాన్ని ఆరాధించండి, అనుసరించండి, పెంపొందించండి. సర్వజీవ సేవే మాధవసేవ. ‘‘సంఘో రక్షతి రక్షిత:’’ అని గుర్తుంచుకోండి. స్వార్థాన్ని వీడి మీరు సమాజాన్ని కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది. నిరాశ తోనో, నిస్పృహ తోనో సమాజాన్ని నాశనం చేయబూనితే దానితో బాటు శామ్సన్‌లా మీరూ నాశనమవుతారు. జీవితంలో నిరాశకు, శిశిరానికి చోటీయకండి, శీతవేళ రానీయకండి. పరిమిత వనరులున్న సామాన్యుడికి గెలుపుంటుందా అని సందేహం వచ్చినపుడు మా శాంతా కథ గుర్తుకు తెచ్చుకోండి.’

ఇదీ అవేళ నేనిచ్చిన ప్రసంగం. ఇదే ధోరణిలో నేను అనేక చోట్ల ప్రసంగించాను, ప్రసంగిస్తూ ఉంటాను. ఉద్యోగార్థిగా సివిలు పంపుతున్నంత కాలం ఉద్యోగమిచ్చేవాడు ‘నువ్వు చదివినది అది కదా, నీకు అది తప్ప యిది రాదు కదా’ అంటూ వంకలు పెట్టి అప్లికేషన్ తిరస్కరిస్తూ ఉంటాడు. సొంతంగా ఏదైనా చేయడానికి నిశ్చయించు కున్నపుడు మనంతట మనకే తోస్తుంది ‘ఔను అది రాదు, కానీ నేర్చుకోలేనా? నాకు యిప్పటికే వచ్చిన విద్య యీ కొత్త టెక్నిక్‌ని నేర్చుకోవడానికి ఉపయోగ పడుతుంది కదా. తరచి చూస్తే అన్ని విద్యలూ ఒకదానితో మరొకటి అనుసంధానమైనవే కదా. వాటిని బంధించే అంతస్సూత్రం ఒకటే కదా!’ అని. సినిమా రంగంలో చూడండి, డాన్సర్‌గా తర్ఫీదు ఐన కమల హాసన్ హీరో అయ్యారు, అసిస్టెంటు డైరక్టరుగా కొన్నేళ్లు పని చేశాక హీరో అయిన నాని ఉన్నారు, నటుడిగా పుణె ఇన్‌స్టిట్యూట్‌లో తర్ఫీదైన సుభాష్ ఘయీ హిందీ సినిమాల దర్శకుడిగా మారి ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ చూస్తే, మనం అవసరాన్ని బట్టి రూటు మార్చగలం అనేది రుజువౌతోంది.

– కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్‌)

5 Replies to “కెవి: రూటు మార్చగలమా?”

Comments are closed.