ఈ వేళలో గంటా.. కాపు పాట ఎందుకో!

ఏ టైంలో ఏ ఉద్యమం చేస్తే ప్రజల్లో క్లిక్ అయి మైలేజీ పెరుగుతుందో నాయకుడికి ఒక అంచనా ఉండాలి.

దేనికైనా సరే టైమింగ్ ముఖ్యం. రాజకీయాల్లో అది మరీ ముఖ్యం. ఏ టైంలో ఏ స్టేట్మెంట్ ఇస్తే ఎంత వర్కవుట్ అవుతుందో.. ఏ టైంలో ఏ ఉద్యమం చేస్తే ప్రజల్లో క్లిక్ అయి మైలేజీ పెరుగుతుందో నాయకుడికి ఒక అంచనా ఉండాలి. టైమింగ్ లేని పోరాటాలు, ప్రకటనలు వృథాప్రయాస.

ఔత్సాహిక నాయకులు ఇలా టైమింగ్ లేకపోవడ వలన ఎప్పుడు ఏం చేయాలో తెలియకపోవడం వలన తమ కెరియర్ ను నాశనం చేసుకుంటూ ఉంటారు. కానీ సీనియర్ నాయకులు చిన్న మాట మాట్లాడాలన్నా కూడా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఏపీలోని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కాపు కులాన్ని నెత్తికెత్తుకుంటూ కొత్త ప్రకటనలు చేయడం.. పార్టీలతో సంబంధం లేకుండా కాపులంతా కలిసి ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను శాసించవచ్చునంటూ ప్రకటనలు చేయడం ఆసక్తికరంగా ఉంది.

విశాఖపట్నం కు చెందిన గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. కాపు కులం ఎడ్వాంటేజీతో పాటు పార్టీలో సీనియర్ నేత కావడంతో తనకు మంత్రి పదవి గ్యారంటీ అనే ఉద్దేశంతోనే ఆయన ఉన్నారు. అయితే తెలుగుదేశానికి సొంత పార్టీనుంచి కాపులకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఈదఫా తగ్గింది. ఎందుకంటే జనసేనతో పొత్తు పెట్టుకున్న తరువాత.. కాపు అభిమానం తమకు వెల్లువగా ఉంటుందనే అభిప్రాయం వారికుంది కాబట్టి.. సొంత పార్టీ కాపులు కొందరిని పక్కన పెట్టారు. ఆ క్రమంలో గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కలేదు. అక్కడ కట్ చేస్తే.. ఆయన తాజాగా తెలంగాణలో కాపు గానం ఆలపించడం గమనార్హం.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమినాపురంలో మున్నూరుకాపు సంక్షేమ సంఘం వారు ఓ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గంటా శ్రీనివాసరావు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించే శక్తి కేవలం మున్నూరు కాపులకు మాత్రమే ఉన్నదని చెప్పుకొచ్చారు. పార్టీలకు అతీతంగా మున్నూరు కాపులంతా ఏకం కావాలని పిలుపు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాపులను రకరకాల పేర్లతో పిలుస్తున్నారని.. తద్వారా వారి మధ్య ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నట్టుగా గంటా అంటున్నారు.

తాజాగా ఈ సమయంలో ఆయన కాపు గానం ఎందుకు ఆలపిస్తున్నట్టు? అది కూడా తెలంగాణలో! మున్నూరు కాపులు నిర్మించిన కన్వెన్షన్ సెంటరు గనుక.. ఏ రోటికాడ ఆ పాట పాడినట్టుగా ఆ మాటలు అన్నారా? లేదా, గతంలో కొన్నిసార్లు తన రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను సమీకరించినట్టుగా.. ఇప్పుడు కూడా మున్నూరు కాపులందరినీ ఐక్యం చేయడానికి ఏదైనా వ్యూహరచనలో ఉన్నారా? అనేది తెలియడంలేదు.

2 Replies to “ఈ వేళలో గంటా.. కాపు పాట ఎందుకో!”

Comments are closed.