కెవి: ఎంటర్‌ప్రెనార్‌ ఘనత ఏముంది?

ఆర్థిక సంస్కరణలు వచ్చాక, ఉత్పాదక రంగానికి ప్రోత్సాహం తగ్గిపోయి, మన దేశంలో ట్రేడర్స్‌ ఎక్కువై పోయి, మాన్యుఫేక్చరర్స్‌ తగ్గిపోవడం మనకు పట్టిన దౌర్భాగ్యం.

హెపటైటిస్‌ బి వాక్సిన్‌ను బ్లూమ్‌బెర్గ్‌ కనిపెట్టాడని నేను కొన్ని సభల్లో చెపితే ‘ఆయన కనిపెడితే మరి మీకు పేరు వచ్చిందేమిటి?’ అని కొందరు ఆశ్చర్యపోయారు. వారిలో యువతీయువకులే కాదు, పెద్దవారూ ఉన్నారు. ‘ఇంతకీ మీరు కనిపెట్టిందేమిటి? అసలేమీ కనిపెట్టకుండానే పద్మభూషణ్‌ యిచ్చేశారా!?’ అని కూడా వాకబు చేశారు.

ముందుగా తెలుసు కోవలసినది – నేను సైంటిస్టునే కానీ బయోటెక్‌ సైంటిస్టును కాను. నేను చదివిన చదువు ఎలక్ట్రానిక్స్‌లో యింజనీరింగ్‌. తొలిదశలో చేసిన ఉద్యోగం కేంద్రప్రభుత్వ సంస్థ అయిన డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్‌ రిసెర్చ్‌ లాబ్స్‌ (డిఎల్‌ఆర్‌ఎల్‌)లో రాడార్‌ సైంటిస్టుగా! బయోటెక్‌ రంగానికి సంబంధించి నేను ఎంటర్‌ప్రెనార్‌ను మాత్రమే! ఒక సంస్థను స్థాపించి, అత్యాధునిక రంగానికి చెందిన కొందరు సైంటిస్టులను ఒక చోటకి చేర్చి, వారి పరిశోధనలను నాణ్యమైన రీతిలో ఉత్పాదన చేసి, సామాన్యుడికి అందుబాటు ధరలో అందించగలగడమే నేను చేసిన పని! దానికే యీ ప్రశంసలు, బిరుదులూ, అవార్డులూ!

నా పేరుకి ముందు చేర్చే ‘డాక్టరు’ వైద్యరంగానికి చెందినది కాదు, పరిశోధనా రంగానికి చెందినదీ కాదు. పారిశ్రామిక రంగంలో నేను చేసిన కృషికి మెచ్చి నేను చదువుకున్న శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ వారు యిచ్చిన గౌరవ డాక్టరేటును సూచిస్తుంది. వారి తర్వాత గీతం, విజ్ఞాన్‌ యూనివర్శిటీల వాళ్లు కూడా యిచ్చారు. అందువలన నా పేరు వినగానే మీకు పాతకాలం తెలుగు సినిమాలో పిల్లిగడ్డంతో, కళ్లజోడుతో కనబడే ముక్కామల వంటి పాత్రధారి కళ్లకు కడితే, ఆ రూపాన్ని చెరిపేయండి. నేను ఎంటర్‌ప్రెనార్‌ను కాబట్టి మేనేజ్‌మెంట్‌, టీమ్‌ స్పిరిట్‌, ప్రభుత్వ యంత్రాంగంతో వేగడం ఎలా, ఆర్థికపరమైన ఒడిదుడుకులు తట్టుకోవడం ఎలా… వంటి విషయాల పైనే మాట్లాడతాను తప్ప బయోటెక్‌ రిసెర్చ్‌ గురించి పాఠాలు చెప్పను.

‘మీరు సైంటిస్టు కాదు సరే, అప్పటికే ఎవరో కనిపెట్టేసిన వాక్సిన్‌ను మీరు మళ్లీ కనిపెట్టడమేమిటి? దానికి దేశమంతా పొంగిపోవడమేమిటి?’ అని మీరు నన్ను అడగవచ్చు. ‘అప్పటిదాకా సృష్టిలో లేనిది కొత్తగా కనిపెడితే ఇన్నోవేషన్‌ అంటారని, అప్పటికే వున్నది కనిపెడితే (కొలంబస్‌ అమెరికాను కనిపెట్టినట్లు) డిస్కవరీ అంటారనీ వింటాం. ఇంతకీ మీది డిస్కవరీయా? ఇన్నోవేషనా? మీ సంస్థ శాన్‌వాక్‌ తయారు చేసేనాటికే ప్రపంచంలో మూడు దేశాలకు ఆ టెక్నిక్‌ తెలుసని విన్నాం. మీరు చేశాక యితర సంస్థలు కూడా అదే వాక్సిన్‌ను తయారు చేశాయనీ విన్నాం. ఇంతకీ మీకు మీ వాక్సిన్‌పై పేటెంటు వుందా? లేదా?’ అని కొంతమంది అడిగారు. ఇక్కడ సైన్సు పరిశోధనల గురించి, పేటెంటు విధానం గురించి, దానిలో వచ్చిన మార్పుల గురించి కొంత చెప్పాలి.

ఔషధాలకు సంబంధించిన పేటెంటుల గురించి కొంత వివరిస్తాను. ఏదైనా రోగ లక్షణానికి విరుగుడుగా మందు తయారీలో అనేక వ్యయప్రయాస లుంటాయి. సుదీర్ఘ ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఎన్నో లవణాలను, ఖనిజాలను, వృక్ష సంబంధమైన మూలకాలను అధ్యయనం చేసి, వేల మూలపదార్థ్ధాలను శోధించి సాధిస్తే రోగానికి ఉపశమనంగా భరోసా కలిగించేవి ఏ వందో మిగులుతాయి. ఆ వందలో మళ్లీ జల్లెడ పట్టి అటు రోగ ఉపశమనానికి దోహదపడుతూ, యిటు ఇతర సైడ్‌ ఎఫెక్ట్‌లు రాకుండా చూసేవి ఏ పదో, పాతికో మిగులుతాయి.

మళ్లీ ఆ పది, పాతిక మూలకాల్లో ఉత్పత్తి సామర్థ్యం పెంచుకో గలిగే అవకాశం, తగినంత తక్కువ ఖర్చుతో చేయగలిగే వీలు వున్న మూలకాలు ఒకటో రెండో తేలతాయి. ఆ ఒకటి, రెండులో ఏదో ఒక దానిని ఎంచుకుని అనేక పరీక్షలు ల్యాబ్‌లో చేయాలి. చివరన వాటి సేఫ్టీ గురించి, జంతువుల మీద, వాటి సామర్థ్యం గురించి మనుషుల మీద ప్రయోగాలు చేయాలి. ఇదంతా ఒక సుదీర్ఘకాల ప్రణాళిక.

ఈ తరహా ఇన్నోవేషన్‌ (ఆవిష్కరణ)కు ఎంతో సమయం, ధనం ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును రాబట్టడానికై ఇలాంటి ఆవిష్కరణలకు పేటెంటు హక్కులు పొందుతారు. తాము చేసిన ప్రయోగ కాలానికి, అందుకైన వ్యయానికి, వారి మేధోబలానికి వెల కట్టి పేటెంటు పొందుతారు. తాము ఆవిష్కరించిన దానిని వేరెవరూ అనుసరించి, అనుకరించి లబ్ధి పొందకూడదని వారి ముఖ్య ఉద్దేశ్యం.

అలా వచ్చే పేటెంటును ‘ప్రోడక్టు పేటెంటు’ అంటారు.

అయితే అదే ప్రోడక్టును వేరే ప్రాసెస్‌లో తయారు చేసే విధానాన్ని ఎవరైనా కనుగొంటే వారికి ‘ప్రాసెస్‌ పేటెంటు’ యిచ్చేవారు. ఈ విధానం భారత్‌ వంటి అభివృద్ధిచేందుతున్న దేశాలకు అనువుగా ఉండేది. ఔషధాన్ని తొలుతగా కనుగొని ‘ప్రోడక్టు పేటెంటు’ తెచ్చుకున్న సంస్థ రూపొందించుకున్న ఉత్పత్తి ప్రణాళికను అనుసరించకుండా, దానికి భిన్నమైన ప్రాసెస్‌లో అభివృద్ధి పరచి, ‘ప్రాసెస్‌ పేటెంటు’ పొంది, అదే ప్రోడక్టును మార్కెట్లోకి తెచ్చి ‘ప్రోడక్టు పేటెంటు’ కలిగిన బహుళజాతి సంస్థలకు పోటీగా నిలిచేవి. ఉదాహరణకి శాంతా 1997లో ‘శాన్‌వాక్‌`బి‘ తెచ్చేనాటికి బహుళ జాతి సంస్థ హెపటైటిస్‌`బి వ్యాక్సిన్‌ మార్కెట్లో ఉండేది. కానీ వారికి భిన్నమైన ప్రాసెస్‌లో మేము శాన్‌వాక్‌`బి తయారు చేశాం కాబట్టి మాకు ప్రాసెస్‌ పేటెంటు వచ్చింది. మేము విదేశీ వాక్సిన్‌లతో పోటీ పడగలిగాం.

ఈ విధానం అగ్రరాజ్యాలకు, వారికి చెందిన బహుళజాతి సంస్థలకు వ్యాపారరిత్యా ప్రతికూల పరిస్థితులను తీసుకొచ్చింది. అందువలన 2005 తర్వాత ‘ప్రాసెస్‌ పేటెంటు’ను ఉపసంహరించి ‘ప్రోడక్ట్‌ పేటెంటు’ను ప్రవేశ పెట్టాలని అగ్రరాజ్యాల ఒత్తిడితో అభివృద్ధి చెందుతున్న దేశాలను ‘గాట్’ (జనరల్ ఎగ్రిమెంట్ ఆఫ్ టారిఫ్ అండ్ ట్రేడ్) ఒప్పందం మీద సంతకాలు బలవంతంగా చేయించాయి. ప్రాసెస్‌ పేటెంటు హయాంలో భారతదేశంలో అనేక రకాల ఔషధాలకు ప్రత్యామ్నాయంగా భిన్నమైన ప్రాసెస్‌లతో తక్కువ ఖరీదులో లభ్యమయ్యే ఔషధాలను తయారు చేయగలిగారు. ఇలాంటి ఔషధాలను ‘జనరిక్‌ ఔషధాలు’ అంటారు.

ఇండియాలో ఫార్మా రంగం తన మేధోసంపత్తితో ఎన్నో ఔషధాలను ప్రజల అవసరాల కనుగుణంగా సరసమైన ధరలలో ఉత్పత్తి చేయగలిగింది. కానీ 2005 తర్వాత ‘ప్రోడక్ట్‌ పేటెంటు’ అమలు అవుతున్నప్పటి నుంచి మనం జనరిక్‌ మెడిసిన్‌ చేసుకునే అవకాశం కోల్పోయాం. స్వయంగా కొత్త ఔషధాలు ఇన్నోవేట్‌ చేయగలిగిన మేధోసంపత్తి మనకు ఉన్నప్పటికీ ఒక ఔషధాన్ని ఆలోచన నుంచి మార్కెట్లోకి తీసుకు రావడానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వుంటుంది. అంత ఆర్థిక ప్రతిపత్తి మన ఫార్మారంగానికి లేదు. ప్రోడక్ట్‌ పేటెంటు కాలపరిమితి చెల్లిపోయిన తర్వాత, మన ఫార్మారంగ నిపుణులు ఆ ప్రోడక్ట్‌ను తమదైన పద్ధతిలో జనరిక్‌ ఔషధంగా మార్కెట్‌లో ప్రవేశపెట్టవచ్చు. అంత మాత్రాన ఇన్నోవేషన్‌ ప్రోడక్ట్‌లు మన దేశం నుంచి రావా అని ప్రశ్నిస్తే..? అరుదుగా అలాంటి గొప్ప ఆవిష్కరణలు జరిగాయని జవాబు చెప్పాలి. ‘శాంతా’ సంస్థ నుండి ‘కలరా’ వ్యాక్సిన్‌ ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైంది. ఇది మనం గర్వించదగ్గ విషయం.

కొందరు నన్ను అడిగారు – కృషి చేసినదంతా సైంటిస్టులైతే, మరి మీకు పేరెందుకు వచ్చింది? పద్మభూషణ్‌ ఎందుకు యిచ్చారు? అని. ఇక్కడే ఎంటర్‌ప్రెనార్‌ ఘనతను మనం గుర్తించాలి. సప్తస్వరాలు విడివిడిగా వుంటే వాటికి ప్రాధాన్యత లేదు. వాటిని ఒక రమ్యమైన వరుసలో కూర్చి ట్యూన్‌ కడితే సంగీతదర్శకుడు అంటారు. ఆ బాణీపై అతనికి పేటెంటు యిస్తారు. అడవిలో మామిడి కాయ, సముద్రంలో ఉప్పు ఎలాగూ వుంటాయి. ఆ రెండిటినీ ఒక్కచోటకి చేర్చి, మరిన్ని దినుసులు చేర్చి రుచికరమైన ఊరగాయగా చేసిన వారికే మనం కితాబునిస్తాం. కథకుడు, ఛాయాగ్రాహకుడు, కళాదర్శకుడు, నటీనటులు, గాయనీగాయకులు, సంగీతదర్శకుడు, దర్శకుడు.. యిలా ఎవరికి వారు విడిగా వుంటే సినిమా తయారవదు. వారందరినీ ఒక చోటికి చేర్చి, వారి ప్రతిభను గుర్తించి, ఆ ప్రతిభకు తగిన పారితోషికం యిచ్చి, ఫైనాన్స్‌ సమకూర్చుకుని, సినిమాను పంపిణీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రేక్షకులకు అందించిన నిర్మాతకే లాభాలు వస్తాయి. నష్టం వచ్చినా అతనికి మాత్రమే!

ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం – రిస్కు తీసుకోవడం! వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమ – వీటన్నిటిలోనూ రిస్కు వుంది. దానికి విలువ కట్టకుండా శ్రమకు మాత్రం విలువ కట్టి, ‘అదనపు విలువ’, ‘శ్రమ దోపిడీ’ అని వేసే లెక్కలు సమంజసమైనవి కావు. ఫలానాది, ఫలానా విధంగా చేయాలనే ముందుచూపు, పెట్టుబడి పుట్టించగలిగే సామర్థ్యం, రిస్కు తీసుకునే ధైర్యం – వీటికి విలువ కట్టనంటే ఎలా? దీనిలో కూడా తేడా వుంది. ఎక్కడో ఉత్పత్తి చేసిన వస్తువును కొని, యిక్కడ అమ్మే ట్రేడర్‌కు రిస్కు తక్కువ. అతని కంటె వస్తువును ఉత్పత్తి చేసే అమ్మే పారిశ్రామిక వేత్తకు రిస్కు ఎక్కువ.

ఆర్థిక సంస్కరణలు వచ్చాక, ఉత్పాదక రంగానికి ప్రోత్సాహం తగ్గిపోయి, మన దేశంలో ట్రేడర్స్‌ ఎక్కువై పోయి, మాన్యుఫేక్చరర్స్‌ తగ్గిపోవడం మనకు పట్టిన దౌర్భాగ్యం. ఈ సంస్కరణలను చైనా అంది పుచ్చుకుని 1990లో 2.3 శాతం ఉన్న తన ఉత్పాదక రంగానికి 2020 నాటికి 7 శాతానికి పెంచుకుంటే, మనం అదే సమయంలో 32 శాతం నుంచి 11 శాతానికి దిగజారాం. చైనా వస్తువులకు కన్స్యూమర్స్‌గా మిగిలాం.

పారిశ్రామిక వేత్తలు రిస్కు తీసుకుంటారు కాబట్టి, వారిని ప్రోత్సహించాలి. వారి ద్వారానే ఉద్యోగకల్పన జరుగుతుంది, దేశానికి ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. వస్తూత్పత్తిలో నాణ్యత పాటిస్తే, దేశప్రతిష్ఠ యినుమడిస్తుంది. రిసెర్చితో కూడిన పరిశ్రమల విషయంలో రిస్కు మరీ ఎక్కువ. అందువలన వారిని యింకా బాగా ప్రోత్సహించాలి. వారి వలన దేశానికి మేధోసంపద కూడా ఒనగూడుతుంది. కొన్ని దశాబ్దాలుగా రిసెర్చి రంగాన్ని ప్రభుత్వం ఎలా చిన్నచూపు చూస్తూ వచ్చిందో, దాని వలన ఎంత నష్టం వాటిల్లిందో అనేక వేదికలపై చెప్పి వున్నాను. కోవిడ్‌ హఠాత్తుగా విరుచుకు పడడంతో దాని వాక్సిన్‌ అవసరం అందరికీ ఒక్కసారిగా తెలిసే సరికి, దానిపై పేటెంటు ఎత్తివేయాలనే డిమాండు బయలుదేరింది. నిజంగా ఎత్తివేస్తే యికపై పరిశోధనలు ఎవరైనా చేస్తారా? ‘వైఫల్యాలకు అయ్యే ఖర్చు భరించం, పరిశోధనా ఫలితాలను మాత్రం అనుభవిస్తాం’ అని అంటే రిసెర్చి చేసే ఉత్సాహం ఎవరికి వుంటుంది?

కారల్‌ మార్క్‌స్‌ ‘కమ్యూనిస్టు సమాజం ఏర్పడ్డాక శారీరక శ్రమకు, మేధోపరమైన శ్రమకు మధ్య ఉన్న తేడా చెరిగిపోతుంది’ అన్నాడు. కానీ నేను దాన్ని విశ్వసించను. ఎప్పటికైనా మేధస్సు స్థానం ఉన్నతమైనదే. మేధావులను, వారి కృషిని గౌరవించని, తగు రీతిన సత్కరించని సమాజం వర్ధిల్లదు. ప్రతిభను గుర్తిస్తేనే ప్రగతి. ఎవరో చేసిన దాన్ని కాపీ కొట్టి చేసేవాడిది ద్వితీయస్థానమే! మన భారతదేశంలో ఎంతో మేధ వున్నా, దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడం లేదు. ఇండియన్‌ ఫార్మా జయింట్స్‌ అని చెప్పుకునే సంస్థలు టర్నోవర్‌లలోనే ఘనులు తప్ప పేటెంట్లలో కాదు.

ఐటీ రంగంలో అయితే చెప్పనే అక్కరలేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి! మనవి సేవలందించే సంస్థలు మాత్రమే. దానికి కాలరెగరేసి గర్వించే బదులు మేధస్సుకు విలువ నివ్వడం నేర్చుకోవాలి. విశ్వవిద్యాలయాల స్థాయి నుంచి రిసెర్చిలు ప్రోత్సహిస్తే, ఆ సంస్కృతి పరిశ్రమలకు పాకి, మన ఉత్పాదనలకు ఒక ప్రత్యేకతను సంతరింప చేస్తుంది. సరస్వతిని ఆరాధిస్తే లక్ష్మి తనంతట తానే వస్తుంది. మేధోసంపదను గుర్తించి ప్రోత్సహిస్తే ధనసంపద దాన్ని అనుసరించి వస్తుంది.

– కెఐ వరప్రసాద్‌ రెడ్డి (డిసెంబరు 2024)

29 Replies to “కెవి: ఎంటర్‌ప్రెనార్‌ ఘనత ఏముంది?”

  1. మన దగ్గర ఇంకా చాలా పస లేని వాదాలు చాలా వున్నాయి. అడిగే వాడు లేక ఇన్నాళ్లు చెలామణి అయ్యాయి.

    “దున్నే వాడిదే భూమి” అని: అలా అనే వాడు, వాడి కి వున్న భూమి లో తమ కింద చేసే వాళ్ళకి ఆ భూమి లో వాటా రాసివ్వ డు.

    “అన్ని మతాలు సమానం” అని: అసలు దేముడు అనే వాడే వేరే వాళ్ళ దెయ్యాల్లు. నా బదులు వేరే వాళ్ళని పూజిస్తే నరకం లో పంపిస్తా అని బెదిరించే వాడి మతము, మిగతా మతాలతో ఎలా సమానం అవుతుంది? ఆ దేముడు , మిగతా దేముళ్ళ తో ఎలా సమానం అవుతాడు?

    ఇప్పటికీ ఎవడో ఒకడు కాస్త కష్టపడి , ఏదో కాస్త ఇల్లు, స్థలం కొనుక్కుంతే, పేద వాడికి గుడిసె, నీకు డాబా నా అని వాళ్ళ మీద ఏడ్చే నియో సోషలిస్టు ( బద్దకి ష్టు లు) ఎక్కువ.

  2. రిజర్వేషన్ వున్న సమాజం మనది.

    మెదడు లో సత్తా వున్న వాడికి విలువ, గౌరవం లేదు.

    మెదడు లో సత్తా లేకపోయినా , పాస్ మార్కు లు లేకపోయినా, ఫస్ట్ మార్కులు వచ్చిన వాడిని తోసి పడేసి, ఫెయిల్ అయిన వాడికి రియర్వేషన్ పేరుతో అర్హత లేని వాళ్ళకి జాబ్ ఇస్తున్న సమాజం మనది.

  3. రిజ్ర్వేషణ్* లు వున్న అంత కాలం, నిజమైన తెలివి ఉన్నవాడికి విలువ లేదు. బుర్ర లో తెలివి లేకుండా కేవలం కులం పేరుతో జాబ్ తెచ్చుకునే వాళ్ళకే విలువ.

  4. లాస్ట్ పేరాగ్రాఫ్ లో మీరు రాసింది చాల కరెక్ట్ సర్…చాల మంది ఎలక్ట్రానిక్స్ లో రాడార్ మైక్రోవేవ్, కమ్యూనికేషన్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ లాటివి చదివి కూడా సాఫ్ట్వేర్ లోకి వెళ్లిపోతున్నారు మా బ్యాచ్ ఎంటెక్ లో 3 స్పెషలిజషన్స్ లో 54 మంది లో 3ముగ్గురం మాత్రమే కోర్ సెక్టార్ లో ఉన్నాం కొంత మంది ముందు కోర్ సెక్టార్ లో ఉన్న కానీ మంచి ప్యాకేజి కోసం సాఫ్ట్వేర్ వైపు వెళ్లిపోయారు….ఇలా ఎన్ని బ్యాచ్లు ..ఎన్ని కాలేజీలు ఏంటో తెలివైన వారు అంతా సాఫ్ట్వేర్ వైపు వెళ్లిపోతున్నారు…కొంత ఆత్మ నిబ్బర్ భారత్ వచ్చాక పరిస్థితి కొంత మెరుగుపడింది కానీ ఇంకా చాల మెరుగు పడాల్సిన అవసరం ఉంది

  5. Thank you so much sir for your efforts. మీ లాంటి వారి కృషి వల్లే మందులు మన దేశంలో చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయి. Thanks a lot!!!!

    మీ writing style బాగుంది, కొంచెం కూడా సుత్తి లేకుండా. Waiting for more from you.

  6. ఒక ట్రేడర్, హిజినెస్మాన్, ఆంట్రప్రెనార్, ఇనోవేటర్, కాపిటలిజమ్, అదనపు విలువ – ఈ విషయాలమీద ఇంతకన్నా సూటిగా, పారిభాషికా పదల సుత్తిలేకుండా వ్రాయబడింది ఈ ఒక్క వ్యాసమే. రాసింది వరప్రసాద్ రెడ్డిగారే.

    ధన్యవాదాలు సర్.

Comments are closed.