ప్యారిస్ మళ్ళీ కాల్పుల మోతతో అట్టుడికింది. నిన్న ప్యారిస్‌లోని ఓ పత్రికా కార్యాలయంలోకి తీవ్రవాదులు చొరబడి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన విషయం విదితమే. ఆ ఘటనలో మొత్తం 12 మంది మృత్యువాత పడ్డారు. కొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన అనంతరం తీవ్రవాదులు తాపీగా తప్పించుకోగా, వారి కోసం పోలీసులు వేట ప్రారంభించారు.
అయితే, తీవ్రవాదుల్లో ఒకరు ఇప్పటికే పోలీసులకు లొంగిపోగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే ఓ మెట్రో రైలులో పోలీసులకు తీవ్రవాది తారసపడ్డాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్యా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయాల పాలవగా, తీవ్రవాది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్యారిస్‌తోపాటు మొత్తం ఫ్రాన్స్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు.
ఎప్పుడూ ప్రశాంతంగా వుంటే ఫ్రాన్స్ దేశం, ఆ దేశ రాజధాని ప్యారిస్, నిన్నటి, నేటి తీవ్రవాద ఘటనలతో ఉలిక్కిపడ్డాయి. ప్రజలు రోడ్లమీదకు వచ్చేందుకే భయపడ్తున్నారు. నిత్యం జనంతో కిలకిలలాడే ప్యారిస్‌లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయిప్పుడు. ప్యారిస్ చరిత్రలోనే ఇంతటి దారుణమైన తీవ్రవాద ఘటన జరగలేదని ప్యారిస్ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లోనూ తీవ్రవాదుల దాడులు జరుగుతాయన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు.