కష్టాల్లో మీడియా సంస్థలు

మీడియా వ్యాపారం అనుకున్నంత సజావుగా ఏమీ జరగడం లేదు. ఒకటి రెండు,తప్ప మిగిలిన మీడియా సంస్థలు అన్నీ ఇంతో అంతో నష్టాల్లోనే నడుస్తున్నాయి. గడచిన అయిదేళ్లలో చాలా మీడియా సంస్థలు వివిధ రాజకీయ అవసరాల…

మీడియా వ్యాపారం అనుకున్నంత సజావుగా ఏమీ జరగడం లేదు. ఒకటి రెండు,తప్ప మిగిలిన మీడియా సంస్థలు అన్నీ ఇంతో అంతో నష్టాల్లోనే నడుస్తున్నాయి. గడచిన అయిదేళ్లలో చాలా మీడియా సంస్థలు వివిధ రాజకీయ అవసరాల కోసం ప్రారంభమయ్యాయి. ఇవన్నీ మొదట్లో బాగానే పెట్టుబడులు పెట్టాయి. రాను రాను కాళ్లు పీకడం ప్రారంభమయింది. దాంతో అలా అలా కుంటుతున్నాయి.

నార్నే సంస్థ నుంచి వచ్చిన రెండు చానెళ్లు ఎన్ స్టూడియో, స్టూడియో వన్. వీటిలో ఇప్పుడు మొదటిదాన్ని అమ్మకానికి పెట్టారు. దాదాపు దగ్గరకు వచ్చింది. 

ఐ న్యూస్ ఇప్పటికి రెండుమూడు చేతులు మారింది. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర వుంది. ఆయన అమ్మకానికి సిద్దంగా వున్నారు. పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. 

బ్యాన్ పుణ్యమా అని టీవీ 9 కూడా నష్టాలను చవిచూసే పరిస్థితి కనిపిస్తోంది. 

సాక్షి టీవీలో దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి. సాక్షి దినపత్రిక అంతంతమాత్రం లాభ నష్టాలతో నడుస్తొంది. దాని వల్ల వచ్చిన నష్టం లేదు. కానీ భారీగా ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి దాకా సాక్షి టీవీకి నష్టాలే కాని లాభాలు లేవు. సుమారు 200 కోట్ల వరకు నష్టం మూటకట్టుకున్నట్లు అంచనా. ఇప్పుడు అందుకోసం దిద్దుబాటు ప్రారంభించారు.  లెక్కకు మిక్కిలిగా కొనుగోలు చేసిన ఓ బి వ్యాన్లు కొన్నింటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

సివిఆర్ చానెల్ పరిస్థితి కూడా అంతంత మాత్రం అంటున్నారు. దాన్ని కూడా కొంత కానీ మొత్తంగా కానీ అమ్మాలని చూస్తున్నట్లు బోగట్టా.

ఎంటర్ టైన్ మెంట్ చానెళ్ల పరిస్థితి  మాత్రం బాగానే వుంది. న్యూస్ చానెళ్లకే ఆదరణ అంతంత మాత్రంగా వుంది. టీవీ 9 బ్యాన్ కు గురికావడంతో ఆ మార్కెట్ ను ఎన్ టీవీ, టీవీ 5 అందుకున్నాయి. 

ఇక చానెళ్ల పరిస్థితి ఇలా వుంటే ప్రింట్ మీడియా కూడా ఏమంత ఆనందంగా లేదు. డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి సంస్థల అప్పుల వ్యవహారం తెలిసిందే. ఆ వ్యవహారాలన్నీ కోర్టుల పరిథిలోవుండడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుని నెట్టుకొస్తోంది. అయితే తాజా వేజ్ బోర్డు భారం ఆ సంస్థపై భారీగా పడిందని, దాంతో కిందా మీదా అవుతోందని జర్నలిస్టు వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఒకప్పుడు లక్షల్లో వుండే ఆంధ్రభూమి వారపత్రిక సర్క్యులేషన్ భారీగా తగ్గిపోయి, రెండు మూడు పదుల వేలల్లోకి దిగిపోయినట్లు మార్కెటింగ్ వర్గాల బోగట్టా. 

ఇదే పరిస్థితి ఈనాడుకు కూడా ఎదురైంది. వేజ్ బోర్డు కారణంగా జీతాలు భారీగా పెంచాల్సి వస్తోంది. అందుకే ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నంలో వుంది. ఇప్పటికే వంద మంది వరకు ఉద్వాసనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే ఇంకా జర్నలిస్టుల వరకు ఈ ఉద్వాసన రాలేదు. ఇక్కడితో ఆగకుండా సర్క్యులేషన్ అంతగా లేని కొన్ని ప్రచురణలను కూడా తగ్గించుకోవాలిన ఈనాడు యోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు.

సూర్య, వార్త, అలా అలా పళ్ల బిగువున ప్రచురణలు కొనసాగిస్తున్నాయి. ఆయా యాజమాన్యాలకు వున్న అవసరాల దృష్ట్యా ప్రచురణలు నిలిపివేసే పరిస్థితి లేదు. 

ఇదిలా వుండగా ఈ పత్రికలకు మాత్రం రాను రాను డిమాండ్ పెరుగుతోంది. ఈనాడు, సాక్షి ఈ పేపర్ లకు, నెట్ ఎడిషన్ లకు మాంచి డిమాండ్ వుంది. ఆ రెండూ కూడా అగ్రస్థానంలోనే వున్నాయి. ఆ రూపంలో వాటికి మంచి ఆదాయమే లభిస్తోంది. 

చానెళ్లకు, పత్రికలకు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు ఆదాయాన్ని అందించే ప్రధాన సంస్థలు. అయితే ఇటీవల విద్యా సంస్థల వ్యాపారం కూడా కాస్త పోటాపోటీగానే వుంది. ముఖ్యంగా ఎమ్ సెట్ వ్యామోహం తగ్గింది. ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితి బాగా లేదు. దాంతో ఈ ప్రభావం ప్రకటనలపై కూడా పడుతోంది. 

మరోపక్క విభజన కూడా పత్రికల ఖర్చులు పెంచింది,. తెలంగాణ కోసం ఎడిషన్లు, ప్రత్యేక పేజీలు, అందుకోసం సిబ్బంది వంటి వ్యవహారాలు అదనపు భారమవుతున్నాయి. అయితే ఈనాడు, సాక్షి మినహా మిగిలినవి ఈ ప్రత్యేక ఎడిషన్ల జోలికి అంతగా పోలేదు. ప్రజాశక్తి మాత్రం ఆంధ్ర ఎడిషన్ ను విజయవాడ కేంద్రంగా చేసుకుని తయారుచేస్తోంది. 

అన్నింటికి మించి పెరిగిపోతున్న ఖర్చులు తగ్గించుకునేందుకు పాఠకులు చూస్తున్నారు. నెలకు రెండు వందలు ఖర్చు చేసే బదులు, దాంతో ఇంటర్ నెట్ పెట్టుకుంటే అన్ని పేపర్లు సిస్టమ్ లో చదువుకునే సౌలభ్యం వచ్చేసింది. పైగా అండ్రాయిడ్ ఫోన్ లు పెరిగాక వార్తలు ప్రతి నిమిషం తెలుసుకుంటున్నారు. దాంతో ప్రింట్ ఎడిషన్ల డిమాండ్ తగ్గుతోంది. 

రంగులభారం కూడా తెలుగు పత్రికలకు వీడని శాపమైంది. ఒకప్పుడు జ్యోతి, ఉదయం కలిసి ఈనాడుతో పోటీకి దిగి రంగుల ఎడిషన్లు ప్రారంభించాయి. దాంతో అన్నీ అదే దోవ పట్టాయి. ఇప్పుడు మానితే అందరూ మానాలి. లేదంటే లేదు. పైగా ముద్రణకు వాడే సరుకులన్నీ దిగుమతితో ముడిపడి వున్నవే. వాటి ధరలు పైకే తప్పు కిందకు దిగడం లేదు. దాంతో ముద్రణ భారమై, ధరలు పెంచుతున్నాయి. దాంతో తప్పని సరైన వారే పత్రికలు కొంటున్నారు. 

మొత్తం మీద ఇటు విజువల్ మీడియా, అటు ప్రింట్ మీడియా రెండూ ఇబ్బందుల్లోనే వున్నాయి.

చాణక్య

[email protected]