మూడంటే మూడు మ్యాచ్చుల్లో విజయాలు సాధిస్తే చాలు మళ్లీ ప్రపంచకప్ మనదైపోతుంది! డిఫెండిండింగ్ చాంపియన్ హోదాకు జస్టిఫికేషన్ అయ్యి.. ప్రపంచకప్ ను మళ్లీ టీమిండియా సొంతం చేసుకొంటుంది. వరస విజయాలతో ఊపు మీదున్న ధోనీ సేనకు ఆ మూడు విజయాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు! అయితే.. ఆ మూడు విజయాలు రాబోయే మూడు మ్యాచ్ లలో సాధించాల్సినవి కావు.. క్వార్టర్ ఫైనల్ అటుపై సెమీఫైనల్స్ ఆపై ఫైనల్ మ్యాచ్ లలో సాదించాల్సిన విజయాలు. ఒక్కొక్కటి గా సాధిస్తూ.. ఆ మూడు మ్యాచ్ లలోనూ ఇండియా గెలిచిందంటే ఆసీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ ఇండియా సొంతం అవుతుంది.
ఇప్పటి వరకూ ఇండియా రెండు మ్యాచ్ లను ఆడింది. ఆ రెండింటిలోనూ విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకొంది. ఇకపై లీగ్ దశ లో ఇండియా ఆడబోయే మ్యాచ్ లను సునాయాసంగానే గెలిచేయగలదు. యూఏఈ, వెస్టిండీస్ , జింబాబ్వే, ఐర్లాండ్ లతో ఇండియా మ్యాచ్ లను ఆడాల్సి ఉంది. ఈ జట్లను తక్కువగా చూడకూడదు కానీ.. టీమిండియా ప్రస్తుత ఫామ్ ను బట్టి లీగ్ దశ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే అవకాశాలే అధికారం.
అయితే ఆ తర్వాతే అసలు కథ ఆరంభం. రెండు నాకౌట్ మ్యాచ్ లు.. ఒక ఫైనల్. అంతే ఆ మూడింటిలోనూ గెలిస్తే ధోనీ సేన వరసగా రెండో సారి ప్రపంచ విజేతగా నిలుస్తుంది. మరి ప్రత్యర్థులు ఎవరో ఇంకా తెలీదు.. అయితే ప్రత్యర్థి ఎవరైతేనేం! వేదిక ఎక్కడైతేనేం.. దక్షిణాఫ్రికాను ఇండియా ఓడించిన తీరు చూశాకా.. ఈ ప్రపంచకప్ కు హాట్ ఫేవరెట్స్ గా చెప్పబడుతున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లకు హెచ్చరికలే వెళ్లాయి. కీలకమైన మ్యాచ్ లను మీరు ఇండియాతో తలబడబోతున్నారనే హెచ్చరికలు వెళ్లాయి!
అయితే ఎమ్ సీజీలో భారత్ కు కొన్ని పరిస్థితులు అనుకూలించాయి. టాస్ గెలవడం వంటివనమాట! ఇలాంటి పరిస్థితులు అయితే ఎప్పుడూ ఇండియాకు అనుకూలంగానే ఉంటాయనుకోవాలి. కెప్టెన్ ధోనీ సుడి అలాంటిది. ధోనీ కెప్టెన్అయినప్పటి నుంచి ఎన్నో అనూహ్యమైన పరిస్థితులు భారత జట్టుకు అనుకూలంగా మారాయి. కాబట్టి అలాంటి శకునాలు ఇండియాకే అనుకూలంగా ఉంటాయని చెప్పాలి.
స్థూలంగా చూస్తే.. బ్యాట్స్ మన్ లు, బౌలర్లు ఇదే రీతినే చెలరేగితే.. క్వార్టర్స్ , సెమిస్ లను దాటుకొని ఫైనల్ లో కూడా ఇండియా జయకేతనం ఎగరేయడం కష్టమేమీ కాదు! “మేరా భారత్ మహాన్..' అనుకొనే తరుణం రావడం అసాధ్యమేమీ కాదు!